
సీఎం జగన్‌పై హత్యాయత్నానికి రాష్ట్రం నివ్వెరపోయింది
అశాంతి, అల్లర్లు, హింసను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు
సింపతీ కోసం డ్రామాలాడాల్సిన దుస్థితి వైస్సార్‌సీపీకి లేదు
రాజకీయ పరిజ్ఞానంలేని తిక్కలోడు పవన్‌కళ్యాణ్
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు
సత్తెనపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విజయవాడ నడిబొడ్డున జరిగిన హత్యాయత్నంతో రాష్ట్రం నివ్వెరపోయిందని, ఆయనపై విసిరిన రాయి తెలుగుప్రజల గుండెలపై పడినట్లేనని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌పై దాడి జరిగి ఆయన నుదిటికి బలమైన గాయం తగిలితే.. ఇది ఎన్నికల ముందు సింపతీ కోసం డ్రామా అని చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ విమర్శించడాన్ని ఖండించారు.
దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోకెల్లా అత్యంత ప్రజాదరణ, ప్రజాబలం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు. ఆయనకు సింపతీ అవసరమేంటని ప్రశ్నించారు. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఆర్థికంగా దెబ్బతినిపోతామని భావించి చంద్రబాబు వర్గీయులు తమ నాయకుడిపై కక్షగట్టి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 175 స్థానాల్లో గెలుస్తామనే ప్రగాఢమైన విశ్వాసం తమకుందని చెప్పారు. కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఆయన్ని హత్యచేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడనేది వాస్తవమన్నారు. చంద్రబాబునాయుడు అధికారం లేకుంటే సహించలేడని, బతకలేడని చెప్పారు.
తాను కలలుగనే అధికారం దక్కడం లేదనే కక్షతో, ఈర్షితో కుట్రలు, దారుణాలకు ఒడిగడుతున్నాడని ధ్వజమెత్తారు. హింసను ప్రోత్సహిస్తూ కుట్రలు పన్నుతున్నాడన్నారు. ఈసారి తమ నాయకుడిపై రాయిగానీ, మరొకటేదైనా పడితే రాష్ట్ర ప్రజలు చంద్రబాబును క్షమించరని చెప్పారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో 151 గెల్చుకుని అధికారంలోకొచి్చన ప్రజాదరణ గలిగిన తెలుగు నాయకుడు జగన్‌కు గాయం అయితే తెలుగుప్రజలకు గాయమైనట్లు కాదా.. అని ప్రశ్నించారు. జనసేన అభ్యర్థి మనోహర్ గెలిస్తే తెనాలి సర్వనాశనమేనన్నారు. రాజకీయ పరిజ్ఞానం లేని తిక్కలోడు పవన్‌కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. పవన్ ప్రసంగాలన్నీ బూతులేనన్నారు. బూతులు మాట్లాడే నేతల్ని పిఠాపురం ప్రజలు శాసనసభకు ఎందుకు పంపుతారని ప్రశ్నించారు. ఏది నాటకమో, ఏది నిజమో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న పవన్, చంద్రబాబుకు ఎన్నికల కౌంటింగ్ తర్వాత రాజకీయ సమాధి తప్పదని జోస్యం చెప్పారు.