
ఏపీ రాజధానికి భూమిపూజ చేసిన చంద్రబాబు
గుంటూరు :ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కీలక ఘట్టం ముగిసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో....రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. సరిగ్గా 8 గంటల 49 నిమిషాలకు... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు శంకుస్థాపన చేశారు. బంగారు తాపీతో మూడు సార్లు సిమెంట్, ఇసుక మిశ్రమాన్ని బొడ్రాయి వద్ద వేశారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, డీజీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
ఇక ఉదయం 3 గంటల నుంచే ఏపీ రాజధాని భూమి పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. పంచ నదుల నుంచి తెచ్చిన జలాలతో పాటు మానససరోవరం నుంచి తెప్పించిన ప్రత్యేక జలాలతో.... వేద పండితులు పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. విశ్వసేన, ఆరాధన, గోపూజ, వాస్తుపూజ, రత్నాన్యాసం సహ పలు రకాల పూజల చేస్తున్నారు. తుళ్ళూరు మండలం మందడం-తాళ్ళాయపాలెం గ్రామాల మధ్య బెజవాడ సత్యన్నారాయణకు చెందిన మందడం గ్రామ రెవెన్యూ 136 సర్వేనంబర్‌లోని స్థలంలో శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు.