ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవమున్నా చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ అన్నారు.
గుంటూరు(మంగళగిరి): ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవమున్నా చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. నీతి, నిజాయతీ ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి తక్షణం రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. టిడిపి ఏడాదిపాలన వైఫల్యాలను ఎండ గట్టేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈనెల 3, 4 చేపట్టనున్న సమరదీక్ష స్థలంలో ఏర్పాట్లును నెహ్రూ సోమవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబును దగ్గరగా చూసిన అనుభవం తనకుందని రాజకీయాల్లో ధన సంప్రదాయానికి తెరలేపిన మొదటి నాయకుడు చంద్రబాబు మాత్రమేనన్నారు.
రాజకీయాల్లో తనకంటే నీతిమంతుడు లేడని ప్రగల్భాలు పలికే చంద్రబాబు తన పార్టీ శాసనసభ్యుడు చేత మరో సభ్యుడును కొనుగోలు చేయించే స్థాయికి చేరారంటే ఆపార్టీ నాయకులు ఇక నుంచైనా జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలన్నారు. ఇంత నీచ రాజకీయం ఆధారాలతో సహా బయటకు వచ్చాక కూడా తెలుగుదేశం నేతల బుకాయింపులు చేయడం వారి నికృష్ట రాజకీయాలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఏడాది కాలంలో ప్రజలకు ఏమి చేశారని విజయోత్సవసభలు, అసలు రాష్ట్ర నిర్మాణమే చేయకుండా దీక్షలెందుకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షనేతగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత తమపై వుంద ని అందుకే సమరధీక్ష చేస్తున్నామన్నారు. రాజధాని నిర్మాణం చేయలేరు.. ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయరు చేసేది దోపిడి మాత్రమేనన్నారు.. ఆ దోపిడీకి దోవలు వెదుకుతూ పరిపాలన సాగించడం తప్ప సంవత్సరకాలంలో ప్రజలకు చేసిందేమీలేదన్నారు. రాష్ట్రంలో పోలీస్ వాహనాలు 2500 కొనుగోలు చేస్తే ఒక్కో వాహనానికి చినబాబు రూ.లక్ష చొప్పున వసూలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు.