ఆషాఢం ముగిసింది... శ్రావణం వచ్చేసింది. ప్రతీ ఊళ్లో పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. కొత్త జంట ఊరేగింపులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ కల్యాణ తంతు మన కంటికి కనిపించేంత సుళువగా ఏమీ జరగడం లేదట! వివాహం కోసం పెద్దవాళ్లే కాదు వరుడు, వధువు కూడా తిప్పలు పడుతున్నారు. అప్పుల మూట నెత్తిన మోసేందుకు సిద్ధమవుతున్నారు.
సాక్షి, వెబ్‌డెస్క్: మన యూత్‌కి కోవిడ్‌తో పెద్ద చిక్కు వచ్చి పడింది. ఓవైపు పెళ్లీడు తరుముతుంటే మరోవైపు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. దీంతో యువత ఒత్తిడి లోనవుతున్నారు. వీకెండ్‌లో ఎంజాయ్ చేయాల్సిన వారు, కొత్త మోడల్ బైకులు, కార్ల గురించి బ్రౌజ్ చేయాల్సి వాళ్లు.. అప్పులు చేసేందుకు ఆతృత పడుతున్నారు. అది కూడా మూడుముళ్ల బంధం కోసం. అవును ఇది నిజం ! ఇండియాలెండ్ సంస్థ తాజాగా చేసిన సర్వేలో ఈ ఆశ్చర్యకర విషయం బయటపడింది.
సర్వే జరిగిన తీరు
కరోనా సంక్షోభ సమయంలో భారతీయ యువత ఆలోచన ధోరణి ఎలా ఉంది. ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నారో తెలుసుకునేందుకు ఇండియాలెండ్స్ సంస్థ దేశంలో ఉన్న 20 నగరాల్లో సర్వే చేపట్టింది. ఇందులో 20 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న 11 వేల మంది యువతీ యువకుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. చదువు, వ్యాపారం, పెళ్లి, టూర్లు, మెడికల్, ఇళ్లు, వాహాన కొనుగోలు, చదువు, పాత బాకీలు తీర్చడం వంటి అవసరాలను ఆప్షన్లుగా పేర్కొంది. వాటిలో దేని కోసం అప్పు చేయాలనుకుంటున్నారనే అంశంపై సమగ్ర సర్వే నిర్వహించింది. 2020 ఆగస్టు నుంచి 2021 మార్చి వరకు ఒకసారి, 2021 ఏప్రిల్ నుంచి 2021 జులై మధ్య కాలంలో రెండోసారి అభిప్రాయాలను సేకరించింది.
పెళ్లే ముఖ్యం
మనీ లెండ్ సంస్థ అంచనాలను తలకిందులు చేస్తూ 33 శాతం మంది యువత తాము పెళ్లి కోసం అప్పు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. కరోనా కారణంగా ఓవైపు జాబ్‌లో రిస్క్ పెరిగిందని, మరోవైపు రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. దీంతో అప్పు చేసైనా సరే సాధ్యమైనంత త్వరగా మ్యారిడ్ పర్సన్‌గా మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కోవిడ్ ఫస్ట్‌వేవ్‌లో ఈ తరహా వాళ్లు కేవలం 22 శాతమే ఉన్నారు.
వ్యాపారం చూసుకోవాల్సిందే
కోవిడ్ కారణంగా వచ్చిన లాక్‌డౌన్, సోషల్ డిస్టెన్స్, ఆన్‌లైన్ వ్యవస్థతో ప్రైవేటు రంగంలో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. చాలా మంది ఉద్యోగుల మెడపై తొలగింపు కత్తి వేలాడుతూనే ఉంది. దీంతో స్వంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో బిజినెస్ కోసం లోను తీసుకుంటామనే వారి సంఖ్య 16 శాతం ఉండగా సెకండ్ వేవ్ దగ్గరికి వచ్చే సరికి అది 23 శాతానికి పెరిగింది.
ఇప్పుడు వద్దే వద్దు
కోవిడ్ ఎఫెక్ట్‌తో జీతాల్లో కోత, ఇంకా పుంజుకోని వ్యాపారాలతో జనాల చేతిలో సేవింగ్స్ అడుగంటి పోతున్నాయి. భారీ ఖర్చులు చేసేందుకు వెనుకాడుతున్నారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణం వంటి ఆలోచణలు వాయిదా వేస్తున్నారు. గతంలో ఉద్యోగం, వ్యాపారంలో స్థిరపడిన వారి తదుపరి లక్క్ష్యంగా ఇంటి నిర్మాణం ఉండేది. ఇప్పుడు వారి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో సర్వేలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది ఇంటిలోన్లు పెడతామని చెప్పగా సెకండ్‌వేవ్ దగ్గరికి వచ్చే సరికి 24 శాతానికి పరిమితం అయ్యారు.
పెళ్లి తర్వాత ఆస్పత్రి ఖర్చులే
కోవిడ్ ఫస్ట్‌వేవ్ సమయంలో ఇంటి నిర్మాణం గురించి ఆలోచన చేసిన యువత సెకండ్‌వేవ్ వచ్చే సరికి ఇంటిని పక్కన పెట్టి పెళ్లికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాదు వ్యాపారం చేసుకోవడానికి సగటున రూ.2.62 లక్షల లోను చాలు అని చెబుతున్న వారు పెళ్లి దగ్గరికి వచ్చే సరికి లోను అమౌంట్‌ని రూ. 4.13 శాతానికి పెంచేశారు. ఇదే సమయంలో మెడికల్ ఖర్చుల కోసం కూడా రూ. 4 లక్షల వరకు లోను తీసుకునేందుకు రెడీ అయ్యారు. కోవిడ్ కారణంగా పెరిగిన మెడికల్ ఖర్చులు యువతకి భారంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment