
'చంద్రబాబు తెలిసి చేసిన దగా రుణాల మాఫీ'
విజయవాడ: పంట రుణాల రీషెడ్యూల్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. రైతు రుణమాఫీ -సాగునీటి కొరతపై విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమవేశంలో ఆయన పాల్గొన్నారు. విభజన తర్వాతనే చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారని, అన్ని రుణాలను మాఫీచేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌లు తొలిసంతకాలను అమలుచేసి చూపారని చెప్పారు. చంద్రబాబు మాత్రం తొలిసంతకంతో కమిటీ వేశారని తెలిపారు. చంద్రబాబు తెలిసి చేసిన దగా రుణాల మాఫీ అన్నారు. రీషెడ్యూలు అంటే భారం పెంచడం కాదా అని ప్రశ్నించారు. మూడేళ్లు లేదా ఐదేళ్లలోనైనా రుణాలు తీర్చాల్సిందేనని, ఆ మేరకు వడ్డీ కూడా పెరగదా అని అన్నారు. రీషెడ్యూలుతో రైతులు రుణవిముక్తులవుతారా అని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు.