నీరో చక్రవర్తిలా మారిన నారా: రోజా
హైదరాబాద్: రాష్ట్రంలో నిరాహారదీక్ష చేసేందుకు సిగ్గేసి ఢిల్లీలో దీక్షకోసం చంద్రబాబు బయల్దేరుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా ఆక్షేపించారు. రాష్ట్ర విభజనను త్వరితగతిన పూర్తిచేయించాలనే చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఆమె ఆరోపించారు. 6 కోట్ల మంది అన్నం లేకుండా ఆందోళన చేస్తున్నా విభజనకు ఆయన సై అంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నీరో చక్రవర్తిలా మారారని ఎద్దేవా చేశారు. అగ్గిపుల్లా మారి కాంగ్రెస్ అనే అగ్గిపెట్టెతో జతకట్టి రాష్ట్రాన్ని తగులబెతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పును ఒప్పుకుని సమైక్యాంధ్రకు అండగా ముందుకు రావాలని, చరిత్రహీనులుగా మిగలొద్దని చంద్రబాబుకు ఆమె విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.
అన్నివిషయాల్లోనూ సమన్యాయం చేయమనే వైఎస్ఆర్ సీపీ కోరిందని గుర్తు చేశారు. ప్రజల పక్షాన నిలబడినందుకే జగన్ న్యాయం కోసం దీక్ష చేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి జగన్ అని చెప్పారు. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు ఓట్లు,సీట్లు కోసమే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది తప్ప తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించి కాదన్నారు. కాంగ్రెస్కు పోయేకాలం వచ్చిందన్నారు. కాంగ్రెస్, టీడీపీని ఛీత్కరించుకుంటున్నారని రోజా అన్నారు. గాంధీ చూపిన అహింసా మార్గంలోనే ఉద్యమాలు జరగాలని ఆమె కోరారు.