చంద్రబాబు చూపిన బాటలో.. | Chandrababu the track .. | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చూపిన బాటలో..

Published Thu, Mar 19 2015 2:22 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Chandrababu the track ..

  • పచ్చి భాషలో రెచ్చిపోయిన తమ్ముళ్లు  
  •  ‘పట్టిసీమ’లో మచ్చ కనిపించకుండా రచ్చ
  •  అసెంబ్లీలో ప్రతిపక్షంపై పరాకాష్టకు చేరిన టీడీపీ జులుం
  •  సభలో సీఎం, మంత్రులు, అధికార ఎమ్మెల్యేల బెదిరింపులు, హూంకరింపులు
  •  పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై సమాధానం చెప్పలేక దూషణలకు దిగిన టీడీపీ
  •  చర్చను పక్కదారి పట్టిస్తూ ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు
  •  విపక్ష సభ్యులపై అడ్డగోలు మాటలతో దాడి.. ఆపైన తీవ్రస్థాయి హెచ్చరికలు
  •  చివర్లో విపక్షం ప్రవర్తనే బాగాలేదంటూ.. ప్రసారం కాని వీడియోల విడుదల
  • సాక్షి, హైదరాబాద్: అక్రమాలను ప్రశ్నించిన ప్రతిపక్షంపై.. అధికార పక్షం అడ్డగోలుగా దూషణలకు తెగబడటంతో పాటే.. తీవ్రస్థాయిలో హూంకరింపులకు, హెచ్చరికలకు పాల్పడిన ఉదంతానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా నిలిచింది. ప్రభుత్వ అవినీతి గురించి అసెంబ్లీలో ప్రశ్నిస్తే.. వ్యక్తిగత దూషణలతో టీడీపీ మంత్రులు, శాసనసభ్యులు చేస్తున్న ఎదురు దాడి బుధవారం పరాకాష్టకు చేరింది. టీడీపీ సభ్యులకు మైక్ దొరికిందే తడవగా.. ప్రతిపక్ష సభ్యులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం ఈ అసెంబ్లీలో సర్వసాధారణమైంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాంట్రాక్ట్ విషయంలో ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై అడ్డంగా దొరికిపోతామేమోనన్న ఆందోళన కావొచ్చు.. ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి అధికార పక్షం ఏకంగా శాసనసభ సాక్షిగా బెదిరింపులకు దిగింది. నదుల అనుసంధానం - పట్టిసీమ ప్రాజెక్టు అంశంపై 344 నిబంధన కింద శాసనసభలో చేపట్టిన చర్చలో స్వయంగా సభా నాయకుడైన చంద్రబాబునాయుడు.. ‘‘మిమ్మల్ని వదిలిపెట్టను. పిచ్చాటలు ఆడొద్దు.. తమాషా అనుకుంటున్నారా.. సభ్యత లేని మనుషులు... మీరు మనుషులు కాదు..’’ వంటి తీవ్రపదజాలంతో బెదిరింపు ధోరణితో మాట్లాడారు. సభా నాయకుడి వ్యవహార శైలిని అందిపుచ్చుకున్న అధికార పార్టీ సభ్యులు మరింత రెచ్చిపోయి.. అడ్డగోలు మాటలను అలవోకగా అసెంబ్లీలో ఉపయోగించారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఏకంగా ‘‘ఏంట్రా... ఏంట్రా రేయ్... పాతరేస్తా... నా కొ...’’ అంటూ చూపుడు వేలుతో విపక్ష సభ్యులను హెచ్చరించారు. మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి శాసనసభలో ఈ రకంగా బెదిరింపు ధోరణితో సభలో మాట్లాడిన అధికారపక్షం.. సభ వాయిదా పడిన తర్వాత కూడా విపక్షంపై విషప్రచారంతో దాడిని కొనసాగించి హైడ్రామా నడిపించారు. సభలో తమ సభ్యులదేం తప్పులేదన్నట్టు.. వారి దూషణలు, బెదిరింపులేవీ కనిపించకుండా చేసి.. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనే బాగోలేదన్నట్టు వారు నిరసన తెలియజేస్తున్న వీడియో దృశ్యాలను మాత్రమే మీడియాకు ప్రదర్శించారు. స్పీకర్ అనుమతితోనే వీడియో ఫుటేజీని మీడియాకు విడుదల చేశామని చెప్పారు. విపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేవనెత్తుతున్న ప్రతి అంశాన్నీ పక్కదారి పట్టించే విధంగా అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు అందరినీ నిర్ఘాంత పరుస్తోంది. శాసనసభలో అత్యంత కీలకమైన పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రతిపక్షం సంధిస్తున్న ప్రశ్నల నేపథ్యంలో బుధవారం కూడా జగన్‌పై వ్యక్తిగత నిందలకు దిగారు.
     
    హద్దులెరుగని బోండా దూషణల పర్వం...

     ‘‘ఏంట్రా.. ఏంట్రా.. ఏంట్రారేయ్.. పాతరేస్తా.. నా కొ...’’ అంటూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు బుధవారం అసెంబ్లీలో ఆవేశంతో ఊగిపోయారు. పట్టిసీమపై బుధవారం ఉదయం జరిగిన స్వల్పకాలిక చర్చలో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించిన అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యతో వివాదం మొదలైంది. విపక్షాల నిరసనలు, అధికార పక్షం అరుపులు, వాగ్యుద్ధాల మధ్య స్పీకర్ కోడెల శివప్రసాదరావు బోండా ఉమామహేశ్వరరావుకు మైకు ఇచ్చారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రజలు మంచి ప్రాజెక్టు కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ ఒక 420గా అభివర్ణించదగ్గ వ్యక్తి తన 420లతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. లక్ష కోట్లు దోపిడీ కేసులో ఉన్న వ్యక్తి ఆయన. తండ్రి మాదిరే ఈయన అవినీతి కుమారుడు. ఈ జగన్ సీబీఐ కేసులో 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఆయన ఖైదీ నంబర్ 6093. ఇది నిజం కాదా? చర్లపల్లి జైల్లో చేసినట్టు నిండుసభలో ఇలా చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వేళ మేము మాట్లాడే ప్రతి మాటకు విలువుంది. నిజమైన మాటే మాట్లాడుతున్నాం. రాజశేఖరరెడ్డి, విజయలక్ష్మిగారు చెప్పిన మాటల్నే మేమిక్కడ చెబుతుంటే వినే ఓపిక లేదు. ఈ జగన్‌పైన, వైఎస్సార్‌సీపీ సభ్యుల పైనా చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అడ్డగోలుగా పొద్దుపొద్దాక సభను స్టాల్ చేస్తున్నారు. ఆ రోజా గారు బండబూతులు తిడుతున్నారు. రోజా ఆంటీ గారి మీద చర్య తీసుకోవాలని. ఈ వేళ వీరు- ఐరన్‌లెగ్ అయి ఎక్కడ ఉంటే అక్కడ సర్వనాశనం... ఆ రోజా, కొడాలి నానీపై చర్య తీసుకోకుంటే దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయి’’ అంటుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బోండాతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన మరింతగా రెచ్చిపోతూ... ‘‘ఏంట్రా, ఏంట్రా.. ఏంట్రారేయ్.. పాతరేస్తా.. నా కొ...(...)’’ అంటుండగా.. స్పీకర్ కోడెల మైకు కట్ చేసి సభను వాయిదా వేసి నిష్ర్కమించారు. సభలో వాదోపవాదాలు మిన్నంటాయి. అధికార పక్ష సభ్యుని వ్యాఖ్యలతో సభ్యులందరూ ఖిన్నులయ్యారు. మైకు కట్ చేసినా బోండా మాత్రం తన హెచ్చరిక ధోరణితో ఏదేదో మాట్లాడటం కనిపించింది. ఒకరని కాదు.. ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు అందరిదీ అదే ధోరణి. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడల్లా అడ్డుతగలడం, ఆటంకాలు సృష్టించడం, అసందర్భ వ్యాఖ్యలు చేయడం మితిమీరిపోయాయి.
     
    అడ్డూ అదుపూ లేని వ్యక్తిగత దూషణలు...

    బుధవారం సభలో చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ.. 1986-87లో హైదరాబాద్‌లోని శివశివానీ స్కూలులో ఓ పదో తరగతి విద్యార్థి మారుతీ వ్యాన్‌లో ప్రశ్న పత్రాలు అపహరించుకుపోయాడని, ఆ విద్యార్థి ఎవరా అని ఆరా తీస్తే జగన్‌మోహన్‌రెడ్డి అని తేలిందని నిందించారు. (వాస్తవానికి జగన్ చదివింది హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో.) ఈ దశలో విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరి తీవ్ర నిరసన తెలిపారు. ఈ గందరగోళంలోనే శ్రీనివాసులు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. గతంలో కె.రోశయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారంటూ.. జగన్‌తో వేగలేకపోతున్నామని వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నట్టు, దాన్ని రోశయ్య చెప్పినట్టుగా సభలో నిందారోపణలు చేశారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసనలు నినాదాలతో హోరెత్తించారు. కాల్వ శ్రీనివాసులుతో వాగ్వాదానికి  దిగారు. ఇంతలో ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైకు తీసుకుని ఏవేవో ఆరోపణలు చేశారు. సభ్యుల నిరసనల మధ్య ఆయన ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. విపక్ష సభ్యులు ‘పట్టిసీమ దొంగ- చంద్రబాబు దొంగ’ అంటూ నినాదాలు చేశారు. జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలకు మంత్రులు క్షమాపణ చెప్పాలని కోరారు. అయితే.. అధికార పక్ష సభ్యులు తమ దూషణలను మరింత తీవ్రం చేశారు. కూన రవికుమార్, మంత్రి పీతల సుజాత, బుచ్చయ్యచౌదరి, మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రి రావెల కిషోర్‌బాబు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణల పరంపర కొనసాగించారు. వైఎస్ రైతు ద్రోహని, ఆదర్శ రైతుల ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారంటూ నిందారోపణల పర్వం కొనసాగించారు.
     
    టీడీఎల్‌పీలో విపక్ష సభ్యులపై వీడియో ప్రదర్శన

    పట్టిసీమపై విపక్షం లేవనెత్తిన అంశాలు వేటికీ సమాధానాలు చెప్పని ప్రభుత్వం ఆ అంశం చర్చ జరుగుతున్న సందర్భంలోనే ఈ రకంగా బెదిరింపులు, దూషణలు కొనసాగించడం గమనార్హం. సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ‘‘పాతరేస్తా.. నా కొ...’’ అంటూ హెచ్చిరించిన నేపథ్యంలో స్పీకర్ సభను మరుసటి రోజుకు వాయిదా వేయగా.. సభ వాయిదా అనంతరం అధికార పక్షం రెండో పర్వం కొనసాగించింది. సభలో టీడీపీ సభ్యుల దూషణల పర్వం, హుంకరింపులు, బెదిరింపులు టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలకు చేరడంతో.. ప్రజల దృష్టిని మరల్చడానికి మరో ఎత్తుగడ వేసింది. సభలో అధికార పక్ష సభ్యుల దూషణల పర్వంపై స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష సభ్యుల వీడియో దృశ్యాలను మాత్రమే ఎంపిక చేసుకుని.. వాటిని టీడీఎల్‌పీలో మీడియాకు ప్రదర్శించింది. అధికారపక్ష సభ్యుల హెచ్చరికలు, బెదిరింపులు, హూంకరింపులు, దూషణలు.. ఏవీ కనిపించకుండా చేసి.. కేవలం ప్రతిపక్ష సభ్యుల ప్రతిస్పందనను మాత్రమే చూపుతున్న దృశ్యాలవి. అధికార పక్ష సభ్యులు అన్న ఏ మాటలకు, ఏ దూషణలకు, ఏ సవాళ్లకు, ఏ హెచ్చరికలకు, ఏ బెదిరింపులకు ప్రతిపక్ష సభ్యులు ప్రతిస్పందిస్తున్నారో చూపలేదు. కానీ.. చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, ప్రభాకరచౌదరి తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించి.. విపక్ష సభ్యులు మాత్రమే కనిపించే వీడియోను చూపించి.. ప్రతిపక్ష సభ్యులు సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ప్రస్తుత శాసనసభ మొదలైనప్పటి నుంచి తమను వ్యక్తిగతంగా దూషించి రెచ్చగొడుతున్నారని విపక్షంపైనే ఆరోపణలు గుప్పించారు. రోజా తమ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని.. తమ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. స్పీకర్‌కు లేఖ ఇచ్చి అనుమతి తీసుకుని ఈ దృశ్యాలను మీడియాకు విడుదల చేసినట్టు కాలువ చెప్పారు. దీనిపై ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. టీడీఎల్‌పీ కేవలం తమ నిరసనల భాగం దృశ్యాల వరకే ప్రసారం చేయడాన్ని దుయ్యబట్టింది. మరోవైపు.. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులపై చర్య తీసుకోవాలని స్పీకర్‌కు కూడా టీడీఎల్‌పీ విజ్ఞప్తి చేసింది.
     
     మిమ్మల్ని వదిలిపెట్టను..
     మీరు మనుషులు కాదు...
     ఏంట్రా? ఏంట్రారేయ్? పాతరేస్తా.. నా కొ..
     జగన్ చరిత్రహీనుడు..
     సైకోల మాదిరి ప్రవర్తిస్తున్నారు..
     - ‘పట్టిసీమ’ అక్రమాలపై ప్రశ్నించిన  ప్రతిపక్షానికి..
     సీఎం చంద్రబాబు సహా మంత్రులు, అధికార పక్ష సభ్యులు అసెంబ్లీ వేదికగా ఇలాంటి సమాధానాలిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement