తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే ఈలినాని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఈలి నాని ఆయన్ని కలిశారు. ఈలినాని టీడీపీ చేరే ప్రయత్నంలో భాగంగానే ఈ భేటీ జరిగింది. అయితే త్వరలో గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, తాడిపత్రి ఎమ్మెల్యే జే సీ దివాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీపై ఆ ప్రాంత ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. దాంతో రానున్న ఎన్నికల్లో తమకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందులోభాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు తాజా మంత్రులు, సీనియర్ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడును ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కూడా కలిశారు. తనకు నల్గొండ జిల్లా కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని చంద్రబాబును ఈ సందర్భంగా వేణుమాధవ్ కోరినట్లు సమాచారం.