సాక్షి, అమరావతి
ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ఎన్నికల ముందు కమీషన్ల కోసం చేపట్టిన ప్రాజెక్టులు, పనులు త్వరలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి గుదిబండలుగా మారనున్నాయని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కమీషన్ల దాహంతో స్వీయ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ఖజానాను వినియోగించుకున్నారని పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రజలతోపాటు ఆర్థిక వ్యవస్థ ఏమైనా సరే ఫరవాలేదనే ధోరణితో వ్యవహరించారని వ్యాఖ్యానిస్తున్నాయి. ఆర్థికశాఖతో పాటు సంబంధిత శాఖలు వారించినప్పటికీ లెక్క చేయకుండా ఎన్నికల ముందు ఐదారేళ్ల బడ్జెట్‌కు సరిపడా పనులను ఎడాపెడా మంజూరు చేశారని, ఇదంతా కోటరీ కాంట్రాక్టర్లకు పనులను కట్టబెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల రూపంలో కమీషన్ల కోసమేనని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
డీపీఆర్ లేకుండానే అనుమతులు
ఎన్నికలకు ఐదు నెలల ముందే ఖజానాను ఖాళీ చేయడంపై చంద్రబాబు పక్కా ప్రణాళిక రచించారు. నీటి లభ్యత, డీపీఆర్, అనుమతులు లేకుండానే గోదావరి–పెన్నా అనుసంధానం పేరుతో పాటు మొత్తం 15 ప్రాజెక్టులకు పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చారని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇందుకు ఆర్థికశాఖ తీవ్ర అభ్యంతరం తెలిపినా ఏమాత్రం పట్టించుకోలేదు. డీపీఆర్, భూసేకరణ తరువాత పరిపాలనా పరమైన అనుమతులు ఇస్తే అంచనా వ్యయాలు పెరగవని ఆర్థిక శాఖ సూచించినా ఆలకించలేదు.
ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారు..
ఇప్పటికే వివిధ శాఖల్లో మంజూరు చేసిన పనులతోపాటు ప్రాజెక్టులకు ఐదారేళ్ల బడ్జెట్ కూడా సరిపోని స్థితికి ఖజానా చేరుకుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే వచ్చే ఐదారేళ్ల బడ్జెట్ నుంచి చెల్లింపులకు సరిపడా పనులు, ప్రాజెక్టులను చేపట్టినందున ఇక కొత్తవి మంజూరు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భరించలేదని స్పష్టం చేసింది. రెవెన్యూ వ్యయం భారీగా పెరిగిపోయిందని, మరోపక్క సాగునీటి, విద్యుత్తు తదితర ప్రాజెక్టుల నుంచి ఆదాయంలభించడం లేదని, ఆ ప్రాజెక్టులు పూర్తికానందున రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం కలగడం లేదని ఆర్థిక శాఖ ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి స్పష్టం చేసింది.
అయినా సరే దీన్ని పట్టించుకోకుండా చంద్రబాబు స్వయంగా సంబంధిత ఫైళ్లను తెప్పించుకుని సంతకాలు చేసి పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేశారు. ఈ–ప్రగతి పేరుతో అనుత్పాదకత ప్రాజెక్టు మంజూరు చేశారని, ఐటీ పేరుతో కోట్ల రూపాయల వ్యయం చేశారని, దీనివల్ల ప్రభుత్వ పెద్దలకు మినహా ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీ సర్కారు తీరుతో ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని ఆర్థిక శాఖ హెచ్చరించినట్లు తెలిపాయి. ఈమేరకు సంబంధిత ఫైళ్లలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా లిఖితపూర్వకంగా తెలిపిందని అధికార వర్గాలు వివరించాయి.
ప్రాజెక్టుల పేరుతో కమీషన్ల పర్వం
ఒక్క సాగునీటి శాఖలోనే ఉమ్మడి ఏపీలో చేపట్టిన 24 ప్రాధాన్యత ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, వీటి వ్యయం రూ.24,492 కోట్లు కాగా ఇప్పటివరకు కేవలం రూ.6,760 కోట్లు వ్యయం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు కొనసాగుతున్న 24 ప్రాజెక్టులకే ఇంకా రూ.17,792 కోట్లు వ్యయం కానుందని, ఐదారేళ్ల పాటు వీటికి బడ్జెట్ నుంచి చెల్లింపులు చేయాల్సి ఉందని తెలిపాయి. ఈ ప్రాజెక్టులన్నింటినీ సమీక్షించి ప్రయోజనం లేని పథకాలు, ప్రాజెక్టులు, పనులను రద్దు చేయకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం కష్టమని ఓ ఉన్నతాధికారి చెప్పారు.
కమీషన్ల కోసం సీఎం చంద్రబాబు 15 ప్రాజెక్టులకు రూ.17 వేల కోట్ల రూపాయలకు పైగా అంచనాలతో పరిపాలన అనుమతులను ఇచ్చారని, వీటిని క్షుణ్నంగా అధ్యయనం చేసి ప్రయోజనం లేని వాటిని రద్దు చేయాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఐటీ శాఖలో ఇష్టానుసారంగా పనులు మంజూరు చేసి అయిన కాడికి కమీషన్లు వసూలు చేసుకున్నారని, ఈ రంగంలో పనులపై నూతన ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుందని తెలిపాయి.
►నీటి లభ్యత, డీపీఆర్ లేకుండా ఈ ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చిన ప్రాజెక్టులు 15వాటి విలువ 17,000 కోట్లు
►సాగునీటి శాఖలో ఉమ్మడి ఏపీలో చేపట్టి నేటికీ కొనసాగుతున్న ప్రాధాన్య ప్రాజెక్టులు 24 వీటి వ్యయం (అంచనా) 24,491 కోట్లు
►ఇప్పటి వరకు చేసిన వ్యయం (అధికారిక వర్గాల సమాచారం మేరకు) 6,760 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment