'ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. సహకారం అందించాలి'
విశాఖ: హుదూద్ పెను తుపాను ప్రభావంతో అపార నష్టం బారిన పడ్డ ప్రజలకు తగిన సహాయ సహకారాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. ఈ సమయంలో అందరూ సహకారం అందించాలన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోని నీళ్లను జనరేటర్లు పెట్టి తొలగిస్తున్నామన్నారు. ఈ సాయంత్రానికి తుపాను బాధితులకు 25 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన, కిలో చక్కెర చొప్పున అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
నగరంలోని ఆస్పత్రులకు సాయంత్రంలోగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.తుపానులో మృత్యువాత పడిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామన్నారు. తీవ్రగాయాలైన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50వేలు అందిస్తామన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకులను బాధితులకు అందజేసేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. మత్యకారులకు రూ.5 వేలు, బోటు ధ్వంసమైతే రూ.10 వేలు, మోటారు బోటుకు రూ.15 వేలు, ఆటోకు రూ.5 వేలు, ఇల్లు ధ్వంసమైతే రూ.5 వేలు పరిహారం అందిస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారు రూ.15 వేలు సాయం చేస్తామన్నారు.