ఏమంటారు బాబూ!
పర్యటనలతో రుణం తీరిపోతుందా!
ప్రకటనలతో మేలు కలుగుతుందా?
నేడు జిల్లాకు ముఖ్యమంత్రి రాక
చాటపర్రులో నూతన సంవత్సర,
సంక్రాంతి సంబరాలకు శ్రీకారం
సాక్షి ప్రతినిధి, ఏలూరు :‘అన్ని నియోజకవర్గాల్లో గెలిపించి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టిన పశ్చిమగోదావరి జిల్లా రుణం తీర్చుకోలేనిది. నాకు ప్రియమైన జిల్లా కాబట్టే ప్రత్యేకమైన అభిమానంతో కొత్త సం వత్సరం రోజు ఇక్కడకు వచ్చాను. నూతన సంవత్సర వేడుకలు మీ మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది’ గురువారం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చాటపర్రులో మాట్లాడే మాటలివే. ఇందులో ఎక్కడా అక్షరం పొల్లుపోదు. ఈ రుణం మాటలు వల్లె వేయడం కంటే పశ్చిమగోదావరి జిల్లాకు మేలు చేసే కార్యాచరణను ప్రకటించాలని ప్రజానీకం కోరుతోంది. కొత్త ప్రకటనలు దేవుడెరుగు.. కనీసం గతంలో చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన నిట్‌నైనా తాడేపల్లిగూడెంకు తీసుకురావాలని అక్కడి ప్రజ వేడుకుంటోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా పర్యటనలకు పశ్చిమగోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుట్టిన చంద్రబాబునాయుడు ఇప్పుడు నూతన సంవత్సరం-2015 తొలిరోజు వేడుకలను ఈ ప్రాంత ప్రజల మధ్యే జరుపుకోవాలని నిర్ణయించారు. సంక్రాంతి వేడుకలను కూడా ఇక్కడి నుంచే మొదలుపెట్టాలని ఆయన భావించడంపై జిల్లా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ముందునుంచీ చెబుతున్నట్టు పర్యటనల్లో పశ్చిమకు ఇస్తున్న ప్రాధాన్యతను చంద్రబాబు జిల్లా అభివృద్ధి విషయంలో కూడా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
ముఖ్యమంత్రిగా 2014లో మూడుసార్లు జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఎక్కడా ప్రగతి, అభివృద్ధి పనుల విషయమై స్పష్టమైన ప్రకటన చేయలేదు. సరిగ్గా మూడు వారాల క్రితం ఉంగుటూరు మండలం కైకరంలో రుణమాఫీ అర్హత కార్డులను అందించేందుకు వచ్చిన చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో చూడాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించానని చెప్పారు. వాస్తవానికి గత జూలైలో జంగారెడ్డిగూడెంకు వచ్చిన సందర్భంలోనూ అన్ని శాఖల అధికారులతో చంద్రబాబు సమావేశమై జిల్లాకు ఏం చేయొచ్చో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వెంటనే అధికారులు జిల్లాలో ఏయే ప్రాంతాలు ఏ పరిశ్రమలకు అనువుగా ఉంటాయో నివేదించినా ఇప్పటివరకు ప్రభుత్వ పెద్దలెవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. సరే, కొత్త పరిశ్రమలు, నూతన ప్రకటనలు పక్కనపెట్టినా గతంలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన వాటికి కూడా అతీగతీ లేదంటున్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.
పట్టిసీమపై ఏం చెబుతారో
గోదావరి నదిపై పట్టిసీమ వద్ద కృష్ణా, రాయలసీమ జిల్లాలకు నీరు తరలించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మించాలనే నిర్ణయంపై ఉభయగోదావరి జిల్లాలకు చెందిన రైతులు భగ్గుమంటున్నారు. దీని నిర్మాణాన్ని ప్రాణాలొడ్డి అడ్డుకుంటామని తెగేసి చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చిందంటూ రైతులు ఉద్యమబాట పట్టారు. మరోపక్క పట్టిసీమ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపుతూ కృష్ణా జిల్లాకు చెందిన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శాఖాపరమైన పనులను వేగవంతం చేస్తున్నారు. గత పర్యటనలో దీనిపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయకుండా దాటవేసినా ఈసారి పర్యటనలో స్పష్టత ఇస్తారని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
రుణమాఫీ రగడపై ఏమంటారో
రుణాలు తీసుకున్న 90శాతం మంది రైతులు అరకొర మాఫీలతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రూ.50 వేలలోపు రుణాలున్న వారికి ఒకేసారి మాఫీ అవుతుందన్న సర్కారు ప్రకటనలు వెక్కిరించే విధంగా జిల్లాలో వాస్తవ పరిస్థితులు ఉన్నాయి. రూ.50వేలలోపు రుణాలున్న వారికి కూడా బ్యాంకుల్లో రూ.20 వేలు, రూ.25 వేల చొప్పున మాత్రమే రుణమాఫీ కింద జమ అవడంతో రైతులు రగిలిపోతున్నారు. ఇదే విషయమై జిల్లావ్యాప్తంగా బ్యాంకుల వద్ద ధర్నాలు చేస్తున్నారు. గురువారం చంద్రబాబునాయుడు పర్యటనకు వస్తున్న చాటపర్రులోని కెనరా బ్యాంకును కూడా ఇటీవల రైతులు ముట్టడించి తాళాలు వేశారంటే రుణమాఫీ విషయంలో జిల్లావ్యాప్తంగా రైతుల ఆక్రోశం ఎలా ఉందో అర్థమవుతుంది. ఇక డ్వాక్రా రుణాలు, కౌలు రైతుల రుణాల రద్దు విషయంలో ఇప్పటికీ స్పష్టత లేక వారూ ఆందోశన పథానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు జిల్లాకు వస్తున్న చంద్రబాబుకు భారీ బందోబస్తులో టీడీపీ నేతలు, అధికారులు, ఎంపిక చేసిన రైతులు ప్రతిగా శుభాకాంక్షలు చెప్పొచ్చు. కానీ సర్కారు నిర్వాకంతో నిజమైన పండగ వాతావరణం జిల్లాలో నెలకొంటుందా.. అంటే ఎవరి వద్దా సరైన సమాధానం లేదు.
నిట్‌పై స్పష్టతనిస్తారా
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టె క్నాలజీ (నిట్)ని పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. జిల్లాలో నిట్ ఏర్పాటుకు తాడేపల్లిగూడెం అనుైవె న ప్రాంతమని, కేంద్రం నుంచి వచ్చిన ఐఏఎస్‌ల బృందం, సాంకేతిక బృం్దం సం తృప్తిని వ్యక్తం చేశాయి. ఇక నిట్ తాడేపల్లిగూడెంలోనే ఏర్పాటవుతుందనుకుంటున్న సమయంలో దానిని కృష్ణా జిల్లా ఆగిరిపల్లికి తరలిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. నిట్‌ను పశ్చిమలోనే నెలకొల్పాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కైకరం సభలో విజ్ఞప్తి చేసినా సీఎం ఏమీ మాట్లాడలేదు. కొత్తగా ప్రకటనలేమో గానీ కనీసం నిట్‌నైనా జిల్లా నుంచి పోకుండా చూడాలని తాడేపల్లిగూడెం వాసులు అటు బీజేపీ, ఇటు టీడీపీ నేతలను కోరుతూ వస్తున్నారు. గురువారం నాటి పర్యటనలో చంద్రబాబు ఏ ప్రకటన చేస్తారో చూడాలి.