రాష్ట్రం సోనియా గాంధీ జాగీరా?: చంద్రబాబు
హైదరాబాద్: రాజకీయ లబ్ది కోసమే రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడగొడుతోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. తెలంగాణ నోట్ను కేంద్ర కేబినెట్ హడావుడిగా ఆమోదించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నెల 7నుంచి ఢిల్లీలో నిరవధిక నిరహార దీక్ష చేపట్టనున్నట్టు దిగుతున్నట్టు ఆయన ప్రకటించారు.
ఎన్నికల ముందు ఇంత హడావుడిగా తెలంగాణ ప్రక్రియను ఎందుకు చేపట్టారని ఆయన ప్రశ్నించారు. సీఎం నుంచి సామాన్య కార్యకర్త వరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. తమ గొంతు కోశారని, కడపు కొట్టారని కాంగ్రెస్ వారే అంటున్నారని చెప్పారు. దేశాన్ని కాంగ్రెస్ నాశనం చేస్తుందనే విషయాన్ని అన్ని పార్టీలు గుర్తించాలన్నారు.
రాష్ట్ర విభజనకు తాము అంగీకరించామని ఆయన అంగీకరించారు. అయితే విభజనకు ముందు రెండు ప్రాంతాలకు చెందిన వారితో చర్చించాలని కోరామన్నారు. ఇష్టమొచ్చినట్టు విభజన చేయడానికి రాష్ట్రం సోనియా గాంధీ జాగీరా అంటూ ధ్వజమెత్తారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టేందుకు దీక్షకు దిగుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఛీకొట్టే పరిస్థితి తీసుకోస్తామన్నారు. తనకు అధికారం అప్పగిస్తే ఆరు నెలల్లో తెలంగాణ సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు చెప్పారు.