
చారిత్రక తప్పిదానికి చంద్రబాబే కారణం: షర్మిల
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ చారిత్రక తప్పిదం చేయబోతుంటే దానికి మద్దతు పలికి చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. సమైక్య శంఖారావం బస్సుయాత్రలో భాగంగా ఆదివారం రాత్రి కావలిలో ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.
తెలంగాణకు అనుకూలంగా బ్లాంక్ చెక్కు మీద సంతకం పెట్టినట్లు చంద్రబాబు లేఖ రాసిచ్చేయడంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విభజించే సాహసం చేస్తోందని చెప్పారు. ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయనను ప్రజలంతా నిలదీయాలని పిలుపునిచ్చారు.
తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఆ అగ్గిలో కాంగ్రెస్ చలి కాచుకుంటోందని దుయ్యబట్టారు. న్యాయం చేసే సత్తా లేకుంటే విభజించే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. జగన్ జైల్లో ఉన్నా జననేతే అన్నారు. నిర్బధంలో ఉండి కూడా ప్రజల కోసం వారం రోజులు నిరాహార దీక్ష చేశాడని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి అబద్దపు కేసులు పెట్టి జైలు పాల్జేశారని షర్మిల ఆరోపించారు.