క్లుప్తత.. సమగ్రత | Changes in the Tenth Class Annual Examination | Sakshi
Sakshi News home page

క్లుప్తత.. సమగ్రత

Published Thu, Dec 12 2019 4:47 AM | Last Updated on Thu, Dec 12 2019 4:47 AM

Changes in the Tenth Class Annual Examination - Sakshi

సాక్షి, అమరావతి: పదో తరగతి వార్షిక పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థుల్లో సమగ్ర విషయావగాహన, గుణాత్మక సామర్థ్యాలు, ప్రమాణాలను అంచనా వేసేందుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. సబ్జెక్టులను బట్టీపట్టి ఆన్సర్లు రాసేలా కాకుండా ఆయా అంశాలను సమగ్రంగా అర్థం చేసుకొని, అవగాహనతో సమాధానాలు రాసేలా ప్రశ్నలు అడగనుంది. పాఠశాలల్లో కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న బట్టీ విధానానికి స్వస్తి పలకనుంది. టెన్త్‌ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు క్లుప్తంగా, సమగ్రతతో కూడిన సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

వ్యాసరూప ప్రశ్నల సంఖ్య తగ్గింపు  
విద్యార్థులపై పరీక్షల భారం తగ్గించాలని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం పరీక్షల్లో దీర్ఘ సమాధానాలుండే వ్యాసరూప సమాధానాల ప్రశ్నల సంఖ్యను తగ్గించి స్వల్ప, అతి స్వల్ప సమాధానాల ప్రశ్నల సంఖ్యను పెంచింది. 60 శాతం మేర ప్రశ్నలు ఈ కేటగిరీలోనే ఉండేలా ప్రశ్నపత్రాలను రూపొందిస్తారు. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఒక్క పదంతో సమాధానమిస్తే చాలు. అతి స్వల్ప ప్రశ్నలకు ఒకటి లేదా రెండు వాక్యాల సమాధానం రాయాలి. స్వల్ప ప్రశ్నలకు రెండు నుంచి 4 వాక్యాల సమాధానమివ్వాలి. ఎస్సే ప్రశ్నలకు 8 నుంచి 10 వాక్యాల్లో సమాధానమిస్తే చాలు. 

అన్ని సబ్జెక్టులు 100 మార్కులకే... 
విద్యాహక్కు చట్టం ప్రకారం నిరంతర, సమగ్ర మూల్యాంకన(సీసీఈ) విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తోంది. విద్యార్థులతో ప్రాజెక్టు వర్కులు, క్షేత్రస్థాయి పర్యటనలు, ఇతర కార్యకలాపాలు నిర్వహించి, వాటికి మార్కులు కేటాయిస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు కేటాయిస్తున్న మార్కులు 20 శాతం. వాటిని వార్షిక పరీక్షలకు కలుపుతున్నారు. వార్షిక పరీక్షల్లో ఒక్కో సబ్జెక్టులో 80 మార్కులే (పేపర్‌–1లో 40 మార్కులు, పేపర్‌–2లో 40 మార్కులు) ఉంటాయి. అయితే, అంతర్గత మార్కులను రద్దు చేయాలని వచ్చిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం గతంలో వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈసారి పరీక్షలను 100 మార్కులకే నిర్వహిస్తున్నారు. ఒక్కో సబ్జెక్టులో పేపర్‌–1లో 50 మార్కులు, పేపర్‌–2లో 50 మార్కులు ఉంటాయి. ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ఆన్సర్‌ షీట్లను వేర్వేరుగా ఇచ్చేవారు. మాస్‌ కాపీయింగ్‌ను నిరోధించడానికి విద్యాశాఖ ఈసారి బుక్‌లెట్లను అందించనుంది. 24 పేజీల బుక్‌లెట్‌లో విద్యార్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement