సాక్షి, తాడేపల్లి: కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారంటూ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కరోనా సంక్షోభం వచ్చినా కూడా సంక్షేమ పథకాలు ఆగలేదు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. ఎల్లో పత్రికలు కొన్ని కధనాలు ప్రచురించే పనిలో పడ్డారు. జగన్‌మోహన్ రెడ్డిపై బురద జల్లి చంద్రబాబును లేపే కార్యక్రమంలో పడ్డారు. టీడీపీ హయాంలో రూ.55వేల కోట్లు ఖర్చు పెట్టారట. మేము రూ.15వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామట. ఎందుకు వాళ్లు బాగా ఖర్చు పెట్టారు..? దాని వెనుక నిజాలేమిటి..?.
ప్రాధాన్యత ఉన్న కీలక పనులు ఏవీ చంద్రబాబు చేయలేదు. కాంట్రాక్టర్లకు బాగా మిగిలే పనులు మాత్రమే చేశారు. మేము కీలకమైన పనులు మాత్రమే టేక్ అప్ చేశాం. రెండు సార్లు కోవిడ్ వచ్చినా పనులు ఆగకుండా చిత్తశుద్ధితో పనిచేశాం. మనం ఫైట్ చేస్తున్నది టీడీపీ మీద మాత్రమే కాదు.. ఎల్లో మీడియాపై అని మా నాయకుడు ముందే చెప్పాడు. సందు దొరికితే విష ప్రచారం చేసే పనిలో పడ్డారు. మీరు ఎన్ని చేసినా ప్రజలు నమ్మరు. ఈ జలయజ్ఞాన్ని వైఎస్సార్ ప్రారంభించారు.. ఆగే ప్రసక్తే లేదు. మేము అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో 6 ప్రాజెక్టులను ఎంచుకున్నాం. తక్కువ ఖర్చుతో వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉపద్రవం కోవిడ్ వచ్చింది.. తేదీలు కొంచెం అటు ఇటు అవ్వొచ్చు.
చదవండి: (కడుపు మండి తప్పుడు వార్తలు రాస్తున్నారు: బూడి ముత్యాలనాయుడు)
పద్నాలుగేళ్లు సీఎంగా నీ చరిత్రలో ఒక్క ప్రాజెక్ట్ అయినా రిబ్బన్ కట్ చేశావా చంద్రబాబు...? ఎల్లో మీడియా వాస్తవాలు రాయండి.. మీరు చంద్రబాబును ఏమీ లేపలేరు. మీరు ఆయన్ని చైర్‌లో కూర్చోబెట్టే ప్రశ్నే లేదు. ఆయనకి చిత్తశుద్ధి లేదు. ఈ రోజు పోలవరం కొద్దిగా ఆలస్యం కావడానికి కారణం చంద్రబాబు. నువ్వు చేసిన పాపం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ప్రపంచంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం ఎక్కడా లేదు. దీనివల్ల రూ.400 కోట్లు వృధా అయ్యింది. మళ్లీ కట్టాలంటే అదనపు ఖర్చు. దాని నుంచి నీటిని తోడి మళ్లీ కట్టాలంటే 2,000 కోట్లు కావాలి.. ఈ పాపం నీది కాదా..? నిపుణుల కమిటీ నువ్వు చేసిన తప్పుల వల్ల రీ డిజైన్ చేయడానికి వస్తున్నారు.
ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు ఉపయోగపడే దిశగా మేము తపన పడుతున్నాము. గత రెండేళ్లలో అందరికీ సాగు నీరు అందజేసాం. నీరు చెట్టు కింద ఎన్ని నిధులు కాజేశారో అందరికీ తెలుసు. చేసిందంతా మీరు చేసి మాపై బురద జల్లుతారా. నెల్లూరు సంగం బ్యారేజీ పూర్తి చేసి జులైలో రైతులకు అందజేసేలా ప్రయత్నం చేస్తున్నాం. అవుకు రెండో టన్నెల్‌లో చంద్రబాబు సగం పనులు వదిలేశాడు.. దాన్ని మేము చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నాం. ఖర్చు కాదు ప్రధానం.. ప్రాజెక్టులు చిత్తశుద్దిగా చేస్తున్నారో లేదో చూడాలి.
కోవిడ్ తగ్గుముఖం పట్టింది.. పెండింగ్ బిల్లులు చెల్లించి పనులు వేగవంతం చేశాం. పోలవరం నుంచి శాస్త్రీయంగా రెండు దశల్లో నీరు ఇస్తారు. ముందు కనీస నిల్వ సామర్ధ్యం నుంచి నీళ్ళు ఇస్తారు.. ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్తారు. మీరు జానడు తవ్వి మేము పట్టిసీమ చేశాం అని చెప్పుకుంటున్నారు. ఆ కాల్వలు తవ్వి ఎంత దండుకున్నారో అందరికీ తెలుసు. ఆ పనుల కోసం పెట్టిన ఖర్చు పోలవరంపై పెట్టి ఉంటే మరో రకంగా ఉండేది. మీరంతా కట్టకట్టుకుని ప్రయత్నం చేసినా మా చిత్తశుద్ధిని ఆపలేరు. ఎవరు అపరిచితుడో అందరికీ తెలుసు. స్పిల్ వే నష్టంపై చంద్రబాబు చర్చకు సిద్ధమా..? దాని వల్ల ఆర్థికంగా నష్టం.. రెండు సీజన్లు నష్టపోయాయి. చంద్రబాబు ఎంత బలహీనుడో వాళ్ళ అబ్బాయి ఎంత బలహీనుడో అందరికీ తెలుసు. వాళ్ల బలహీనతని కప్పిపుచుకోడానికి జగన్ బలహీనుడు అంటున్నారు అంటూ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్ర స్థాయిల్లో ఫైర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment