వారసుల కోసం కలలు కంటున్నారా? | Expense from pregnancy to delivery | Sakshi
Sakshi News home page

వారసుల కోసం కలలు కంటున్నారా?

Published Mon, Jul 30 2018 12:03 AM | Last Updated on Mon, Jul 30 2018 4:24 PM

Expense from pregnancy to delivery - Sakshi

దంపతులు తల్లిదండ్రులుగా మారే వేళ ఆ ఇంటి బడ్జెట్‌ రూపు రేఖలు కూడా మారిపోతాయి. ఆర్థిక స్థిరత్వంతోపాటు, చిన్నారి భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు ఎన్నో చర్యలు అవసరం అవుతాయి. ప్రసవ (డెలివరీ) ముందస్తు దశలో అయ్యే వైద్య ఖర్చులు, డెలివరీ, ఆ తర్వాత కూడా ఎన్నో ఖర్చులు  వచ్చి పడతాయి. వారసులు వచ్చిన వేళ ఇంట్లో వేడుక నిర్వహణ, ఆ తర్వాత వారు ఎదిగే క్రమంలో అవసరాలు, స్కూలు దశకు వచ్చిన తర్వాత ఫీజులు, ఇతరత్రా వ్యయాలు చెప్పనక్కర్లేదు. అందుకే ఈ వ్యయాలకు తడుముకోకుండా, ఆర్థికంగా సతమతం కాకుండా ఉండాలంటే వారసులు కావాలనిపించిన మరుక్షణమే ఆర్థిక ప్రణాళిక కూడా మొదలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఆ వివరాలే మీకోసం... 

డెలివరీకి ముందు  వైద్య ఖర్చుల కోసం
వైద్య పరీక్షలు, హాస్పిటల్‌లో చికిత్సలకు అధిక చార్జీలను దృష్టిలో ఉంచుకోవాలి. హెల్త్‌ ప్లాన్‌ ఉన్నప్పటికీ, కేవలం డెలివరీ సమయంలో ఆస్పత్రి చార్జీలను కవర్‌ చేస్తాయి. అందులోనూ పరిమితులు విధిస్తుంటాయి కంపెనీలు. కనుక గర్భిణీలుగా ఉన్న సమయంలో అయ్యే ఖర్చులన్నింటినీ హెల్త్‌ ప్లాన్‌ కవర్‌ చేయదని గుర్తు పెట్టుకోవాలి. అందుకే పిల్లలు కావాలనుకున్న మరుక్షణం నుంచీ ప్రతీ నెలా కొంత మొత్తాన్ని లిక్విడ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లాలి. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లలో డెలివరీ ముందు చేయించే పరీక్షలు, డెలివరీ చార్జీలను కూడా కలుపుకుంటే రూ.3 లక్షల వరకూ వ్యయాలు అవుతున్నాయి. కంపెనీలు లేదా ప్రభుత్వం తరఫున పూర్తిగా కవరేజీ లేకుంటే ఇంత భారీ వ్యయాల కోసం బడ్జెట్‌ తలకిందులు అయిపోతుంది. 

గ్రూపు ఇన్సూరెన్స్‌ 
ఇండివిడ్యువల్‌ హెల్త్‌ ప్లాన్లలో ప్రసవ ఖర్చులకు కవరేజీ పరిమితంగానే ఉంటుంది. వారు తీసుకున్న బీమా మొత్తంపై ఇది ఎంతన్నది ఆధారపడి ఉంటుంది. పైగా ఆస్పత్రి ఖర్చులను పూర్తిగా కవర్‌ చేయవు. కవరేజీ ఉన్నప్పటికీ అధిక ప్రీమియం ఉండొచ్చు. అలాగే, వెయిటింగ్‌ పీరియడ్‌ నిబంధన ఉందేమో చూడాలి. దీనికంటే ఉద్యోగులు సంస్థ తరఫున తీసుకునే గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌లో కవరేజీ కాస్త మెరుగ్గా ఉంటుంది. అయితే, ఇది కూడా బీమా మొత్తాన్ని బట్టి గరిష్ట పరిమితి ఉంటుంది. ఉదాహరణకు రూ.2 లక్షల పాలసీ ఉంటే పరిమితి రూ.40,000గానే ఉంటుంది. 

కంపెనీ సెలవుల విధానం 
ఉద్యోగం చేస్తున్న మహిళలు అయితే పూర్తిగా వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్‌కు అవకాశం ఉందా అన్నది చూడాలి. మెటర్నిటీ బెనిఫిట్‌ (అమెండ్‌మెంట్‌) యాక్ట్, 2017 ప్రకారం మహిళా ఉద్యోగి ఇద్దరి పిల్లల వరకు 26 వారాల మెటర్నిటీ లీవ్‌కు అర్హులు. అయితే, కంపెనీ హెచ్‌ఆర్‌ విధానాన్ని బట్టి ఇందులో మార్పు ఉండొచ్చు. అందుకని ఓ సారి కంపెనీ హెచ్‌ఆర్‌లో విచారించి తెలుసుకోవాలి. ఒకవేళ సెలవును పొడిగించుకోదలిస్తే అందుకు విధానం ఏంటి, మెటర్నిటీ లీవ్‌కు ఇతర సెలవులతో కలిపి తీసుకుంటారా అన్నది తెలుసుకోవాలి. మరింత కాలం పాటు విశ్రాంతి తీసుకోవాలంటే అందుకు అనుమతిస్తారేమో కనుక్కుకోవాలి. 

అత్యవసర నిధి
డెలివరీకి ముందు వైద్యం కోసం లేదా ఇతర అత్యవసర ఖర్చులు ఎదురైతే వాటిని తట్టుకునేందుకు వీలుగా కొంత నిధిని పక్కన పెట్టుకోవాలి. కనీసం ఆరు నెలల కుటుంబ అవసరాలకు సరిపడా ఈ మొత్తం ఉండాలి. దీనికి అదనంగా ఫ్రీ డెలివరీ చెకప్‌లు, హాస్పిటల్‌లో అయ్యే చికిత్సల వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అత్యవసరాలు ఎదురైతే ఇబ్బంది పడకుండా ఈ నిధి ఆదుకుంటుంది. 

బడ్జెట్‌ ప్రణాళిక
అప్పటి వరకూ దంపతుల్లో ఒకరికి ఒకరు. ఇప్పుడు వారిద్దరికీ మరొకరు. కొత్తగా పాప లేదా బాబు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటి బడ్జెట్‌ కనీసం 10 శాతం పెరిగిపోతుందని ఆర్థిక సలహాదారుల అంచనా. ప్రస్తుత బడ్జెట్‌కు శిశువు సంరక్షణ, ఇతర అవసరాలకు అయ్యే వ్యయాలను కలుపుకోవాలి. బేబీ ఉత్పత్తులు, వ్యాక్సినేషన్లు, తల్లి, శిశువు ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం వ్యయాలను పరిగణనలోకి తీసుకోవాలి. చిన్నారుల భవిష్యత్తు అవసరాల కోసం ఆర్థిక ఉత్పత్తుల (బీమా పాలసీలు/ఫండ్స్‌) పైనా దృష్టి పెట్టాలి. తమ కలల రూపమైన చిన్నారి అవసరాలకు చేసే ఖర్చులు వేరు. విచక్షణా రహితంగా చేసే ఖర్చులు వేరు. విచక్షణారహిత వ్యయాలకు కళ్లెం వేసి వాటిని చిన్నారుల కోసం పెట్టుబడులుగా మరలిస్తే ప్రయోజనం ఉంటుంది.  ఉద్యోగం చేసే మహిళ అయి, డెలివరీ కోసం కొంత కాలం పాటు విరామం తీసుకోదలిస్తే ఆర్థిక బాధ్యతలను ఓ సారి గుర్తు చేసుకోవాలి. ఇంటి రుణం వంటివి తీసుకుని ప్రతీ నెలా ఈఎంఐలు చెల్లించే వారి ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా క్లిష్టంగా మారతాయని అంటున్నారు అర్థయంత్ర సీఈవో నితిన్‌ వ్యాకరణం. అన్ని వ్యయాలను తప్పించుకోలేమని, అందుకనే పెళ్లి అయిన తర్వాత చాలా ముందు నుంచే పిల్లల కోసం ఆర్థికంగా సన్నద్ధం కావాలన్నది సూచన. రుణం తీసుకుని ఉంటే నెలవారీ ఈఎంఐలు, బీమా పాలసీలు ఉంటే ప్రీమియం చెల్లింపులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ సిప్‌లు వీటన్నింటికీ కొరత లేకుండా ప్రణాళిక మేరకు కొనసాగాలి. దంపతులు ఇద్దరూ పనిచేసే వారు అయితే, పిల్లలు కలిగే వరకు ఒక్క వేతనాన్నే ఖర్చు చేస్తూ, మరో వేతనాన్ని పక్కన పెట్టడం మంచి ఆలోచనే అవుతుంది. ఒకవేళ నిబంధనల మేరకు మెటర్నిటీ సెలవులు పూర్తయిన వెంటనే ఉద్యోగ బాధ్యతల్లోకి వచ్చేయాలనుకుంటే, ఇంట్లో చిన్నారి సంరక్షణ చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. 
 
డెలివరీ తర్వాత...  బీమా పాలసీ
మీరు బీమా పాలసీ తీసుకుని లేకపోతే వెంటనే మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్ల మొత్తం కవరేజీతో టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవాలి. సంప్రదాయ ఎండోమెంట్‌ పాలసీలు మూడు, నాలుగు ఉన్నా కానీ సరైన బీమా రక్షణ ఉండదని గుర్తుంచుకోవాలి. అందుకని సరైన బీమా కవరేజీ కోసం టర్మ్‌ప్లాన్‌ తీసుకోవాలి. ఇండివిడ్యువల్‌ హెల్త్‌ పాలసీ తీసుకుని ఉంటే వెంటనే కుటుంబ సభ్యులు అందరికీ కవరేజీనిచ్చే ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ తీసుకోవాలి. ఇందులో మీ పిల్లలకు కూడా కవరేజీ లభిస్తుంది. 

విల్లు రాయడం
చిన్నారి మీ ఇంట్లోకి అడుగు పెట్టిన నాడే విల్లు రాయడం మంచి నిర్ణయం అవుతుంది. అప్పటికే విల్లు రాసి ఉంటే వారసులొచ్చారు కనుక విల్లును అప్‌డేట్‌ చేసుకోవాలి. చిన్నారి మైనర్‌ కనుక గార్డియన్‌ను నియమించుకోవాలి. మీ పెట్టుబడులకు నామినీగా మీ చిన్నారి పేరును చేర్చుకోవచ్చు.   

ఆర్థిక బహుమానాలు
ఇక మీ బుజ్జాయికి సన్నిహితులైన కుటుంబ సభ్యులు నగదు రూపంలో బహుమానాలు ఇస్తుంటారు. వీటిని ఏదో ఒకదానికి ఖర్చు పెట్టేయకుండా, బ్యాంకు ఖాతాలో జమ చేసి, వారి భవిష్యత్తు అవసరాల కోసం ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. . 

స్వల్ప కాలిక లక్ష్యాలు
పాప, లేదా బాబు ఎవరైనా కానీ, వారి మత సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలు కచ్చితంగా ఉంటాయి. బాలసాల, నామకరణం, అన్న ప్రాసన, మొదటి పుట్టినరోజు ఇవన్నీ స్వల్ప కాలంలో ఎదురవుతాయి. వీటి కోసం స్థోమతను బట్టి రూ.వేలు నుంచి రూ.లక్షల వరకు ఖర్చు చేసే వారున్నారు.  ఇక మూడేళ్లకు వారిని ప్లే స్కూల్లో చేర్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్కూల్లో చేర్పించడం. అందుకని ఈ అవసరాలన్నింటికీ ఆర్థికంగా ప్రణాళిక వేసుకుని అందుకోసం తగినంత సమకూర్చుకోవాలి. పెట్టుబడులకు స్వల్పకాలిక సాధనాలు కూడా ఉన్నాయి. డెట్‌ ఫండ్స్‌లో 6–7 శాతం మధ్య రాబడులు అందుకోవచ్చు.  తగిన విధమైన ఆర్థిక సలహాలకు సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు. 

దీర్ఘకాలిక లక్ష్యాలు
చిన్నారుల దీర్ఘకాలిక లక్ష్యాలు అంటే వారి ఉన్నత విద్య, వివాహం. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని అధిక రాబడులను ఇచ్చే సాధనాలు ఈ అవసరాలకు అనువుగా ఉంటాయి. దీర్ఘకాల అవసరాల కోసం ఎక్కువ పెట్టుబడులను ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేయాలి. పిల్లల విద్య కోసం సంప్రదాయ పాలసీలు అయిన మనీ బ్యాక్‌ మంచి ఎంపిక కాదని, ఇవి తక్కువ రిటర్నులు ఇస్తాయని తెలుసుకోవాలి. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత డైవర్సిఫైడ్‌ ఫండ్స్, ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలు, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను పరిశీలించాలి. ఇక చైల్డ్‌ ప్లాన్స్‌ పేరుతో ఉండే సంప్రదాయ బీమా పాలసీలు, యులిప్‌లు, హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలకు ఆయా విభాగాల్లోని ఇతర పథకాలకు భిన్నంగా ఏమీ ఉండవంటున్నారు నిపుణులు. చిన్నారి పేరుతో ఉండే మ్యూచువల్‌ ఫండ్‌ ప్లాన్‌ అయితే ఆయా అంశాలపై అవగాహన అవసరం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement