దాసరిపై చార్జిషీటు
బొగ్గు కుంభకోణంలో అభియోగాలు
నమోదు చేసిన సీబీఐ
నవీన్ జిందాల్, మధుకోడాలపై కూడా
న్యూఢిల్లీ: అమరకొండ ముర్గదాంగల్ బొగ్గు బ్లాకు కేటాయింపు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణరావుపై సీబీఐ బుధవారం అభియోగాలు నమోదు చేసింది. వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకుడు నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా సహా మొత్తం పది మందిపై, ఐదు సంస్థలపై చార్జిషీటు దాఖలైంది. జార్ఖండ్‌లోని బీర్భుమ్ జిల్లాలో ఉన్న అమరకొండ ముర్గదాంగల్ బొగ్గు బ్లాకును 2008లో దాసరి బొగ్గుశాఖ సహాయమంత్రిగా ఉండగా జిందాల్ గ్రూపునకు చెందిన జేఎస్‌పీఎల్, జీఎస్‌ఐపీఎల్‌లకు కేటాయించారు.
ఈ కేటాయింపులో అవకతవకలు జరిగాయని, జార్ఖండ్ ప్రభుత్వం ఇతర సంస్థలను తప్పించి జిందాల్ సంస్థల పేర్లను మాత్రమే సిఫారసు చేసిందని సీబీఐ అభియోగపత్రంలో ఆరోపించింది. జేఎస్‌పీఎల్, జీఎస్‌ఐపీఎల్ సంస్థలకు వెయ్యి మెగావాట్ల చొప్పున విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడానికి క్యాప్టివ్ మైనింగ్ కింద ఈ కేటాయింపులు జరిగాయి. ఇలాంటి ప్లాంట్లను నెలకొల్పడానికి తమ సంసిద్ధత, గతంలో తమకు జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపుల విషయంలో జిందాల్ గ్రూపు వాస్తవాలను దాచిందని సీబీఐ ఆరోపించింది. కేంద్ర విద్యుత్ శాఖ వ్యతిరేకించినా కేటాయింపులు జరిగాయని పేర్కొంది.
కేటాయింపులపై నిర్ణయం తీసుకొనే ‘స్క్రీనింగ్ కమిటీ’ని ప్రభావితం చేసేందుకే బొగ్గుశాఖ సహాయమంత్రి హోదాలో దాసరి జిందాల్ గ్రూపు సంస్థలకు అనుకూలంగా లేఖ రాశారని పేర్కొంది. 120-బి (నేరపూరిత కుట్ర), 420 (చీటింగ్), అవినీతి నిరోధక చట్టంలోని ఇతర సెక్షన్ల కింద కేసు పెట్టింది. ఈ చార్జిషీటు విచారణార్హత గురువారం నిర్ణయం తీసుకుంటానని సీబీఐ కోర్టు జడ్జి భరత్ పరాశర్ చెప్పారు. కేంద్ర బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్.సి.గుప్తా, జ్ఞాన స్వరూప్ గార్గ్, సురేష్ సింఘాల్, రాజీవ్ జైన్, గిరీష్‌కుమార్ సునేజా, ఆర్.కె.సరాఫ్, కె.రామక్రిష్ణ ప్రసాద్‌లపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే జిందాల్ సంస్థలతో పాటు దాసరికి చెందిన సౌభాగ్య మీడియాపై కూడా చార్జిషీటు దాఖలైంది.