కోరుకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. సోమవారం కోరుకొండ మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల కన్వీనర్ చింతపల్లి చంద్రం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ప్రజావాణి సదస్సు నిర్వహిస్తున్న ఎంపీడీఓ ఈ.మహేశ్వరరావు, మండల వ్యవసాయాధికారి కె.శ్రీనివాస్‌లను రైతు రుణమాఫీపై నిలదీశారు. ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా రైతులతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓకు అందజేశారు.
రైతులనుద్దేశించి విజయలక్ష్మి మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ పూర్తిగా చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నేడు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. రుణమాఫీ కోసం రైతులు బ్యాంకు అకౌంట్లు, ఆధార్, రేషన్‌కార్డులు, పొలం సర్వే నంబర్లు జిరాక్స్ కాపీలు వ్యవసాయశాఖ, బ్యాంకు, రెవెన్యూ అధికారులకు ఇచ్చినా చాలా మందికి రుణమాఫీ కాలేదన్నారు. బ్యాంకు వద్దకు వెళ్తే ఆధార్‌కార్డు లేదు, రేషన్‌కార్డు లేదు అంటూ రైతులను ఇబ్బందిపెడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులకు న్యాయం చేయక పోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ మండల, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు చింతపల్లి చంద్రం, తోరాటి శ్రీను, వైఎల్‌ఎన్ స్వామి, యడ్ల సత్యనారాయణ, కల్యాణం చిట్టిబాబు, కాలచర్ల శివాజీ, వాకా నరసింహారావు, అరిబోలు చినబాబు, అత్తిలి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రైతులను మోసం చేస్తున్న బాబు
Published Tue, Dec 23 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM
Advertisement