
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటనలు, కార్యక్రమాల ఖర్చు చూస్తే అధికార యంత్రాంగానికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. కేవలం వేల రూపాయలు ఖర్చయ్యే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు రూ.లక్షలు వెచ్చిస్తుండడం గమనార్హం. ఏ కార్యక్రమాన్నెనా ఒక మెగా ఈవెంట్ తరహాలో నిర్వహించి, భారీగా ప్రచారం పొందాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని, అందుకే ఖర్చు విపరీతంగా పెరిగిపోతోందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. చంద్రబాబు కార్యక్రమాల ఖర్చు ఒక్కోసారి లక్షలు దాటిపోయి కోట్ల రూపాయలకు చేరుతోంది. ఒక్క గుంటూరు జిల్లాలోనే ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సదస్సులు తదితర కార్యక్రమాలకు ఏకంగా రూ.18,26,73,821 ఖర్చు చేశారు. ఈ బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ కార్యక్రమాల ఏర్పాట్లు చేసిన ఏజెన్సీలు జిల్లా కలెక్టర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో సంబంధిత శాఖలు కూడా నిధులను విడుదల చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కార్యక్రమాల ఖర్చులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించడానికి తక్షణమే నిధులు విడుదల చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా చంద్రబాబు స్నానం ఏర్పాట్ల కోసం రూ.2,41,91,500 ఖర్చయిందని, ఈ బిల్లు 2016 నుంచి పెండింగ్‌లో ఉందని లేఖలో స్పష్టం చేశారు. కేవలం ఒక్క గుంటూరు జిల్లాలోనే చంద్రబాబు కార్యక్రమాల ఖర్చు ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇంకెంత వ్యయం చేశారో చూస్తే గుండె గుబిల్లుమనడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment