
బిల్డప్ ఇస్తున్న బాబు: అంబటి
గుంటూరు: అక్రమార్జన దాచుకునేందుకే సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ఆరోపించారు. 3 లక్షల 22 వేల డాలర్లు చెల్లించి చంద్రబాబు దావోస్ ఆహ్వానం పొందారని, కానీ వాళ్లే పంపించినట్టు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు 16 సార్లు విదేశాలకు వెళ్లి ఏంసాధించారని ప్రశ్నించారు.
సింగపూర్, మలేసియా తరహాలో రాజధాని కడతానని చెప్పి ఇప్పుడు సినీ దర్శకుల గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విదేశీ పర్యటనలకు చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబు రహస్య పర్యటనల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. విదేశీ పర్యటనలతో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని, లేకుంటే మోసం చేస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతుందన్నారు. చంద్రబాబు ఆస్తుల లెక్కలన్నీ బోగస్ అని, హైదరాబాద్ లో ఉన్న ఇల్లే కోట్ల రూపాయల ఖరీదు చేస్తుందని చెప్పారు. వాస్తవాలకు మసిపూయడం చంద్రబాబుకు అలవాటేనని అంబటి విమర్శించారు.