మంత్రులు వేస్ట్‌..కాదుకాదు పాలన వేస్ట్‌ | Government survey on the performance of ministers | Sakshi
Sakshi News home page

మంత్రులు వేస్ట్‌..కాదుకాదు పాలన వేస్ట్‌

Published Sun, Dec 22 2024 5:37 AM | Last Updated on Sun, Dec 22 2024 7:00 AM

Government survey on the performance of ministers

అమాత్యుల పనితీరు మీద ప్రభుత్వ సర్వేలో వెల్లడి 

24 మంది మంత్రుల్లో 18 మందికి అధ్వాన ర్యాంకులు 

డిప్యూటీ సీఎం, సీఎం కుమారుడు లోకేశ్‌ ర్యాంకులూ ఘోరమే 

పాలన మీద ప్రజల్లో వ్యతిరేకతే సర్వేలో ప్రతిబింబించింది 

అన్ని శాఖల్లో లోకేశ్‌ జోక్యం కూడా పాలనా వైఫల్యమేనని మంత్రుల వ్యాఖ్య  

సాక్షి, అమరావతి: ఆరునెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చేయించుకున్న సర్వేలోనూ అదే విషయం వెల్లడికావడం అధికార పార్టీ వర్గాలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. పాలనను ప్రతిబింబించే మంత్రుల పనితీరు మీద సర్కారు ఇటీవల సర్వే చేయించి వారికి ర్యాంకింగ్‌ ఇచ్చింది. ఇదే విషయాన్ని సీఎం స్వయంగా కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు వెల్లడించారు. 

తాజాగా.. మంత్రుల పనితీరు మీద ర్యాంకులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వ పెద్దలు లీక్‌ చేశారు. కేవలం ఆరుగురు మంత్రుల పనితీరు మాత్రమే సంతృప్తికంగా ఉందని, మిగతా 18 మంది ర్యాంకులు ఆధ్వానంగా ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. సహజంగా.. ప్రభుత్వ పాలన తీరుకు మంత్రివర్గం పనితీరును గీటురాయిగా తీసుకుంటారు. మంత్రివర్గంలో 75 శాతం మంది సభ్యుల తీరు ఏమాత్రం బాగోలేదని, సర్వేలో ర్యాంకులు అధ్వానంగా రావడం మంచి పరిణామం కాదని అధికార పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. 

ర్యాంకులు మరీ అధ్వానంగా ఉన్న మంత్రుల జాబితాలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, సీఎం కుమారుడు లోకేశ్‌ కూడా ఉండటం గమనార్హం. ప్రభుత్వానికి అన్నీ తామై వ్యవహరిస్తున్న ఈ ఇద్దరి పనితీరు, ప్రభుత్వ పనితీరును వేరుచేసి చూడలేమని, ప్రభుత్వం చేయించిన సర్వేలో తేలిన విషయమే ప్రజల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తు­న్నారు. 

ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్క హామీని కూడా అమలుచేయకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్న తీరును ప్రజలు గుర్తించారు. ప్రజాసంక్షేమం దిశగా ప్రభుత్వం ఏమీచేయలేక చేతులెత్తేసిన విధానమే మంత్రుల పనితీరు మీద ప్రతిబింబించిందనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించకుండా, ‘అధ్వాన్న పనితీరు’ పేరిట తమను నిందించడంలో అర్థంలేదని మంత్రులు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్న విషయం అధికార పార్టీ వర్గాలకు తెలుసు. 

పైపెచ్చు.. లోకేశ్‌ అన్ని మంత్రిత్వ శాఖల్లో జోక్యం చేసుకుంటే తాము చేయడానికి ఏముంటుందని.. తమ చేతులు కట్టేసి తాము అసమర్థులమని సర్వేల్లో తేల్చి ర్యాంకింగ్‌ ఇవ్వడం ఏమిటని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. సర్వే చేశామని చెప్పి, ర్యాంకులంటూ లీకులు ఇస్తే ప్రయోజనం ఏమీ ఉండదని.. ప్రభుత్వమే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి హామీలు అమలుచేస్తే ప్రభుత్వ సామర్థ్యం పెరిగిందని ప్రజలు భావిస్తారని, అప్పుడు ప్రజలు అడిగిన పనులు చేశామని తమ పనితీరు కూడా బ్రహ్మాండంగా ఉంటుందని మంత్రులు చెబుతున్నారు.

పవన్‌ పనితీరుపైనా అసంతృప్తి..
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పనితీరు అంత బాగోలేదని నివేదిక తేల్చడమంటే.. అన్ని శాఖల కంటే అత్యధిక బడ్జెట్‌ ఉన్న పంచాయతీరాజ్‌ శాఖను ఇచ్చినా ఆయన అందుకు తగ్గ రీతిలో పనిచేయడంలేదని, అంటే ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందనే అర్థమని పరిశీలకులు చెబుతున్నారు. హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడమే మంత్రుల ర్యాంకింగ్‌ అద్దంపడుతోందని, అది కేవలం పవన్‌కళ్యాణ్‌ ఒక్కడి వ్యక్తిగత సామర్థ్యం తక్కువనే భావన కాదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

చంద్రబాబు తనయుడు లోకేశ్‌ నిర్వహిస్తున్న కీలకమైన మానవవనరుల (విద్యా శాఖలు) శాఖలో అన్నీ సమస్యలే ఉండడంతో ఆయన పనితీరుపైనా పెదవి విరుస్తున్నారు. విద్యారంగంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు గండికొట్టడంతో ఆయన పనితీరు మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

పెత్తనం లోకేశ్‌ది.. తిట్లు మాకా!?
ఈ ర్యాంకింగ్‌లపై మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన తమ పనితీరు అంచనా వేసిందో తెలీడంలేదని సీనియర్‌ మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం. 

ప్రభుత్వంలోని అన్ని వ్యవహారాల్లో లోకేశ్‌ తలదూరుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇక తమకు పనిచేయడానికి అవకాశమెక్కడ ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. తమ శాఖలకు చెందిన కీలక నిర్ణయాలు లోకేశే తీసుకుంటుంటే వాటికి తమను బాధ్యులను చేయడం ఏమిటని ఆందోళన చెందుతున్నారు. చివరికి.. తమ శాఖల కార్యదర్శులు, కమిషనర్లు తమను పట్టించుకోకుండా.. లోకేశ్‌ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని వీరు చెబుతున్నారు. అన్ని పనులూ వారే చేసుకుంటూ తమ పనితీరు బాగోలేదని ఎలా చెబుతారని ఈ మంత్రులు మండిపడుతున్నారు. 

పనిచేసేది ఈ ఆరుగురే..
ఇక రాష్ట్ర కేబినెట్‌లో ఆరుగురు మంత్రులు మాత్రమే బాగా పనిచేస్తున్నట్లు నివేదిక తేల్చింది. అందులో మున్సిపల్‌ శాఖ మంత్రి పి. నారా­యణ ముందున్నారు. చంద్రబాబుకు బాగా దగ్గరగా ఉంటూ రాజధాని నిర్మాణ వ్యవహారాల్లో ఆయన మనసెరిగి పనిచేస్తుండడంతో నారాయణకు అగ్రతాంబూలం దక్కింది. అలాగే..
»  విద్యుత్‌ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంఎస్‌ఎంఈ శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ కూడా బాగా పనిచేస్తున్నారని మంచి ర్యాంకింగ్‌ దక్కింది. 
»  కూటమిలో జనసేన పార్టీ తరఫున మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్, బీజేపీ తర­ఫున మంత్రిగా ఉన్న సత్యకుమార్‌ పనితీరు కూడా బాగుందని నివేదిక పేర్కొంది. 
»  కలెక్టర్ల సదస్సు, ఇతర సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మరో మంత్రి లోకేశ్‌ బాగాపనిచేస్తున్నారంటూ సీఎం పొగుడుతూ ఆకాశానికెత్తేస్తున్న విషయం తెలిసిందే. కానీ, ప్రభుత్వ సర్వే నివేదికలో అందుకు భిన్నమైన ఫలితాలొచ్చాయి. పనితీరులో వీరిద్దరూ వెనుకబడ్డారని నివేదిక తేల్చేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement