
పందిళ్లపల్లిలో చేనేత మగ్గాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి శిద్దా తదితరులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం జిల్లా పర్యటనలో పాత హామీలనే మరోమారు వల్లె వేశారు. గతంలో ఎప్పటికప్పుడు హామీల తేదీలను మార్చి చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి ఈసారి మాత్రం గత పర్యటనలో చెప్పిన తేదీలనే మళ్లీ ప్రస్తావించారు. నాలుగేళ్ళ పాలనలో జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికల వేళ పాత హామీలనే ఏకరువు పెట్టడం అధికార పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఉదయం 11 గంటల సమయంలో హెలికాప్టర్‌లో పామూరు మండలం మండలం దూబగుంట్ల చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ 208.45 ఎకరాలలో రు.1200 కోట్లతో నిర్మిచనున్న ఏపీజే అబ్దుల్‌కలాం ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి భూమిపూజ చేసి, పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం రామన్నపేట, పందిళ్లపల్లి గ్రామాల్లో పర్యటించారు. పందిళ్లపల్లిలో జాతీయ చేనేత దినో త్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
నెలకోమారు వెలిగొండ సందర్శన..
గత నెల 28న ఒంగోలుకు వచ్చిన ముఖ్యమంత్రి వచ్చే సంక్రాంతి నాటికి టన్నెల్–1 పనులను పూర్తి చేసి వెలిగొండ నీటిని విడుదల చేస్తామని చెప్పారు. మంగళవారం పామూరు మండల పర్యటనలో మాట్లాడుతూ వెలిగొండకు తానే శంకుస్థాపన చేశానన్నారు. సంక్రాంతి లోపల 1వ టన్నెల పనులు పూర్తిచేసి సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో నీరిస్తామన్నారు. పోలవరం లాగే నెలకొకసారి వెలిగొండను సందర్శిస్తానన్నారు. ఆగిన వెలిగొండ పనులు రెండు రోజుల్లో మొదలవుతాయని సీఎం చెప్పారు. వెలిగొండ నీటితో గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. వెలిగొండకు శ్రీశైలం టన్నెల్ ద్వారానే నీరు రావాల్సి ఉందన్నారు. ప్రకాశం జిల్లాకు సైతం గోదావరి నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు.
ఒంగోలు డెయిరీకి రూ.37 కోట్లు నిధులిచ్చి పునరుద్దరించినట్లు సీఎం చెప్పారు. గోదావరి నీళ్లు సాగర్ రైట్ మెయిన్ కెనాల్‌కు తెస్తున్నామన్నారు. కనిగిరి ప్రాంతంలో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానిఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) అభివృద్ధి చేస్తామన్నారు. దర్శిలో మెగా ఇండస్ట్రీయల్ హబ్ వస్తుందన్నారు. రామాయపట్నం పోర్టుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. సుబాబుల్, జామాయిల్ రైతుల కోసం జిల్లాలో ఆసియా పల్స్ అండ్ పేపర్ పరిశ్రమతో మాట్లాడుతున్నట్లు సీఎం చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే 28వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. మార్టూరులో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కనిగిరి నియోజకవర్గంలో వెయ్యి కోట్లతో ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీటిని అందిస్తామన్నారు.
నేతన్నకు నెలకు రూ.4000 కరువు భత్యం
వేటపాలెం: సీఎం చంద్రబాబు మంగళవారం పర్యటనలో ఎన్నికల తాయిలాలుగా చేనేతలపై వరాల జల్లులు కురిపించారు. వేటపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు షెడ్యూల్ కంటే గంటన్నర ఆలస్యంగా వచ్చారు. పామూరు నుంచి మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో రామన్నపేట గ్రామంలో కొత్తిళ్ళ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అనంతరం బస్సులో భోజనం చేసి పందిళ్ళపల్లి స్టేజీ బజారు వెళ్లే రోడ్డు వద్ద రూ.5.17 కోట్లతో నిర్మించనున్న పీహెచ్‌సీ నూతన భవనం, జలశుధ్ధి కేంద్రం, శ్మశానాల అభివృద్ధి పనులు, అంగన్‌వాడీ కేంద్రాలు, అంతర్గత సీసీ రోడ్లు, పంచాయతీ నూతన భవనం, డంపింగ్ యార్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం పాదయాత్రగా స్టేజీ సెంటర్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన నూలుకు రంగుల అద్దకం, యార్న్, చేనేత చీరలకు సంబంధిత చేనేత ప్రదర్శనలు తిలకించారు. అనంతరం మగ్గం గురించి తెలుసుకుని కాసేపు మగ్గం నేసారు. గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించి నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ గృహాన్ని ప్రారంభించారు. అక్కడ ఉన్న చేనేత కార్మికుడు పింజల యేసు ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలసుకున్నారు. తర్వాత నిరుద్యోగ యువతకు యువనేస్తం పథకాన్ని వివరించి రూ.వెయ్యి ఇస్తామని తెలిపారు.
చీరాల వస్త్రానికి పేటెంట్ ఇస్తాం..
మధ్యాహ్నం 3.20 గంటలకు సీఎం చంద్రబాబు సెయింటాన్స్ ఇంజనీరింగ్ కాలేజీకి జాతీయ చేనేత దినోత్సవ బహిరంగ సభకు వెళ్లారు. ఈ సందర్భంగా చీరాల వస్త్రానికి పేటెంట్ ఇస్తామని, చేనేతలకు వర్షం పడే కాలంలో గుంటల్లో నీరు నిలిచి పనులు సాగనందున నెలకు రూ.4000 కరువు భత్యం ఇస్తామని, హెల్త్‌స్కీం పునరుద్ధరిస్తామని, 100 యూనిట్లలోపు ఉచిత కరెంటు ఇస్తామని, త్రిఫ్ట్ ఫండ్ 16 శాతానికి పెంచుతామని, జీఎస్టీపై పోరాటం చేస్తామని, రూ. 2.50 లక్షలతో హౌస్ కం వర్క్‌షెడ్ నిర్మిస్తామని, ఆప్కో బకాయిలను చెల్లిస్తామని, యార్న్‌కు 30 శాతం సబ్సిడీ ఇస్తామని, అమరావతిలో 10 ఎకరాల్లో చేనేత భవనం నిర్మిస్తామని, చేనేతల రుణమాఫీ చేశామని, చేనేత అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, పరిటాల సునీత, ఎమ్మెల్సీ పోతుల సునీత, కరణ బలరాం, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు పోతుల రామారావు, కలెక్టర్ వి.వినయ్‌చంద్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు 2000 మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలను పర్యవేక్షించారు.

చేనేత దినోత్సవ సభలో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు, వేదికపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు

పందిళ్లపల్లి సభకు హాజరైన మహిళలు
Comments
Please login to add a commentAdd a comment