లోకేశ్‌తో సహా అమెరికా పర్యటనకు చంద్రబాబు
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈసారి ఆయన తన కుమారుడు, మంత్రి లోకేశ్‌తో సహా వచ్చే నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అమెరికా పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అమెరికాలోని కాలిఫోర్నియా, సాన్ ప్రాన్స్‌స్కో, చికాగో, న్యూయార్క్, న్యూ జెర్సీల్లో చంద్రబాబు సహా 17మంది సభ్యుల బృందం పర్యటించనుంది. యుఎస్‌ఐబీసీ వార్షిక వెస్ట్ కోస్ట్ సదస్సు అండ్ టైకాన్-2017 సదస్సులో పాల్గొంటారు. అయితే ఈ అమెరికా పర్యటనకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ఆర్థిక మండలి నిధుల నుంచి భరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, లోకేశ్, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్యకార్యదర్శి జి. సాయిప్రసాద్, ఇంధన, సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మాన్ ఆరోఖ్యరాజ్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి కె. విజయానంద్, ఆర్థిక అభివృద్ధి మండలి సీఈఓ కృష్ణ కిషోర్, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఎ. చౌదరి, సీఎం వ్యక్తిగత కార్యదర్శి పి. శ్రీనివాసరావు, సీఎం వ్యక్తిగత సహాయకుడు బి. రాజగోపాల్, సీఎం భద్రతా అధికారులు నలుగురు ఈ పర్యటనకు వెళ్లనున్నారు.