
‘వైఎస్ జగన్ దీక్షను విజయవంతం చేయండి’
విజయవాడ: రుణమాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర, రుణమాఫీలో మోసానికి నిరసనగా వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చేనెల ఒకటి, రెండు తేదీల్లో గుంటూరులో చేపట్టనున్న దీక్షలో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మద‍్దతు ధర లేక మిర్చి, పసుపు, మినుము రైతులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
మిర్చికి క్వింటాకు రూ.1500 అదనంగా ఇస్తామన్న ప్రభుత్వం ఇంతవరకూ ఏ ఒక్క రైతుకు రూపాయి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రూ.5వేల కోట్లతో ఏర్పాటు చేస్తామన్న ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతుల అండతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారిని ఆదుకోవాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. కాగా టీ కప్పులో తుఫాను మాదిరిగానే వైఎస్ జగన్‌పై వేసిన సీబీఐ కేసు కూడా వీగిపోతుందని ఆయన అన్నారు.