రేపు సీఎం పర్యటన
సాక్షి, రాజమండ్రి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జన-ధన’ పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రిని వేదిక చేసుకున్నారు. ఈ నెల 28న సీఎం పర్యటన కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే సభను స్థానిక జేఎన్ రోడ్డులోని చెరుకూరి కల్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం కలెక్టర్ నీతూ ప్రసాద్ ఈ ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఫంక్షన్ హాలులో కనీసం 500 మంది లబ్ధిదారులు, వివిధ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు ఉండేందుకు కనీసం వెయ్యి కుర్చీలు ఉండాలన్నారు.
సభలోకి ప్రవేశించే లబ్ధిదారులు, ఇతరులకు ప్రత్యేక పాసులు జారీ చేస్తామన్నారు. లోనికి ప్రవేశించే వారిని తనిఖీ చేయడం, ఇతర భద్రత చర్యలపై రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ హరికృష్ణతో చర్చించారు. వచ్చేవారిని గుర్తించే వ్యక్తిని ప్రతీ ద్వారం వద్ద పోలీసు సిబ్బందికి సహకరించేలా అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ను ఎస్పీ కోరారు. పరిమితికి మించి వచ్చే వారి కోసం మరో హాలు సిద్ధం చేసేందుకు కలెక్టర్ సూచనలు ఇచ్చారు. సమావేశ హాలులో జరిగే కార్యక్రమాన్ని ఫంక్షన్ హాలు బయట భారీ ఎల్‌సీడీ ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శిస్తే ఇతర ప్రజలు వీక్షించేందుకు వీలుంటుందన్నారు.
ప్రత్యేక స్టాళ్ల ఏర్పాటు
కల్యాణ మండపం ఆవరణలో బ్యాంకులు, వివిధ ప్రభుత్వ శాఖలు ఆరు స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. చెరుకూరి కల్యాణ మండపంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం కల్యాణ మండపం ప్రాంగణంలో ఎస్పీతో కలిసి భద్రతా చర్యలను పరిశీలించారు. వివిధ శాఖలు, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. జేసీ ముత్యాలరాజు, ఏజేసీ రామారావు, రాజమండ్రి ఆర్డీఓ రాధాకృష్ణ మూర్తి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఈపీడీసీఎల్ ఎస్‌ఈ గంగాధర్, ఇంకా ఆర్‌డబ్ల్యూఎస్, డ్వామా, మెప్మా, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, విద్యా శాఖ, మత్స్య శాఖ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.