సాక్షి, అమరావతి: సమీక్షలు చేయడం నా హక్కు, దాన్ని కాదనే హక్కు ఇంకెవరికీ లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంకు పట్టు పడుతుండడం చూసి ప్రభుత్వ అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకునే చంద్రబాబు సమీక్షలపై కేంద్ర ఎన్నికల సంఘానికి తాజాగా లేఖ రాశారు. ఇందులో ఆయన పేర్కొన్న అంశాలపై అధికార యంత్రాంగం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణంపై చంద్రబాబు ఐదేళ్లుగా సమీక్షలు చేశారని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు గుర్తుచేశారు. సీఎం ఐదేళ్లుగా సమీక్షలు చేస్తూనే ఉన్నారని, అయినా పోలవరం ప్రాజెక్టు పునాదుల దశను దాటలేదని మరో అధికారి వ్యాఖ్యానించారు. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్షల పేరుతో రూ.వందల కోట్లు ఖర్చు చేశారని, అధికారులు, ఇంజనీర్లు అసలు పని పక్కనపెట్టి, ప్రతివారం సీఎం సమీక్షలకే సమయం కేటాయించాల్సి వచ్చేదని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సిబ్బంది అంటున్నారు. చంద్రబాబు తీరుతో ప్రాజెక్టు పనులు తరచుగా ఆగిపోవడం మినహా ఒరిగిందేమీ లేదని తేల్చిచెబుతున్నారు. చంద్రబాబు సమీక్షల కోసం ఏర్పాట్లు చేయడం, కంప్యూటర్ ప్రజెంటేషన్లు రూపొందించడానికే సమయం సరిపోయేదని మరో అధికారి పేర్కొన్నారు.
పోలవరంలో రూ.900 కోట్ల బిల్లులు
ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ ఇప్పుడు సమీక్షలు అంటూ చంద్రబాబు చేస్తున్న హడావుడి వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన అస్మదీయ కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు ఇప్పించి, వారి నుంచి కమీషన్లు దండుకోవాలన్న యావ చంద్రబాబులో కనిపిస్తోందని అధికార వర్గాలు అంటున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ.900 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ బిల్లులను ఎలాగైనా ఇప్పించుకునేందుకే చంద్రబాబు పోలవరంపై సమీక్షలంటున్నారని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
అమరావతిలో చేసిందేమిటి?
రాజధాని అమరావతి విషయంలోనూ సీఎం చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రతి బుధవారం గంటల తరబడి సమీక్షలు నిర్వహించారు. అయినా ఐదేళ్లలో రాజధానిలో ఒక్క శాశ్వత భవన నిర్మాణం కూడా చేపట్టలేదనే విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఐదేళ్లపాటు రాజధాని పేరుతో గ్రాఫిక్స్ బొమ్మలను చూపిస్తూ కాలక్షేపం చేశారని, మరోవైపు తాత్కాలిక భవనాల నిర్మాణ వ్యయాలను భారీగా పెంచేసి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు కాజేయడం తప్ప ఇంకేమీ చేయలేదని పేర్కొంటున్నారు.
బాబు తీరు సరికాదు..
ఎన్నికల ప్రవర్తనా నియమావళి మే 27వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. వచ్చే నెల 23వ తేదీన ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా కోడ్ అమల్లో ఉంటుందని, ఈ సమయంలో ముఖ్యమంత్రికి ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఎన్నికల ప్రవర్తనా నియమావళి స్పష్టంగా చెబుతోంది. ఏదైనా సమస్య వస్తే దానిపై సీఎం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచనలు చేస్తే.. ఆయన అమలు చేస్తారని ఎన్నికల నియమావళిలో స్పష్టంగా ఉందని, అయినా సరే తాను సమీక్షలు నిర్వహిస్తానంటూ బాబు పట్టుబడుతుండడం సరికాదని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
సమీక్షలు చేయకపోతే పనులన్నీ ఆగిపోతాయట!
ఐదేళ్లుగా సమీక్షల మీద సమీక్షలు చేస్తూ ఏమీ సాధించలేని చంద్రబాబు ఇప్పుడు మూడు వారాలు సమీక్షలు చేయకపోతే పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయని, తద్వారా ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగిపోతుందని, దానికి కేంద్ర ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని చంద్రబాబు చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందని అధికారులు అంటున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణంలో అంచనా వ్యయాలను చంద్రబాబు విపరీతంగా పెంచేశారని, తద్వారా భారీగా లబ్ధి పొందారని వెల్లడిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణంపై ఇప్పుడు సమీక్షలు చేయడం అంటే కాంట్రాక్టర్లకు దోచిపెట్టి, కమీషన్లు కాజేయడానికేనన్న విషయం చిన్న పిల్లలను అడిగినా చెబుతారని ఒక అధికారి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment