రాజాం, పాలకొండ ఇన్‌చార్జీల తొలగింపు
డీఈవో నిర్లక్ష్యంపై మండిపాటు
విద్యాశాఖ తీరుపై భగ్గుమన్న కలెక్టర్
ఫలితాలు మెరుగుపడకపోతే చర్యలు తప్పవు
ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ సమీక్ష
శ్రీకాకుళం సిటీ,న్యూస్‌లైన్ : కాకి లెక్కలు.. ఏదీ ఖచ్చితంగా చెప్పరు. గట్టిగా అడిగితే సాకులు చెబుతారు. మీరు తీసుకునే జీతాలకు.. చేస్తున్న పనులకు పొంతన కుదరడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అలసత్వమే.. ముఖ్యంగా డిఈవో అరుణకుమారి పనితీరు ఏమీ బాగోలేదు. దీనిపై ఉన్నతాధికారులకు లెటర్ పెడతా’.. అని జిల్లా కలెక్టర్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడుగురు ఎంఈవోలకు చార్జిమెమోలు ఇవ్వాలని ఆదేశించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యా శాఖపై స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష ఆద్యంతం సీరియస్‌గా సాగింది. ముందుగా పదో తరగతి ఉత్తీర్ణత లక్ష్యాలు, అమలు చేస్తున్న ప్రణాళికలు, రాజీవ్ విద్యా దీవెన, నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్పులు, వైద్య పరీక్షలు, డైస్ సమాచారం, కెజిబివి పాఠశాల పనితీరు ఇలా దాదాపు అన్ని అంశాలపై కూలంకుషంగా సమీక్షించారు. ఈ స్థాయిలో సమీక్ష జరుగుతుందని ఊహించని విద్యాశాఖాధికారులు సరైన సమాచారం లేక కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు. పదోతరగతి ఫలితాల్లో గత ఏడాది 70 శాతం కంటే తక్కువ వచ్చిన స్కూళ్లలో ఈసారి మెరుగైన ఫలితాలు రాకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ‘రెడీ టు రైడ్’ అనే టెన్త్ స్టడీ మెటీరియల్‌ను సరఫరా చేస్తున్నామని, దీన్ని తప్పనిసరిగా విద్యార్థులందరికీ అందించాలని, సి, డి గ్రేడుల్లో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించాలని ఆదేశించారు.
ఎంఈవోలపై సీరియస్
జిల్లాలో ఈ ఏడాది నేషనల్ మెరిట్ పరీక్షలకు బూర్జ, రాజాం, గార, కంచిలి, వీరఘట్టం, పాలకొండ, హిరమండలాల్లో ఒక్క విద్యార్ధి కూడా హాజరుకాకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఆ ఏడుగురు ఎంఈవోలకు చార్జిమెమోలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే సంబంధిత డిప్యూటీ డిఈవోలకు కూడా మెమోలు జారీ చేస్తామని చెప్పారు. ఇదే సందర్భంలో రాజాం ఇన్‌చార్జి ఎంఈవోపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. ‘ఏమయ్యా..నువ్వు జి.సిగడాం రెగ్యులర్ ఎంఈవోవి. అదనంగా రాజాం కావాలని మినిస్టర్‌తో చెప్పిస్తావ్..పైగా ఉద్యోగ సంఘాల వారితో రికమెండ్ చేయించావ్.. మరి ఒక్క విద్యార్ధిని కూడా మెరిట్ పరీక్షలకు పంపలేదు... నీకెందుకయ్యా రెండు మండలాలు.. తక్షణమే తప్పుకో...’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొండ ఎంఈవోపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘మీరు పాలకొండ డిప్యూటీ ఈవోగానే ఉండండి.. ఈ రోజే ఎంఈవో పోస్టును వదిలేయండని’ స్పష్టం చేశారు.
ఈ రెండు చోట్ల కొత్త ఎంఈవోలను గుర్తించి ఈ రోజే (శుక్రవారం రాత్రి లోగా) తనకు ఫైలు పెట్టాలని డీఈవో అరుణకుమారిని ఆదేశించారు. డైస్ సమాచారం అప్‌లోడ్‌కు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థుల నుంచి సమాచారం రాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెలాఖరులోగా విద్యార్థుల సమాచారం ఇవ్వని ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని ఆదేశించారు. అలాగే డీఈవో నిర్లక్ష్యంతో 137 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు రాలేదని చెబుతూ నిర్లక్ష్యం వీడాలని ఆమెను హెచ్చరించారు. ప్రాథమిక, ఉన్నత, కళాశాల విద్యా శాఖలు పనితీరు ఇకనైనా మార్చుకుని,త్వరలో జరగనున్న పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ నాగోరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో మెండ ప్రవీణ్, డీవీఈవో పాపారావు తదితరులు పాల్గొన్నారు.
7గురు ఎంఈవోలకు చార్జిమెమో
Published Sat, Jan 25 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement