Expense
-
ఖరీదైన నగరాల్లో ముంబయి టాప్.. కారణం..
దేశవ్యాప్తంగా ముంబయి ఖరీదైన నగరాల్లో మొదటిస్థానంలో ఉందని ‘మెర్సర్ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్’ సర్వే వెల్లడించింది. కలల నగరం(సిటీ ఆఫ్ డ్రీమ్స్)గా పేరున్న భారత వాణిజ్య రాజధాని ముంబయిలో జీవనవ్యయం భారీగా పెరిగిందని నివేదికలో తెలిపారు. వ్యక్తిగత ఖర్చులు, రవాణా ఖర్చులు, గృహ అద్దెలు అధిక స్థాయిలో ఉన్నాయని సర్వేలో వెల్లడైంది.నివేదికలోని వివరాల ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా ముంబయి గతంలో కంటే 11 స్థానాలు ఎగబాకి 136వ ర్యాంక్‌కు చేరుకుంది. దిల్లీ 4 స్థానాలు పెరిగి 164వ ర్యాంక్‌కు, చెన్నై ఐదు స్థానాలు దిగజారి 189కు, బెంగళూరు ఆరు స్థానాలు తగ్గి 195కు, హైదరాబాద్ ఎలాంటి మార్పు లేకుండా 202 వద్ద స్థిరంగా ఉంది. పుణె ఎనిమిది స్థానాలు పెరిగి 205కి, కోల్‌కతా నాలుగు స్థానాలు పెరిగి 207కి చేరుకుంది.అంతకుముందు ఏడాదికంటే 2023లో 20 స్థానాలు దిగజారి 147వ ర్యాంక్‌కు చేరుకున్న ముంబయి 2024లో 136వ ర్యాంక్‌కు పెరిగింది. ఎనానమీలో వస్తున్న ఆర్థిక మార్పుల వల్ల ముంబయిలో జీవన వ్యయం పెరుగుతోందని నివేదిక పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023లో దిల్లీ 169 నుంచి 164కి, కోల్‌కతా 211 నుంచి 207కి, పుణె 215 నుంచి 205కి చేరుకుంది. చెన్నై 184 నుంచి 189కి, బెంగళూరు 189 నుంచి 195కి, హైదరాబాద్ 202 వద్ద నిలకడగా ఉంది. ఆసియావ్యాప్తంగా ఉన్న అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై 21వ స్థానంలో, దిల్లీ 30వ స్థానంలో ఉన్నాయని నివేదిక తెలిపింది.ఈ సందర్భంగా మెర్సర్ ఇండియా మొబిలిటీ లీడర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ..‘ప్రపంచ ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో భారత్ చాలావరకు నిలకడగా ఉంది. మెర్సర్ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో ముంబయి గ్లోబల్ ర్యాంకు పెరిగినప్పటికీ మారుతున్న ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలు ఉన్నాయి. దిల్లీలో గృహ అద్దెలు అత్యధికంగా 12-15 శాతం పెరిగాయి. ముంబయిలో 6-8 శాతం, బెంగళూరులో 3-6 శాతం, పుణె, హైదరాబాద్, చెన్నైలో 2-4 శాతం గృహ అద్దెలో పెరుగుదల కనిపించింది. సౌందర్య సాధనాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు ముంబయిలో అత్యంత ఖరీదైనవిగా మారాయి. ఈవిభాగంలో చెన్నై తర్వాతి స్థానంలో ఉంది. కోల్‌కతాలో వాటి ధర తక్కువగా ఉంది. కరెంటు బిల్లులు, యుటిలిటీ ఖర్చులు ముంబైలో చాలా ఖరీదయ్యాయి. ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు, నిర్వహణ, రవాణా ఖర్చులు పెరిగాయి. ఈ విభాగంలో బెంగళూరు తర్వాతి స్థానంలో ఉంది.ఇతర దేశాల్లోని ప్రతిభ కలిగిన ఉద్యోగులను ఆకర్షించడంలో స్థానికంగా ఉన్న హౌసింగ్ ఖర్చులు కీలకంగా మారుతాయని నివేదిక తెలిపింది. దాంతోపాటు ఉద్యోగుల జీవననాణ్యతపై ప్రభావం పడుతుందని చెప్పింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భౌగోళిక రాజకీయ అనిశ్చుతులు, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటుందని, దాంతో సంస్థలు ఇతరదేశాల్లోని ప్రతిభ ఉన్నవారిని ఆకర్షించే పనిలో ఉన్నాయని నివేదిక తెలిపింది. చాలాకంపెనీలు ముంబయిలో తమ కార్యకలాపాలు సాగిస్తుండడంతో విదేశీ ఉద్యోగులకు తగిన జీవనప్రమాణాలు అందించేలా ఏర్పాటు చేస్తున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఖర్చులు ఎక్కువవుతున్నాయని మెర్సర్ పేర్కొంది.ఇదీ చదవండి: ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా అధిక లివింగ్ కాస్ట్ ఉన్న నగరాల్లో హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్ (స్విట్జర్లాండ్), జెనీవా (స్విట్జర్లాండ్), బాసెల్ (స్విట్జర్లాండ్), బెర్న్ (స్విట్జర్లాండ్), న్యూయార్క్ సిటీ (యూఎస్), లండన్ (యూకే), నసావు (బహామాస్), లాస్ఏంజిల్స్ (యూఎస్) వరుసస్థానాల్లో నిలిచాయి. -
సింపుల్‌గా..శుభంగా
ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే పెళ్లి అంత ఘనంగా జరిగినట్లు. అనే ఆలోచనధోరణి నుంచి బయటికి వచ్చి నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ ఆర్య, ఇండియన్పోస్టల్ సర్వీస్ ఆఫీసర్ శివమ్ త్యాగి. ‘ఆనందం అనేది ఆడంబరపు ఖర్చుల్లో కాదు... మనం చేసే మంచి పనుల్లో దొరుకుతుంది’ అని నమ్మిన ఈ నవదంపతులు 20 మంది అనాథ పిల్లల చదువుకు అయ్యే ఖర్చును భరించాలని వివాహ శుభసమయాన శుభనిర్ణయం తీసుకున్నారు... కేరళ, కొట్టాయంలోని కూరోప్పడకు చెందిన ఆర్య ఎన్ నాయర్ తండ్రి రాధాకృష్ణన్నాయర్ జాయింట్ లేబర్ కమిషనర్‌గా రిటైరయ్యారు. కూతురికి చిన్నవయసు నుంచే దినపత్రికలు చదవడం అలవాటు చేశారు. ఈ అలవాటు తనకు ఎంతో మేలు చేసింది. ఎప్పటికప్పుడు సామాజిక సందర్భాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు, రకరకాల సమస్యల విశ్లేషణ గురించి తెలుసుకోవడానికి కూడా ఆర్యకు ఉపకరించింది. బంధువులకు సంబంధించిన ఎన్నో పెళ్లిళ్లకు హాజరయ్యేది ఆర్య. ఆ ఆడంబరపు ఖర్చును చూసి తన మనసు చివుక్కుమనేది. ‘ఈ పెళ్లికి చేసిన ఖర్చుతో ఎన్నో మంచి పనులు చేయవచ్చు’ అనుకునేది. ఇదే విషయాన్ని ఇతరులతో పంచుకుంటే... ‘ఇప్పుడు ఇలాగే అంటావ్. తీరా పెళ్లి టైమ్ వచ్చేసరికి మారిపోతావు. నా పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో తెలుసా అని చెప్పుకోవడానికేప్రా ధాన్యత ఇస్తావు. నీ వయసులో నీలాగే ఆలోచించాను. కాని నా పెళ్లి ఘనంగా జరగక తప్పలేదు. చివరికి అప్పు కూడా చేయాల్సి వచ్చింది’ అన్నవాళ్లే ఎక్కువ. ఈ మాటలు ఆర్య మనసులో గట్టిగా నిలిచిపోయాయి.‘పెళ్లంటూ చేసుకుంటే నిరాడంబరంగానే చేసుకోవాలి’ అని నిర్ణయం తీసుకుంది. దిల్లీకి చెందిన శివమ్ త్యాగి కూడా ఆర్యలాగే ఆలోచిస్తాడు. ఇద్దరూ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వారి పరిచయం స్నేహం అయ్యే క్రమంలో, ఆ స్నేహం ప్రేమకు దారి తీసే క్రమంలో ఎన్నో సామాజిక సంబంధిత విషయాలు మాట్లాడుకునేవారు. అందులో ఆడంబర వివాహాల ప్రస్తావన కూడా తప్పనిసరిగా ఉండేది. ‘నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’ అని ఆర్య చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఇష్టపడలేదు. వారిని ఒప్పించడానికి కాస్త సమయం పట్టింది. మరోవైపు శివమ్ త్యాగి పరిస్థితి కూడా అంతే. అతడి తల్లిదండ్రులు కూడా నిరాడంబర వివాహానికి మొదట సుముఖంగా లేరు. ‘మా నిరాడంబర వివాహం కొందరికైనా స్ఫూర్తిని ఇస్తే అంతకంటే గొప్ప ఆనందం ఏం ఉంటుంది!’ అంటున్నాడు శివమ్ త్యాగి. ఆనందాలు ఆడంబరపు ఖర్చులతో ముడిపడిన చోట ఆనందం మాటేమిటోగానీ అప్పులు మాత్రమే మిగులుతాయి. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ ధోరణిలో మార్పు రావాలంటే నిరాడంబర వివాహాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. ఆర్య– శివమ్ త్యాగిలాంటి వారు ఇందుకు స్ఫూర్తిగా నిలుస్తారు. ‘కేరళలో వివాహాలు మూడు రోజులపాటు అట్టహాసంగా జరుగుతాయి. నా పెళ్లి వార్త తెలియగానే బంధువులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు. పెళ్లి ఆడంబరంగా జరుగుతుందని ఊహించారు. కాని కొట్టాయంలోని సబ్– రిజిస్ట్రార్ ఆఫీసులో దండలు మార్చుకోవడం ద్వారా నిరాడంబరంగా జరిగిన మా పెళ్లి వారిని కాస్త నిరాశకు గురిచేసింది. అయితే ఆ తరువాత వారు మమ్మల్ని అర్థం చేసుకొని అభినందించారు’ అంటుంది ఆర్య. -
కల్యాణం కోసం అప్పులు.. వధూవరుల పాట్లు
ఆషాఢం ముగిసింది... శ్రావణం వచ్చేసింది. ప్రతీ ఊళ్లో పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. కొత్త జంట ఊరేగింపులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ కల్యాణ తంతు మన కంటికి కనిపించేంత సుళువగా ఏమీ జరగడం లేదట! వివాహం కోసం పెద్దవాళ్లే కాదు వరుడు, వధువు కూడా తిప్పలు పడుతున్నారు. అప్పుల మూట నెత్తిన మోసేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి, వెబ్‌డెస్క్: మన యూత్‌కి కోవిడ్‌తో పెద్ద చిక్కు వచ్చి పడింది. ఓవైపు పెళ్లీడు తరుముతుంటే మరోవైపు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. దీంతో యువత ఒత్తిడి లోనవుతున్నారు. వీకెండ్లో ఎంజాయ్ చేయాల్సిన వారు, కొత్త మోడల్ బైకులు, కార్ల గురించి బ్రౌజ్ చేయాల్సి వాళ్లు.. అప్పులు చేసేందుకు ఆతృత పడుతున్నారు. అది కూడా మూడుముళ్ల బంధం కోసం. అవును ఇది నిజం ! ఇండియాలెండ్ సంస్థ తాజాగా చేసిన సర్వేలో ఈ ఆశ్చర్యకర విషయం బయటపడింది. సర్వే జరిగిన తీరు కరోనా సంక్షోభ సమయంలో భారతీయ యువత ఆలోచన ధోరణి ఎలా ఉంది. ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నారో తెలుసుకునేందుకు ఇండియాలెండ్స్ సంస్థ దేశంలో ఉన్న 20 నగరాల్లో సర్వే చేపట్టింది. ఇందులో 20 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న 11 వేల మంది యువతీ యువకుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. చదువు, వ్యాపారం, పెళ్లి, టూర్లు, మెడికల్, ఇళ్లు, వాహాన కొనుగోలు, చదువు, పాత బాకీలు తీర్చడం వంటి అవసరాలను ఆప్షన్లుగా పేర్కొంది. వాటిలో దేని కోసం అప్పు చేయాలనుకుంటున్నారనే అంశంపై సమగ్ర సర్వే నిర్వహించింది. 2020 ఆగస్టు నుంచి 2021 మార్చి వరకు ఒకసారి, 2021 ఏప్రిల్ నుంచి 2021 జులై మధ్య కాలంలో రెండోసారి అభిప్రాయాలను సేకరించింది. పెళ్లే ముఖ్యం మనీ లెండ్ సంస్థ అంచనాలను తలకిందులు చేస్తూ 33 శాతం మంది యువత తాము పెళ్లి కోసం అప్పు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. కరోనా కారణంగా ఓవైపు జాబ్‌లో రిస్క్ పెరిగిందని, మరోవైపు రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. దీంతో అప్పు చేసైనా సరే సాధ్యమైనంత త్వరగా మ్యారిడ్ పర్సన్‌గా మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కోవిడ్ ఫస్ట్‌వేవ్‌లో ఈ తరహా వాళ్లు కేవలం 22 శాతమే ఉన్నారు. వ్యాపారం చూసుకోవాల్సిందే కోవిడ్ కారణంగా వచ్చిన లాక్డౌన్, సోషల్ డిస్టెన్స్, ఆన్లైన్ వ్యవస్థతో ప్రైవేటు రంగంలో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. చాలా మంది ఉద్యోగుల మెడపై తొలగింపు కత్తి వేలాడుతూనే ఉంది. దీంతో స్వంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో బిజినెస్ కోసం లోను తీసుకుంటామనే వారి సంఖ్య 16 శాతం ఉండగా సెకండ్ వేవ్ దగ్గరికి వచ్చే సరికి అది 23 శాతానికి పెరిగింది. ఇప్పుడు వద్దే వద్దు కోవిడ్ ఎఫెక్ట్‌తో జీతాల్లో కోత, ఇంకా పుంజుకోని వ్యాపారాలతో జనాల చేతిలో సేవింగ్స్ అడుగంటి పోతున్నాయి. భారీ ఖర్చులు చేసేందుకు వెనుకాడుతున్నారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణం వంటి ఆలోచణలు వాయిదా వేస్తున్నారు. గతంలో ఉద్యోగం, వ్యాపారంలో స్థిరపడిన వారి తదుపరి లక్క్ష్యంగా ఇంటి నిర్మాణం ఉండేది. ఇప్పుడు వారి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో సర్వేలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది ఇంటిలోన్లు పెడతామని చెప్పగా సెకండ్‌వేవ్ దగ్గరికి వచ్చే సరికి 24 శాతానికి పరిమితం అయ్యారు. పెళ్లి తర్వాత ఆస్పత్రి ఖర్చులే కోవిడ్ ఫస్ట్‌వేవ్ సమయంలో ఇంటి నిర్మాణం గురించి ఆలోచన చేసిన యువత సెకండ్‌వేవ్ వచ్చే సరికి ఇంటిని పక్కన పెట్టి పెళ్లికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాదు వ్యాపారం చేసుకోవడానికి సగటున రూ.2.62 లక్షల లోను చాలు అని చెబుతున్న వారు పెళ్లి దగ్గరికి వచ్చే సరికి లోను అమౌంట్‌ని రూ. 4.13 శాతానికి పెంచేశారు. ఇదే సమయంలో మెడికల్ ఖర్చుల కోసం కూడా రూ. 4 లక్షల వరకు లోను తీసుకునేందుకు రెడీ అయ్యారు. కోవిడ్ కారణంగా పెరిగిన మెడికల్ ఖర్చులు యువతకి భారంగా మారాయి. -
మ్యూచువల్ ఫండ్స్ ‘సహీ హై..?
‘మ్యూచువల్ ఫండ్స్ సహీ హై’... ఎక్కడో విన్నట్టు ఉంది కదూ..? టీవీ సీరియళ్ల మధ్యలో ప్రకటనలు.. పత్రికల్లో, వార్తా చానళ్లలో వచ్చే ప్రకటనల్లో.. సెలబ్రిటీలు దర్శనమిచ్చి చేస్తున్న కొటేషన్ ఇది. ‘మ్యూచువల్ ఫండ్స్ సరైనవే..’అని దీని అర్థం. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ చేస్తున్న విస్తృత ప్రచార కార్యక్రమంలోభాగమే ఇది. కానీ, ఆచరణలో అది ప్రతిఫలిస్తోందా..? అని ప్రశ్నిస్తే.. జవాబు వెతుక్కునే ముందు చూడాల్సిన గణాంకాలు కొన్ని ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలానికి అని ప్రముఖంగా చెబుతుంటారు కనుక.. దీర్ఘకాలానికి నిఫ్టీ, నిఫ్టీ టీఆర్ఐ సూచీలతో పోలిస్తే డైవర్సిఫైడ్ ఫండ్స్ పనితీరును విశ్లేషించి చూడాలి. ఏటా జనవరి మొదటి ట్రేడింగ్ రోజున కొనుగోలు చేసి 2020 డిసెంబర్ వరకు కొనసాగించి ఉంటే, నిఫ్టీ రాబడుల తీరు ఎలా ఉందీ.. ఈ కాలంలో ఎన్ని పథకాలు ప్రారంభమయ్యాయి.. అదే సమయంలో ఎన్ని నిఫ్టీతో పోలిస్తే మంచి పనితీరు చూపించాయన్నది ఈ గణాంకాల్లో చూడొచ్చు.. ఈటీఎఫ్‌లను ఎందుకు నమ్ముకోకూడదు? నిఫ్టీ ఇండెక్స్‌లోని స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెడుతూ సూచీలను అనుకరించే ఈటీఎఫ్‌లో ఎక్స్ఛ్పెన్స్ రేషియో (ఫండ్స్ నిర్వహణ చార్జీలు) చాలా తక్కువకే, ఈక్విటీ పథకాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉంటున్నప్పుడు.. సాధారణ ఈక్విటీ పథకాలనే ఎందుకు ఆశ్రయించడం? ఎందుకంటే మన దేశంలో ఫండ్స్ పథకాలు ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విక్రయించబడుతున్నవే. వారికి ట్రయల్ కమీషన్ ముడుతుంటుంది. మ్యూచువల్ ఫండ్స్ సహీ హై కాదా? నిఫ్టీ, నిఫ్టీ టీఆర్ఐను మించి ఎక్కువ సందర్భాల్లో అధిక రాబడులను ఇచ్చే మెరుగైన విధానాలున్నాయి. ఫండ్స్ పథకాల పనితీరును ఎటువంటి పక్షపాతం లేకుండా పరిశీలించి, తగిన సామర్థ్యం కలిగిన పథకాలను ఎంచుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించొచ్చు. అయితే నిపుణుల సహకారం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే కొంత ఫీజు రూపంలో ఇందుకు సంబంధించి చెల్లించేందుకు సిద్ధపడాలి. ప్రసాద్ వేమూరు – సీఎండీ, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ -
వారసుల కోసం కలలు కంటున్నారా?
దంపతులు తల్లిదండ్రులుగా మారే వేళ ఆ ఇంటి బడ్జెట్ రూపు రేఖలు కూడా మారిపోతాయి. ఆర్థిక స్థిరత్వంతోపాటు, చిన్నారి భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు ఎన్నో చర్యలు అవసరం అవుతాయి. ప్రసవ (డెలివరీ) ముందస్తు దశలో అయ్యే వైద్య ఖర్చులు, డెలివరీ, ఆ తర్వాత కూడా ఎన్నో ఖర్చులు వచ్చి పడతాయి. వారసులు వచ్చిన వేళ ఇంట్లో వేడుక నిర్వహణ, ఆ తర్వాత వారు ఎదిగే క్రమంలో అవసరాలు, స్కూలు దశకు వచ్చిన తర్వాత ఫీజులు, ఇతరత్రా వ్యయాలు చెప్పనక్కర్లేదు. అందుకే ఈ వ్యయాలకు తడుముకోకుండా, ఆర్థికంగా సతమతం కాకుండా ఉండాలంటే వారసులు కావాలనిపించిన మరుక్షణమే ఆర్థిక ప్రణాళిక కూడా మొదలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఆ వివరాలే మీకోసం... డెలివరీకి ముందు వైద్య ఖర్చుల కోసం వైద్య పరీక్షలు, హాస్పిటల్లో చికిత్సలకు అధిక చార్జీలను దృష్టిలో ఉంచుకోవాలి. హెల్త్ ప్లాన్ ఉన్నప్పటికీ, కేవలం డెలివరీ సమయంలో ఆస్పత్రి చార్జీలను కవర్ చేస్తాయి. అందులోనూ పరిమితులు విధిస్తుంటాయి కంపెనీలు. కనుక గర్భిణీలుగా ఉన్న సమయంలో అయ్యే ఖర్చులన్నింటినీ హెల్త్ ప్లాన్ కవర్ చేయదని గుర్తు పెట్టుకోవాలి. అందుకే పిల్లలు కావాలనుకున్న మరుక్షణం నుంచీ ప్రతీ నెలా కొంత మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లలో డెలివరీ ముందు చేయించే పరీక్షలు, డెలివరీ చార్జీలను కూడా కలుపుకుంటే రూ.3 లక్షల వరకూ వ్యయాలు అవుతున్నాయి. కంపెనీలు లేదా ప్రభుత్వం తరఫున పూర్తిగా కవరేజీ లేకుంటే ఇంత భారీ వ్యయాల కోసం బడ్జెట్ తలకిందులు అయిపోతుంది. గ్రూపు ఇన్సూరెన్స్ ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్లలో ప్రసవ ఖర్చులకు కవరేజీ పరిమితంగానే ఉంటుంది. వారు తీసుకున్న బీమా మొత్తంపై ఇది ఎంతన్నది ఆధారపడి ఉంటుంది. పైగా ఆస్పత్రి ఖర్చులను పూర్తిగా కవర్ చేయవు. కవరేజీ ఉన్నప్పటికీ అధిక ప్రీమియం ఉండొచ్చు. అలాగే, వెయిటింగ్ పీరియడ్ నిబంధన ఉందేమో చూడాలి. దీనికంటే ఉద్యోగులు సంస్థ తరఫున తీసుకునే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో కవరేజీ కాస్త మెరుగ్గా ఉంటుంది. అయితే, ఇది కూడా బీమా మొత్తాన్ని బట్టి గరిష్ట పరిమితి ఉంటుంది. ఉదాహరణకు రూ.2 లక్షల పాలసీ ఉంటే పరిమితి రూ.40,000గానే ఉంటుంది. కంపెనీ సెలవుల విధానం ఉద్యోగం చేస్తున్న మహిళలు అయితే పూర్తిగా వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్‌కు అవకాశం ఉందా అన్నది చూడాలి. మెటర్నిటీ బెనిఫిట్ (అమెండ్మెంట్) యాక్ట్, 2017 ప్రకారం మహిళా ఉద్యోగి ఇద్దరి పిల్లల వరకు 26 వారాల మెటర్నిటీ లీవ్‌కు అర్హులు. అయితే, కంపెనీ హెచ్ఆర్ విధానాన్ని బట్టి ఇందులో మార్పు ఉండొచ్చు. అందుకని ఓ సారి కంపెనీ హెచ్ఆర్లో విచారించి తెలుసుకోవాలి. ఒకవేళ సెలవును పొడిగించుకోదలిస్తే అందుకు విధానం ఏంటి, మెటర్నిటీ లీవ్‌కు ఇతర సెలవులతో కలిపి తీసుకుంటారా అన్నది తెలుసుకోవాలి. మరింత కాలం పాటు విశ్రాంతి తీసుకోవాలంటే అందుకు అనుమతిస్తారేమో కనుక్కుకోవాలి. అత్యవసర నిధి డెలివరీకి ముందు వైద్యం కోసం లేదా ఇతర అత్యవసర ఖర్చులు ఎదురైతే వాటిని తట్టుకునేందుకు వీలుగా కొంత నిధిని పక్కన పెట్టుకోవాలి. కనీసం ఆరు నెలల కుటుంబ అవసరాలకు సరిపడా ఈ మొత్తం ఉండాలి. దీనికి అదనంగా ఫ్రీ డెలివరీ చెకప్‌లు, హాస్పిటల్లో అయ్యే చికిత్సల వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అత్యవసరాలు ఎదురైతే ఇబ్బంది పడకుండా ఈ నిధి ఆదుకుంటుంది. బడ్జెట్ ప్రణాళిక అప్పటి వరకూ దంపతుల్లో ఒకరికి ఒకరు. ఇప్పుడు వారిద్దరికీ మరొకరు. కొత్తగా పాప లేదా బాబు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటి బడ్జెట్ కనీసం 10 శాతం పెరిగిపోతుందని ఆర్థిక సలహాదారుల అంచనా. ప్రస్తుత బడ్జెట్‌కు శిశువు సంరక్షణ, ఇతర అవసరాలకు అయ్యే వ్యయాలను కలుపుకోవాలి. బేబీ ఉత్పత్తులు, వ్యాక్సినేషన్లు, తల్లి, శిశువు ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం వ్యయాలను పరిగణనలోకి తీసుకోవాలి. చిన్నారుల భవిష్యత్తు అవసరాల కోసం ఆర్థిక ఉత్పత్తుల (బీమా పాలసీలు/ఫండ్స్) పైనా దృష్టి పెట్టాలి. తమ కలల రూపమైన చిన్నారి అవసరాలకు చేసే ఖర్చులు వేరు. విచక్షణా రహితంగా చేసే ఖర్చులు వేరు. విచక్షణారహిత వ్యయాలకు కళ్లెం వేసి వాటిని చిన్నారుల కోసం పెట్టుబడులుగా మరలిస్తే ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళ అయి, డెలివరీ కోసం కొంత కాలం పాటు విరామం తీసుకోదలిస్తే ఆర్థిక బాధ్యతలను ఓ సారి గుర్తు చేసుకోవాలి. ఇంటి రుణం వంటివి తీసుకుని ప్రతీ నెలా ఈఎంఐలు చెల్లించే వారి ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా క్లిష్టంగా మారతాయని అంటున్నారు అర్థయంత్ర సీఈవో నితిన్ వ్యాకరణం. అన్ని వ్యయాలను తప్పించుకోలేమని, అందుకనే పెళ్లి అయిన తర్వాత చాలా ముందు నుంచే పిల్లల కోసం ఆర్థికంగా సన్నద్ధం కావాలన్నది సూచన. రుణం తీసుకుని ఉంటే నెలవారీ ఈఎంఐలు, బీమా పాలసీలు ఉంటే ప్రీమియం చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లు వీటన్నింటికీ కొరత లేకుండా ప్రణాళిక మేరకు కొనసాగాలి. దంపతులు ఇద్దరూ పనిచేసే వారు అయితే, పిల్లలు కలిగే వరకు ఒక్క వేతనాన్నే ఖర్చు చేస్తూ, మరో వేతనాన్ని పక్కన పెట్టడం మంచి ఆలోచనే అవుతుంది. ఒకవేళ నిబంధనల మేరకు మెటర్నిటీ సెలవులు పూర్తయిన వెంటనే ఉద్యోగ బాధ్యతల్లోకి వచ్చేయాలనుకుంటే, ఇంట్లో చిన్నారి సంరక్షణ చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. డెలివరీ తర్వాత... బీమా పాలసీ మీరు బీమా పాలసీ తీసుకుని లేకపోతే వెంటనే మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్ల మొత్తం కవరేజీతో టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలు మూడు, నాలుగు ఉన్నా కానీ సరైన బీమా రక్షణ ఉండదని గుర్తుంచుకోవాలి. అందుకని సరైన బీమా కవరేజీ కోసం టర్మ్‌ప్లాన్ తీసుకోవాలి. ఇండివిడ్యువల్ హెల్త్ పాలసీ తీసుకుని ఉంటే వెంటనే కుటుంబ సభ్యులు అందరికీ కవరేజీనిచ్చే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి. ఇందులో మీ పిల్లలకు కూడా కవరేజీ లభిస్తుంది. విల్లు రాయడం చిన్నారి మీ ఇంట్లోకి అడుగు పెట్టిన నాడే విల్లు రాయడం మంచి నిర్ణయం అవుతుంది. అప్పటికే విల్లు రాసి ఉంటే వారసులొచ్చారు కనుక విల్లును అప్డేట్ చేసుకోవాలి. చిన్నారి మైనర్ కనుక గార్డియన్‌ను నియమించుకోవాలి. మీ పెట్టుబడులకు నామినీగా మీ చిన్నారి పేరును చేర్చుకోవచ్చు. ఆర్థిక బహుమానాలు ఇక మీ బుజ్జాయికి సన్నిహితులైన కుటుంబ సభ్యులు నగదు రూపంలో బహుమానాలు ఇస్తుంటారు. వీటిని ఏదో ఒకదానికి ఖర్చు పెట్టేయకుండా, బ్యాంకు ఖాతాలో జమ చేసి, వారి భవిష్యత్తు అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయడం మంచిది. . స్వల్ప కాలిక లక్ష్యాలు పాప, లేదా బాబు ఎవరైనా కానీ, వారి మత సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలు కచ్చితంగా ఉంటాయి. బాలసాల, నామకరణం, అన్న ప్రాసన, మొదటి పుట్టినరోజు ఇవన్నీ స్వల్ప కాలంలో ఎదురవుతాయి. వీటి కోసం స్థోమతను బట్టి రూ.వేలు నుంచి రూ.లక్షల వరకు ఖర్చు చేసే వారున్నారు. ఇక మూడేళ్లకు వారిని ప్లే స్కూల్లో చేర్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్కూల్లో చేర్పించడం. అందుకని ఈ అవసరాలన్నింటికీ ఆర్థికంగా ప్రణాళిక వేసుకుని అందుకోసం తగినంత సమకూర్చుకోవాలి. పెట్టుబడులకు స్వల్పకాలిక సాధనాలు కూడా ఉన్నాయి. డెట్ ఫండ్స్‌లో 6–7 శాతం మధ్య రాబడులు అందుకోవచ్చు. తగిన విధమైన ఆర్థిక సలహాలకు సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాలు చిన్నారుల దీర్ఘకాలిక లక్ష్యాలు అంటే వారి ఉన్నత విద్య, వివాహం. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని అధిక రాబడులను ఇచ్చే సాధనాలు ఈ అవసరాలకు అనువుగా ఉంటాయి. దీర్ఘకాల అవసరాల కోసం ఎక్కువ పెట్టుబడులను ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. పిల్లల విద్య కోసం సంప్రదాయ పాలసీలు అయిన మనీ బ్యాక్ మంచి ఎంపిక కాదని, ఇవి తక్కువ రిటర్నులు ఇస్తాయని తెలుసుకోవాలి. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత డైవర్సిఫైడ్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ పథకాలు, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను పరిశీలించాలి. ఇక చైల్డ్ ప్లాన్స్ పేరుతో ఉండే సంప్రదాయ బీమా పాలసీలు, యులిప్‌లు, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు ఆయా విభాగాల్లోని ఇతర పథకాలకు భిన్నంగా ఏమీ ఉండవంటున్నారు నిపుణులు. చిన్నారి పేరుతో ఉండే మ్యూచువల్ ఫండ్ ప్లాన్ అయితే ఆయా అంశాలపై అవగాహన అవసరం. -
బాబు దీక్ష చాలా ఖరీదు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధర్మపోరాటం పేరిట శుక్రవారం విజయవాడలో చేస్తున్న ఒక్కపూట దీక్షకోసం ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసేస్తున్నారు. ఏకంగా రూ.30 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నట్లు అంచనా. ఇంత భారీగా ప్రజాధానాన్ని వృథా చేయడంపై పలువర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదాపై ఆదినుంచి పలురకాలుగా కుప్పిగంతులు వేసి చివరకు తన స్వార్ధంకోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టిన చంద్రబాబు ప్రజలను మరోసారి పక్కదారి పట్టించేందుకు ఈ దీక్షను చేపడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీక్ష చేపడుతున్న విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో వేదిక ఏర్పాట్లకే రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. వేదికతో పాటు స్టేడియంలో డెకరేషన్, ఎండ వేడి లేకుండా ఉండేందుకు ప్రత్యేక ఏసీ యంత్రాలు, భారీ కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సౌండ్ సిస్టమ్, జిల్లాల నుంచి రప్పించేందుకు భారీగా బస్సుల ఏర్పాటు, జనానికి మజ్జిగ ప్యాకెట్లు, ఇతర డ్రింకులు, మంచినీళ్లు, ఆహార పదార్ధాలను అందించేలా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ఇతర ముఖ్య అధికారులంతా గత కొన్ని రోజులుగా ఈ ఏర్పాట్లలోనే నిమగ్నమయ్యారు. జనాన్ని తరలించే బస్సుల కోసమే రూ.కోట్లల్లో... విద్యార్ధులను తరలించేందుకు విజయవాడ సహా కృష్ణా జిల్లా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వేలల్లో ఆర్టీసీ, ప్రయివేటు బస్సులు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో 650, గుంటూరు జిల్లాలో 840 ఆర్టీసీ బస్సులతో పాటు మరో వందల సంఖ్యలో విద్యాసంస్థల బస్సులను స్వాధీనం చేసుకొని జనాన్ని తరలించనున్నారు. ఒంగోలు నుంచి 150 బస్సులు, పశ్చిమగోదావరిలో ప్రయివేటు విద్యాసంస్థల బస్సులతో పాటు 169 ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు. ఈ బస్సులకు అయ్యే వ్యయం మొత్తం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తారని, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల డిపోల మేనేజర్లకు సమాచారం పంపారు. ఒక్కో బస్సుకు రూ.14,000 చొప్పున రూ.కోట్లలో ఖర్చు అవుతుంది. పైగా విద్యా సంస్థల నుంచి తీసుకుని వందలాది బస్సుల ఖర్చంతా ఆయా సంస్థలే భరించాలని హకుం జారీ చేశారు. ఇక స్టేడియంలో టెంపరరీ టాయిలెట్లు ఏర్పాట్లు, మూడు షిఫ్టులలో పారిశుధ్య కార్మికులను నియమిస్తున్నారు. ఇలా అడుగడుగునా ప్రజా ధనాన్ని అడ్డగోలుగా ఖర్చుపెడుతున్నారు. భారీగా వేదిక.. సౌకర్యాలకు భారీగా ఖర్చు స్టేడియం ఆవరణలో గురువారం సాయంత్రానికే టెంట్లు ఏర్పాటు చేశారు. ప్రాంగణంలోని ప్రతి ఒక్కరికీ సీఎం కనిపించేలా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రజాసంఘాల ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కూర్చునేందుకు వీలుగా భారీ వేదికను సిద్ధం చేశారు. దీక్షా ప్రాంగణంలో ఈ వేదికతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. విజయవాడలోని అన్ని శాఖల అధికారులతో పాటు చుట్టుపక్కల జిల్లాల యంత్రాంగాన్ని కూడా రప్పిస్తున్నారు. చంద్రబాబు దీక్ష చేస్తున్న ఇందిరాగాంధీ స్టేడియం లోపల, బయట భారీగా పోలీసులును మోహరిస్తున్నారు. పలువురు ఐపీఎస్ అధికారులు, డిఎస్పీలు, సీఐ, ఎస్సైలను, ఇతర పోలీసు బలగాలను జిల్లాల నుంచి రప్పించారు. ఇలా అన్నిటికీ శుక్రవారం అయ్యే మొత్తం ఖర్చు రూ.30 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరికి ఇటీవల బంద్ పాటించగా ఆర్టీసీకి రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పిన చంద్ర బాబు ఇప్పుడు తన ఒక్కపూట దీక్ష పేరిట అంతకు మూడురెట్లు డబ్బును ఖర్చు చేస్తుం డటంపై ప్రజలు మండిపడుతున్నారు. -
అక్షరాలా రూ.10 కోట్లు
- కేకులు, పూలకు రూ. 2 కోట్లు - విందుకు రూ. 2 కోట్లకుపైనే - మద్యానికి రూ. 5 కోట్లు.... ఇతరాలకు రూ. కోటి - నూతన సంవత్సర వేడుకలకు జిల్లా వాసులు చేసిన ఖర్చు కడప కల్చరల్ : నూతన సంవత్సరం సందర్భంగా సంతోషంగా గడిపేందుకు జిల్లా వాసులు 24 గంటల్లో చేసిన ఖర్చు రూ. 10 కోట్లు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఆ రోజును జీవితంలో మరుపురాని విధంగా మలుచుకోవాలని 2014 డిసెంబరు 31 వతేదీ మధ్యాహ్నంనుంచి 2015 జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుని బంధుమిత్రులతో విందులు, వినోదాలతో సంతోషంగా గడిపారు. ఇందులో ముఖ్యంగా యువతదే ప్రథమస్థానం. డిసెంబరు 31వ తేదీ రాత్రి జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వినోద, సాంసృ్కతిక కార్యక్రమాల కోసమే ప్రజలు దాదాపు రూ. కోటి ఖర్చు చేశారు. నూతన సంవత్సరం ప్రారంభ దినాన సంతోషంగా గడిపితే ఈ సంవత్సరమంతా అదే ఆనందం కొనసాగుతుందన్న నమ్మకంతో ఖర్చు గురించి ఆలోచించలేదు. డిసెంబరు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు సందడిగా మారాయి. మద్యం షాపుల్లో రాత్రి 12.30 గంటల వరకు గ్లాసుల గలగల వినిపించింది. అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత రోడ్లపై ఎలాంటి కార్యక్రమాలను అనుమతించబోమని, వేడుకలన్నీ ఈలోపుగానే నిర్వహించుకోవాలని పోలీసులు ప్రత్యేకంగా హెచ్చరించడంతో గడువులోపే సంబరాలు ముగించుకున్నారు. పోలీసుల హెచ్చరికల ప్రభావంతో తెల్లవార్లు జరగాల్సిన ప్రత్యేక సంబరాలకు అడ్డుకట్ట పడినట్లయింది. ఫలితంగా నూతన సంవత్సర వేడుకల ఖర్చుకూడా ఒకింత తగ్గింది.