
సంతలో పశువులు కొన్నట్టుగా...
హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్యవహారం లాగానే ఏపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సీఎం చంద్రబాబు అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. పట్టిసీమ వంటి ప్రాజెక్టు ద్వారా వచ్చిన అవినీతి సొమ్ముతో అక్రమాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రధానాధికారి భన్వల్ లాల్ ను కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.
సంతలో పశువులను కొన్నట్టుగా ఎంపీటీసీలను టీడీపీ కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. బలం లేకపోయినా కర్నూలు, ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీకి దిగిందని ప్రశ్నించారు. 30 మంది వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను భయపెట్టి, ప్రలోభపెట్టి క్యాంప్ కు తీసుకెళ్లారని అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, న్యాయపోరాటం కొనసాగిస్తామని జ్యోతుల నెహ్రూ తెలిపారు.