లేనిపోని ఊహల్లోకి వెళ్లొద్దు! | Chandrababu Naidu interact with students in tirupati | Sakshi
Sakshi News home page

లేనిపోని ఊహల్లోకి వెళ్లొద్దు!

Published Sun, Aug 5 2018 3:17 AM | Last Updated on Tue, Aug 21 2018 9:36 PM

Chandrababu Naidu interact with students in tirupati - Sakshi

కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

సాక్షి తిరుపతి: ‘ఓటు హక్కు ఉన్న వారు మీరు.. ఏది కరెక్టో ఆలోచించే శక్తి మీకు వుంది. లేనిపోని ఊహాల్లోకి వెళ్లవద్దు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యార్థులకు సూచించారు. తిరుపతి తారకరామా స్టేడియంలో శనివారం జ్ఞానభేరి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాను యూటర్న్‌ తీసుకున్నానని, వైఎస్సార్‌సీపీ ట్రాప్‌లో పడ్డానని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని జ్ఞానభేరిలో ప్రస్తావించారు. తాను రాజకీయాల్లోకి వచ్చే నాటికి ప్రధాని నరేంద్రమోదీ అసలు రాజకీయాల్లోనే లేరని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో నేను యూటర్న్‌ తీసుకోలేదన్నారు. వెంకన్న సాక్షిగా ఆనాటి ప్రధాని హామీ ఇచ్చి నమ్మక ద్రోహం చేశారని మోదీని ఉద్దేశించి చంద్రబాబు అనడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. మోదీ అప్పుడు ప్రధాని కాదు కదా అని చర్చించుకున్నారు.  
డబ్బులుంటే భృతి ఎక్కువ ఇచ్చేవాళ్లం
యువనేస్తం కింద నెలకు రూ.1,000లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తమదేనని చంద్రబాబు అన్నారు. డబ్బులుంటే ఇంకా ఇచ్చే వాళ్లమని చెప్పారు. ప్రస్తుతం రూ.16లక్షల కోట్ల పెట్టుబడితో రాష్ట్రానికి 2,760 పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. వీటిలో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభించాయని, రాబోయే రోజుల్లో 36లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రాష్ట్రానికి 12 యూనివర్సిటీలు వచ్చాయని వాటిలో ఇప్పటికే ఆరు ప్రారంభమయ్యాయని చెప్పారు.

విశ్వవిద్యాలయాల మధ్య పోటీతత్వం ఉండాలన్నారు. అన్ని కళాశాలల్లో వైఫై సౌకర్యం కల్పించామని చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత విద్యార్థులను ప్రశ్నించగా ‘లేదు.. లేదు’ అనే సమాధానమిచ్చారు. కాగా, గ్రామీణ సమస్యలపై అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి ప్రాజెక్టులను రూపకల్పన చేసే ప్రతీ జిల్లాకు రూ.10 కోట్లు చొప్పున మొత్తం రూ.130 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల అధ్యయనానికి కలెక్టర్, వీసీ ప్రణాళికలు సిద్ధంచేయాలన్నారు.  

రాష్ట్రంలో జనాభా పెరగడంలేదు    
రాష్ట్రంలో జనాభా పెరగడంలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే కొద్ది రోజులకు రాష్ట్రంలో వృద్ధులు తప్ప యువత కనిపించదన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ పెళ్లిళ్లు చేసుకోవాలని చంద్రబాబు కోరారు. రోబోలు మనుషులకు ప్రత్యామ్నాయం కాదని చెప్పారు. మగపిల్లలు కూడా వంటచేయడం అలవాటు చేసుకోవాలన్నారు. కాగా, గ్రామీణ సమస్యల పరిష్కారానికి రూపొందించిన ప్రాజెక్టు రిపోర్టును వివిధ యూనివర్సిటీ విద్యార్థులు ముఖ్యమంత్రికి వివరించారు.  

విద్యార్థుల ఆందోళన
కాగా, ప్రత్యేక హోదా, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ డిమాండ్‌ చేస్తూ పలువురు విద్యార్థి సంఘాల నేతలు సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వేదిక వద్దకు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు ఇది గమనించి వారిని ఈడ్చుకెళ్లారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య పెనుగులాట చోటుచేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సీఎం ప్రసంగం పూర్తయ్యాక మరో విద్యార్థి ఇదే విషయంపై సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అతనిని కూడా ఈడ్చుకెళ్లి స్టేషన్‌కు తరలించారు. అలాగే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం నాయకులను శనివారం వేకుజామునే  పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. సీఎం విజయవాడ వెళ్లాక రాత్రి 8.45కు వారందరినీ విడిచిపెట్టారు.
 

రాష్ట్రంలో నిర్బంధకాండ!
సీఎం పర్యటనలతో ముందస్తు అరెస్టులు.
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటనలకు వస్తున్నారంటే ఆ జిల్లా మొత్తం బెంబేలెత్తిపోయే పరిస్థితులు దాపురించాయి. ముందస్తు అరెస్టులతో పోలీసులు నిర్భందకాండను అమలుచేస్తున్నారని జనం మండిపడుతున్నారు. తాజాగా.. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమించిన యువతపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జీ చేసిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో తలకు తీవ్రగాయమైన యువజన నాయకుడు నాయక్‌ను శుక్రవారం కడప ఆసుపత్రి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

సీఎం చంద్రబాబు శనివారం తిరుపతిలో జ్ఞానభేరీ కార్యక్రమానికి రావడంతో శుక్రవారం అర్ధరాత్రి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయక్‌ను పోలీసులు నిర్బంధించి తీసుకెళ్లిపోయారని సమాచారం. తలకు గాయమై 48 గంటల పాటు వైద్యుల పరిశీలనలో ఉండాల్సిన నాయక్‌ను పోలీసులు తీసుకెళ్లి చిత్తూరు జిల్లాలోని ఒక వసతి గృహం (హాస్టల్‌)లో నిర్బంధించడంపై వామపక్ష నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలా ఒక్క తిరుపతిలోనే కాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టులు చేసి పోలీసులు టెర్రర్‌ పుట్టిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement