దేశవ్యాప్తంగా ముంబయి ఖరీదైన నగరాల్లో మొదటిస్థానంలో ఉందని ‘మెర్సర్ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్’ సర్వే వెల్లడించింది. కలల నగరం(సిటీ ఆఫ్ డ్రీమ్స్)గా పేరున్న భారత వాణిజ్య రాజధాని ముంబయిలో జీవనవ్యయం భారీగా పెరిగిందని నివేదికలో తెలిపారు. వ్యక్తిగత ఖర్చులు, రవాణా ఖర్చులు, గృహ అద్దెలు అధిక స్థాయిలో ఉన్నాయని సర్వేలో వెల్లడైంది.
నివేదికలోని వివరాల ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా ముంబయి గతంలో కంటే 11 స్థానాలు ఎగబాకి 136వ ర్యాంక్‌కు చేరుకుంది. దిల్లీ 4 స్థానాలు పెరిగి 164వ ర్యాంక్‌కు, చెన్నై ఐదు స్థానాలు దిగజారి 189కు, బెంగళూరు ఆరు స్థానాలు తగ్గి 195కు, హైదరాబాద్ ఎలాంటి మార్పు లేకుండా 202 వద్ద స్థిరంగా ఉంది. పుణె ఎనిమిది స్థానాలు పెరిగి 205కి, కోల్‌కతా నాలుగు స్థానాలు పెరిగి 207కి చేరుకుంది.
అంతకుముందు ఏడాదికంటే 2023లో 20 స్థానాలు దిగజారి 147వ ర్యాంక్‌కు చేరుకున్న ముంబయి 2024లో 136వ ర్యాంక్‌కు పెరిగింది. ఎనానమీలో వస్తున్న ఆర్థిక మార్పుల వల్ల ముంబయిలో జీవన వ్యయం పెరుగుతోందని నివేదిక పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023లో దిల్లీ 169 నుంచి 164కి, కోల్‌కతా 211 నుంచి 207కి, పుణె 215 నుంచి 205కి చేరుకుంది. చెన్నై 184 నుంచి 189కి, బెంగళూరు 189 నుంచి 195కి, హైదరాబాద్ 202 వద్ద నిలకడగా ఉంది. ఆసియావ్యాప్తంగా ఉన్న అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై 21వ స్థానంలో, దిల్లీ 30వ స్థానంలో ఉన్నాయని నివేదిక తెలిపింది.
ఈ సందర్భంగా మెర్సర్ ఇండియా మొబిలిటీ లీడర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ..‘ప్రపంచ ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో భారత్ చాలావరకు నిలకడగా ఉంది. మెర్సర్ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో ముంబయి గ్లోబల్ ర్యాంకు పెరిగినప్పటికీ మారుతున్న ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలు ఉన్నాయి. దిల్లీలో గృహ అద్దెలు అత్యధికంగా 12-15 శాతం పెరిగాయి. ముంబయిలో 6-8 శాతం, బెంగళూరులో 3-6 శాతం, పుణె, హైదరాబాద్, చెన్నైలో 2-4 శాతం గృహ అద్దెలో పెరుగుదల కనిపించింది. సౌందర్య సాధనాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు ముంబయిలో అత్యంత ఖరీదైనవిగా మారాయి. ఈవిభాగంలో చెన్నై తర్వాతి స్థానంలో ఉంది. కోల్‌కతాలో వాటి ధర తక్కువగా ఉంది. కరెంటు బిల్లులు, యుటిలిటీ ఖర్చులు ముంబైలో చాలా ఖరీదయ్యాయి. ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు, నిర్వహణ, రవాణా ఖర్చులు పెరిగాయి. ఈ విభాగంలో బెంగళూరు తర్వాతి స్థానంలో ఉంది.
ఇతర దేశాల్లోని ప్రతిభ కలిగిన ఉద్యోగులను ఆకర్షించడంలో స్థానికంగా ఉన్న హౌసింగ్ ఖర్చులు కీలకంగా మారుతాయని నివేదిక తెలిపింది. దాంతోపాటు ఉద్యోగుల జీవననాణ్యతపై ప్రభావం పడుతుందని చెప్పింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భౌగోళిక రాజకీయ అనిశ్చుతులు, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటుందని, దాంతో సంస్థలు ఇతరదేశాల్లోని ప్రతిభ ఉన్నవారిని ఆకర్షించే పనిలో ఉన్నాయని నివేదిక తెలిపింది. చాలాకంపెనీలు ముంబయిలో తమ కార్యకలాపాలు సాగిస్తుండడంతో విదేశీ ఉద్యోగులకు తగిన జీవనప్రమాణాలు అందించేలా ఏర్పాటు చేస్తున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఖర్చులు ఎక్కువవుతున్నాయని మెర్సర్ పేర్కొంది.
ఇదీ చదవండి: ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..
ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా అధిక లివింగ్ కాస్ట్ ఉన్న నగరాల్లో హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్ (స్విట్జర్లాండ్), జెనీవా (స్విట్జర్లాండ్), బాసెల్ (స్విట్జర్లాండ్), బెర్న్ (స్విట్జర్లాండ్), న్యూయార్క్ సిటీ (యూఎస్), లండన్ (యూకే), నసావు (బహామాస్), లాస్ఏంజిల్స్ (యూఎస్) వరుసస్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment