ఢిల్లీ పిలిచింది..బాబు పలికాడు | Chandrababu naidu responded to Central Government call on Telangana Bill | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పిలిచింది..బాబు పలికాడు

Published Thu, Jan 9 2014 1:35 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

ఢిల్లీ పిలిచింది..బాబు పలికాడు - Sakshi

ఢిల్లీ పిలిచింది..బాబు పలికాడు

  •  ఆజాద్ రాక.. ఆగమేఘాలపై మారిన సీను
  •  అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, టీడీపీ డ్రామాలు
  •   విభజన బిల్లుపై పరస్పర ‘అంగీకారం’తో చర్చ షురూ
  •   ‘సమాచారం’ కోరిన టీడీపీ.. అందజేస్తామన్న ప్రభుత్వం
  •   వెంటనే ఆందోళన విరమించిన తమ్ముళ్లు.. చర్చ మొదలెట్టిన వట్టి
  •   ఇంతకాలం చేసిందంతా నటనే.. ఈ మాత్రానికి ఎందుకీ డ్రామా?
  •   క్లాజులపై ఓటింగ్ పేరుతో రెండు పార్టీల కొత్త నాటకం
  •   నిజానికి ఓటింగ్ ఉంటుందని ప్రకటనే చేయని స్పీకర్
  •   చర్చంటే విభజనకు ఒప్పుకున్నట్టేగా అన్న ప్రశ్నకు 
  •   మౌనమే సమాధానం.. కాంగ్రెస్, టీడీపీ సీమాంధ్ర నేతలు 
  •   చర్చకు అంగీకరించడంపై టీఆర్‌ఎస్ హర్షం
  • సాక్షి, హైదరాబాద్:  రాష్ట్ర విభజన బిల్లు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇంతకాలం వేసుకున్న ముసుగులు తొలగిపోయాయి. హస్తిన ‘పిలుపు’నకు చంద్రబాబు చకచకా స్పందించారు. బిల్లుపై శాసనసభలో తలెత్తిన ప్రతిష్టంభనను తొలగించి చర్చలో పాల్గొనాలన్న కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేశారు. బుధవారం హస్తిన నుంచి ‘ఆజాద్’ ఆగమనం అనంతరం ఈ దిశగా పరిణామాలన్నీ శరవేగంగా జరిగిపోయాయి. బిల్లుపై ఏదో కొంత సమాచారం కావాలని టీడీపీ కోరడం, దాన్ని సమకూర్చుతామని ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇవ్వడం... ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలంతా ఆ వెంటనే మంత్రం వేసినట్టుగా తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవడం... ఇలా శాసనసభలో విభజన బిల్లుపై చర్చకు అడుగు ముందుకు పడింది. చర్చలో పాల్గొనడం ద్వారానే బిల్లును వ్యతిరేకించవచ్చని కొత్త కథను ప్రచారం చేయాలన్న అంతర్గత అవగాహనతో రెండు పార్టీల నేతల హైడ్రామా మధ్య బుధవారం అసెంబ్లీలో చర్చను మొదలుపెట్టారు. మొదటి వాదనల ప్రకారం, సవరణల సంగతెలా ఉన్నా చర్చకు సమ్మతించడమంటే మౌలికంగా బిల్లును అంగీకరించినట్టే కదా అన్న ప్రశ్నకు మాత్రం జవాబు లేదు!
     
    బిల్లు ముసాయిదాపై శాసనసభలో అసలు చర్చే మొదలు కాలేదని ఇంతకాలం వాదిస్తూ వచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతలు ఒక్కసారిగా రూటు మార్చి చర్చకు అంగీకరించడం, అదీ కాంగ్రెస్ హైకమాండ్‌లో కీలకమైన నేత గులాం నబీ ఆ‘జాదు’ నగరంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. ఇంతకాలం చర్చను అడ్డుకున్న టీడీపీ సీమాంధ్ర నేతలు బుధవారం మాత్రం ఒక్కసారిగా వెనక్కు తగ్గారు. బుధవారం స్పీకర్ పోడియం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు నిరసన కొనసాగిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా సభలో మంత్రి వ ట్టి వసంతకుమార్ విభజన బిల్లుపై చర్చను కొనసాగించారు. సభలో అసలు చర్చే ప్రారంభం కాలేదని ఇంతవరకు మండలిలో చెప్పిన కిరణ్‌తో పాటు సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతలు కూడా బుధవారం ఆ వివాదం ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. సభలో చర్చ ప్రారభమైందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పిన అంశానికే కట్టుబడ్డారు. మొత్తంమీద శాసనభలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర నేతలు చర్చకు ముందుకు రావడంతో టీఆర్‌ఎస్‌తో పాటు మిగతా పార్టీల్లోని తెలంగాణ నేతల్లో హర్షం వ్యక్తమైంది. చర్చను ప్రారంభింపజేయడం తమ విజయమన్న తెరాస నేత ఈటెల రాజెందర్ వ్యాఖ్యను బట్టి.. ఇది సమైక్యవాదుల అనుకూల పరిణామమెలా అవుతుందన్న సందేహానికి సమాధానమే లేదు.
     
     పలు దఫాలుగా సంప్రదింపులు
     విభజన బిల్లు ముసాయిదాపై చర్చ కొనసాగించేలా ఒక అవగాహనకు రావడానికి బుధవారం కాంగ్రెస్, టీడీపీ నేతల మధ్య అనేక దఫాలుగా సంప్రదింపులు, తర్జనభర్జనలు జరిగాయి. బిల్లుపై చర్చించి రాష్ట్రపతికి తిప్పి పంపే విషయంలో సహకరిస్తామని కొద్దిరోజులుగా కాంగ్రెస్ నాయకత్వానికి చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ, నేరుగా చర్చకు అంగీకరిస్తే ఇబ్బందులొస్తాయని.. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా పరోక్షంగా కొన్ని సాకులు వెతుక్కుని, చివరకు ఇలా చర్చకు సిద్ధం అన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇరు పార్టీల నేతల మధ్య కొద్దిరోజులుగా అంతర్గతంగా ఈ విషయమై చర్చలు సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రపతి ఇచ్చిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకా జాప్యం చేయడం తగదని కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో కాంగ్రెస్, టీడీపీల నేతలు హైడ్రామా నడిపించారని అసెంబ్లీ లాబీల్లో ఇరు పార్టీల తెలంగాణ నేతలు చెప్పుకొచ్చారు. ఏదైతేనేం, తమ పార్టీల సీమాంధ్ర నేతలు చర్చకు అంగీకరించడం శుభ పరిణామమని కూడా వారన్నారు. నేరుగా చర్చకు అంగీకరిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఉద్దేశంతో బిల్లుపై కొంత సమాచారం కావాలని టీడీపీ కోరినట్టు... ఆ సమాచారాన్ని అందజేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు చిన్న కథ నడిపించి చివరకు చర్చకు శాసనసభకు దారిచ్చారు. అసలు విభజన బిల్లే రాజ్యాంగ వ్యతిరేకమని, దాన్ని తిప్పి పంపాలని డిమాండ్ చేసిన టీడీపీ సీమాంధ్ర నేతలే ప్రభుత్వంతో జరిగిన ఈ చర్చకు మధ్యవర్తిత్వం చేయడం గమనార్హం. పైగా బిల్లుపై చర్చను అడ్డుకుంటే విభజనకు అంగీకరించినట్టే అవుతుందంటూ కొత్త పాట ఎత్తుకోవడం విడ్డూరం. 
     
    గడిచిన నాలుగు రోజులుగా ఇరు పార్టీల సీమాంధ్ర నేతలు విభజన బిల్లులోని ప్రతి క్లాజ్‌పైనా ఓటింగ్ జరుగుతుందని, ఆ ఓటింగ్‌లో వ్యతిరేకంగా వ్యవహరిస్తే విభజనను అడ్డుకోవచ్చని ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. నిజానికి క్లాజులపై సభ్యులు కోరితే ఓటింగ్ నిర్వహిస్తానని సభా వేదిక ద్వారా స్పీకర్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. బిల్లులోని కొన్ని అంశాలపై సమాచారం కావాలని టీడీపీ కోరిందని, వాటిని త్వరలోనే అందజేస్తామని సభలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పగానే... అంతవరకు నిరసన తెలియజేస్తున్న సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు సంతృప్తి చెంది తమ స్థానాల్లో కూర్చుండిపోవడం, ఆ వెంటనే మంత్రి వట్టి వసంతకుమార్ ఒక్కసారిగా బిల్లుపై చర్చను ప్రారంభించడం.. ఇదంతా క్షణాల్లో జరిగిపోయిన తీరు ఆ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. చంద్రబాబుతో సహా టీడీపీలోని సీమాంధ్ర నేతలకు ఈ మాత్రం సమాచారం సరిపోతుందని అనుకుని ఉంటే ఆ పని ప్రభుత్వం ఎప్పుడో చేసేది. అలాంటప్పుడు... సభను జరగనివ్వబోమని, చర్చకు అంగీకరించేది లేదని ఇంతకాలం చెప్పడమంతా అర్థం లేనిదిగా కనబడుతోంది.
     
     పాత సారా.. కొత్త సీసా
     డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క సభాధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు అప్పటి శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు చర్చ ప్రారంభించాలని చంద్రబాబును కోరడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. చర్చ ప్రారంభమే కాలేదని గట్టిగా వాదించిన మంత్రి శైలజానాథ్ కూడా కిరణ్ తనకు సభా వ్యవహారాల శాఖను అప్పగించడంతో ఒక్కసారిగా మౌనం దాల్చారు. సభా వ్యవహారాల శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కిరణ్ ఆదేశాల మేరకు శైలజానాథ్ అనేకసార్లు టీడీపీ సీమాంధ్ర నేతలతో సమావేశమయ్యారు. చర్చకు అంగీకరించాలని సీఎం తరఫున మధ్యవర్తిత్వం నెరిపారు. ఇంతకాలం విభజన బిల్లును వ్యతిరేకిస్తున్న తాము చర్చకు అంగీకరించడంలో తలెత్తే ఇబ్బందుల నుంచి బయటపడటానికి ‘బిల్లులో కొంత సమాచారం కావాల’ని కోరుతూ స్పీకర్‌కు టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. చర్చకు అంగీకరించటానికి ముందు సుమారు అరు దఫాలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఛాంబర్‌లో పయ్యావులతో పాటు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తదితర టీడీపీ నేతలు శైలజానాథ్, ఆనంలతో చర్చలు జరిపారు. ఇదే సమయంలో స్పీకర్‌తో పాటు ముఖ్యమంత్రికి రాసిన లేఖలను వారికి అందజేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ఉద్యోగులు, నీటి వనరుల లభ్యత తదితర అంశాలపై తాము వివరాలు కోరామని, వాటిని వెంటనే అందిస్తే చర్చకు సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. అదే విషయాన్ని మంత్రులకు చెప్పారు. మీరు కోరిన వివరాలన్నీ ప్రభుత్వ వెబ్‌సైట్లో ఉన్నాయని, మీరు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. 
     
    అయితే వెబ్‌సైట్లో నుంచి తీసుకునేందుకు అప్పుడు నిరాకరించడమే గాక, చట్టసభల గౌరవాన్ని కించపరుస్తున్నారంటూ హంగామా చేసిన టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు బుధవారం మాత్రం ఇదే విషయమై సభలో ఎవరైనా మంత్రి హామీ ఇస్తే చర్చను ప్రారంభించేందుకు తాము సిద్ధమని చెప్పారు. మేం ఒకేసారి మీరు చెప్పినట్టు నడుచుకుంటే మేం కుమ్మక్కయ్యామనే విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నాలుగైదు విడతలుగా చర్చిద్దామని చెప్పి, చివరకు ‘ప్రభుత్వం హామీ ఇచ్చింద’నే పేరుతో సర్దుకున్నారు. ఒకపక్క సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా మంత్రులతో చర్చలు జరుపుతున్న సమయంలోనే, ఇక చర్చను ప్రారంభించాల్సిందేనని చంద్రబాబు తన సమక్షంలో ఉన్న రెండు ప్రాంతాల టీడీపీ ఎమ్మెల్యేలకు చెప్పారు. బిల్లుపై చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఒకవేళ చర్చించకపోతే దోషులుగా మిగిలి పోతామని ప్రచారం చేయాలని వారిని ఆదేశించారు. ఇదే సమయంలో కిర ణ్ కూడా సభలో బిల్లుపై చర్చ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా మంత్రి వట్టితో పాటు పాటు విప్ ద్రోణంరాజు శ్రీనివాస్‌లకు సూచించారు. చర్చను ప్రారంభించి, సభ మర్నాటికి వాయిదా పడ్డాక, టీడీపీ నేతలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు రాత్రి 7 గంటలకు కిరణ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ, ‘చర్చ జరక్కపోతే బిల్లును అంగీకరించినట్టు అవుతుంద’ని చెప్పుకొచ్చారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
     
     ‘సమైక్య’ నేతల నిర్వేదం
     ఇరు పార్టీలకు చెందిన ముఖ్యుల మధ్య తెర వెనక చర్చలు, పరస్పర అవగాహన కుదిరాక తామేమీ చేయలేని స్థితిలో ఉన్నామని సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు బుధవారం నాటి పరిణామాలపై వ్యాఖ్యానించారు. సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు చర్చకు అంగీకరించడం వెనక చంద్రబాబు ఒత్తిడి అధికంగా ఉన్నట్టు తెలిసింది. అధినేత ఒత్తిడితోనే తాము ముందడుగు వేయాల్సి వచ్చిందని పార్టీ ఎమ్మెల్యేలంటున్నారు. సభ బయట దఫదఫాలుగా జరిగిన చర్చలు, చంద్రబాబు నుంచి వచ్చిన ఆదేశాలతో సభ లోపల మంత్రి ఆనం ప్రసంగించే సమయంలో స్పీకర్ పోడియం వద్దే ఉన్న టీడీపీ సభ్యులు ఆయన ప్రసంగం ఇలా పూర్తయిందో లేదో, అలా వచ్చి తమ తమ స్థానాల్లో ఆసీనులయ్యారు. కేంద్ర ఆరోగ్య మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ హైదరాబాద్ చేరుకున్న కొద్దిసేపట్లోనే అసెంబ్లీలో ఇలా విభజన బిల్లుపై చర్చ మొదలవడం చర్చనీయంగా మారింది. యువజన కాంగ్రెస్‌లో ఆజాద్, చంద్రబాబు కలిసి పనిచేయడమే కాకుండా వారి మధ్య సన్నిహిత సంబంధాలు కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
     
     చర్చ ప్రారంభం టీఆర్ ఎస్ విజయం: ఈటెల
     శాసనసభలో విభజన బిల్లుపై చర్చ జరగడం పట్ల టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. దీన్ని తెలంగాణ ప్రజలతోపాటు టీఆర్‌ఎస్ విజయంగా అభివర్ణించారు. బుధవారం సభ వాయిదా పడ్డాక ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్‌ఎస్ 13 ఏళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. బిల్లుపై ఓటింగ్, డివిజన్ జరగాలంటూ పలువురు ప్రగల్భాలు పలికినా టీ నేతలు కోరుకున్నట్లే సభలో బిల్లు చర్చకు వచ్చిందన్నారు. బిల్లును అడ్డుకోవడానికి ఎవరెన్ని వెకిలి ప్రయత్నాలు చేసినా, తెలంగాణను అడ్డుకునే సత్తా ఇప్పుడెవరికీ లేదన్నారు. అందరూ చర్చలో పాల్గొని బిల్లును ఆమోదించాలని కోరారు.
     
     సమైక్యబలం తగ్గించేందుకే: చంద్రబాబు
     శాసనసభలో సమైక్య బలం తగ్గించటం ద్వారా విభజనకు సహకరించేందుకే వైఎస్సార్‌సీపీ సభ నుంచి సస్పెండ్ కావాలని చూస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. బుధవారం సభ వాయిదా పడ్డాకఆయన మీడియాతో ఇష్టాగోిష్టిగా మాట్లాడారు. సమైక్యవాదం వినిపిస్తున్న వైఎస్సార్‌సీపీ, విభజన బిల్లుపై ఓటింగ్ సమయంలో సమైక్య బలం తక్కువగా ఉండేలా చూసి విభజన విషయంలో కేంద్రానికి సహకరిస్తోందని ఆరోపించారు. మీరు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై చర్చకు సహకరిస్తున్నారని విమర్శలు వ స్తున్నాయి కదా అని ప్రశ్నించగా, ఆ అవసరం తనకు లేదన్నారు.

     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement