సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధర్మపోరాటం పేరిట శుక్రవారం విజయవాడలో చేస్తున్న ఒక్కపూట దీక్షకోసం ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసేస్తున్నారు. ఏకంగా రూ.30 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నట్లు అంచనా. ఇంత భారీగా ప్రజాధానాన్ని వృథా చేయడంపై పలువర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
ప్రత్యేక హోదాపై ఆదినుంచి పలురకాలుగా కుప్పిగంతులు వేసి చివరకు తన స్వార్ధంకోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టిన చంద్రబాబు ప్రజలను మరోసారి పక్కదారి పట్టించేందుకు ఈ దీక్షను చేపడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీక్ష చేపడుతున్న విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో వేదిక ఏర్పాట్లకే రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు.
వేదికతో పాటు స్టేడియంలో డెకరేషన్, ఎండ వేడి లేకుండా ఉండేందుకు ప్రత్యేక ఏసీ యంత్రాలు, భారీ కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సౌండ్ సిస్టమ్, జిల్లాల నుంచి రప్పించేందుకు భారీగా బస్సుల ఏర్పాటు, జనానికి మజ్జిగ ప్యాకెట్లు, ఇతర డ్రింకులు, మంచినీళ్లు, ఆహార పదార్ధాలను అందించేలా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ఇతర ముఖ్య అధికారులంతా గత కొన్ని రోజులుగా ఈ ఏర్పాట్లలోనే నిమగ్నమయ్యారు.
జనాన్ని తరలించే బస్సుల కోసమే రూ.కోట్లల్లో...
విద్యార్ధులను తరలించేందుకు విజయవాడ సహా కృష్ణా జిల్లా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వేలల్లో ఆర్టీసీ, ప్రయివేటు బస్సులు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో 650, గుంటూరు జిల్లాలో 840 ఆర్టీసీ బస్సులతో పాటు మరో వందల సంఖ్యలో విద్యాసంస్థల బస్సులను స్వాధీనం చేసుకొని జనాన్ని తరలించనున్నారు. ఒంగోలు నుంచి 150 బస్సులు, పశ్చిమగోదావరిలో ప్రయివేటు విద్యాసంస్థల బస్సులతో పాటు 169 ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు.
ఈ బస్సులకు అయ్యే వ్యయం మొత్తం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తారని, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల డిపోల మేనేజర్లకు సమాచారం పంపారు. ఒక్కో బస్సుకు రూ.14,000 చొప్పున రూ.కోట్లలో ఖర్చు అవుతుంది. పైగా విద్యా సంస్థల నుంచి తీసుకుని వందలాది బస్సుల ఖర్చంతా ఆయా సంస్థలే భరించాలని హకుం జారీ చేశారు. ఇక స్టేడియంలో టెంపరరీ టాయిలెట్లు ఏర్పాట్లు, మూడు షిఫ్టులలో పారిశుధ్య కార్మికులను నియమిస్తున్నారు. ఇలా అడుగడుగునా ప్రజా ధనాన్ని అడ్డగోలుగా ఖర్చుపెడుతున్నారు.
భారీగా వేదిక.. సౌకర్యాలకు భారీగా ఖర్చు
స్టేడియం ఆవరణలో గురువారం సాయంత్రానికే టెంట్లు ఏర్పాటు చేశారు. ప్రాంగణంలోని ప్రతి ఒక్కరికీ సీఎం కనిపించేలా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రజాసంఘాల ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కూర్చునేందుకు వీలుగా భారీ వేదికను సిద్ధం చేశారు. దీక్షా ప్రాంగణంలో ఈ వేదికతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు.
విజయవాడలోని అన్ని శాఖల అధికారులతో పాటు చుట్టుపక్కల జిల్లాల యంత్రాంగాన్ని కూడా రప్పిస్తున్నారు. చంద్రబాబు దీక్ష చేస్తున్న ఇందిరాగాంధీ స్టేడియం లోపల, బయట భారీగా పోలీసులును మోహరిస్తున్నారు. పలువురు ఐపీఎస్ అధికారులు, డిఎస్పీలు, సీఐ, ఎస్సైలను, ఇతర పోలీసు బలగాలను జిల్లాల నుంచి రప్పించారు.
ఇలా అన్నిటికీ శుక్రవారం అయ్యే మొత్తం ఖర్చు రూ.30 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరికి ఇటీవల బంద్ పాటించగా ఆర్టీసీకి రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పిన చంద్ర బాబు ఇప్పుడు తన ఒక్కపూట దీక్ష పేరిట అంతకు మూడురెట్లు డబ్బును ఖర్చు చేస్తుం డటంపై ప్రజలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment