అధిష్ఠానానిది బాధ్యతారాహిత్యం: సీఎం కిరణ్
రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి గురువారం నాడు లోక్సభలో జరిగిన సంఘటనలే ప్రత్యక్ష నిదర్శనమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం పెద్ద తప్పే చేసిందని, ఈ విషయంలో ముందునుంచి చివరివరకు ప్రతి స్థాయిలోనూ పొరపాట్లు చేస్తూనే వచ్చిందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితికి అదే కారణమని, కేంద్రం దాన్ని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. సభలో జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరమని చెప్పారు. జరుగుతున్న సంఘటనలు చూసి గుండె మండుతోందని ప్రధాని అన్నారు గానీ, ఇక్కడ కోట్లాది మంది తెలుగువాళ్ల గుండెలు కేంద్రం అనుసరిస్తున్న అప్రజాస్వామిక చర్యల కారణంగా మండుతున్నాయన్న విషయం ఆయన అర్థం చేసుకోవాలని కిరణ్ వ్యాఖ్యానించారు. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన తీరు అత్యంత అప్రజాస్వామికమని ఆయన అభివర్ణించారు. అసలు బిల్లు ప్రవేశపెట్టే పద్ధతి ఇది కానే కాదన్నారు. దానికి కొన్ని నియమ నిబంధనలుంటాయని, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని చెప్పారు.
మనది అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకొంటే సరిపోదని, ప్రజాస్వామిక విలువలను కూడా మనం పాటించాలని తెలిపారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 18 మంది ఎంపీలను పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేయడాన్ని కూడా కిరణ్ తప్పుబట్టారు. తన పార్టీ అధిష్ఠానం బీజేపీతో కుమ్మక్కు అయ్యేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీజేపీని మతతత్వ పార్టీ అని అభివర్ణించే పార్టీ, ప్రభుత్వ పెద్దలు.. అలాంటి బీజేపీ నాయకులతో విందు రాజకీయాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈ రూపంలో వాళ్లు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. మతతత్వ పార్టీతో కలిసి విందులు చేసుకోడానికి కూడా సిద్ధపడతారు గానీ, సొంత మనుషులతో మాట్లాడేందుకు మాత్రం వారికి తీరిక లేదని విమర్శించారు.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కూడా వెల్లోకి దూసుకెళ్లడాన్ని విలేకరులు ప్రశ్నించగా, పరిస్థితి తీవ్రతకు అది దర్పణం పడుతోందన్నారు. కేంద్ర మంత్రులు ఎప్పడూ వెల్లోకి వెళ్లరని, అలా చేశారంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలని కిరణ్ చెప్పారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేయడంపై ప్రశ్నించగా, లగడపాటిపై నిండు సభలోనే దాడిచేసి ఆయనను కొట్టారని, సలు సభలో జరిగిన అంశాలపై తాను వ్యాఖ్యానించదలచుకోలేదు గానీ, ఇలాంటి సన్నివేశాలకు మాత్రం తావుండకూడదని అన్నారు.