
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చీప్ లిక్కర్ ఏరులై పారుతోంది. నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మద్యం మరణాలు సంభవిస్తుంటే.. ఎక్సైజ్ శాఖ మాత్రం మద్యం శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపడమే తప్ప ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సుంకం చెల్లించని మద్యం (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్–ఎన్డీపీఎల్)ను మాత్రం అడ్డుకోవడంలేదు. దీంతో ట్రూ ట్రాన్సిట్ పర్మిట్ల ముసుగులో రాష్ట్రంలో ఎన్డీపీఎల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మరికొన్నిచోట్ల కొందరు అబ్కారీ అధికారులకు మద్యం షాపుల్లో వాటాలుండటంతో సరిహద్దు చెక్‌పోస్టుల్లోని సిబ్బంది సహకారంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అమ్మకాలు జరిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇందుకు ఊతమిస్తూ ఇటీవల కాలంలో కర్నూలు, గుంటూరు, ఉభయగోదావరి, విశాఖ, కృష్ణా తదితర జిల్లాల్లో నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక నుంచి కర్నూలుకు ఎన్డీపీఎల్ మద్యం పెద్దఎత్తున సరఫరా అవుతోంది. కర్ణాటకకు సరిహద్దు జిల్లా కావడంతో ఎమ్మిగనూరు, హాలహర్వి, ఆలూరు, మంత్రాలయం తదితర ప్రాంతాలకు ఎన్డీపీఎల్ మద్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. కర్ణాటక లిక్కర్‌కు, రాష్ట్రంలో ఉత్పత్తి చేసే లిక్కర్‌కు ధరలో భారీ వ్యత్యాసం ఉండటంతో అక్కడ్నుంచి తెచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. చీప్ లిక్కర్ ప్యాకెట్లను రాష్ట్రంలో రూ.90 నుంచి రూ.వందకు విక్రయిస్తుండగా, కర్ణాటక ప్రభుత్వం రూ.50కే విక్రయిస్తోంది. దీంతో అక్కడి మద్యం బ్రాండ్లు ఏపీ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తెలంగాణ నుంచి నల్గొండ, మిర్యాలగూడ మీదుగా గుంటూరుకు ఎన్డీపీఎల్ చేరుతోంది. తమిళనాడు నుంచి ట్రాన్సిట్ పర్మిట్ల పేరిట చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీపీఎల్ మద్యం సరఫరా అవుతోంది.
పడకేసిన హెడోనిక్ పాత్ ఫైండ్ సిస్టం
ఎక్సైజ్ శాఖలో ఆన్‌లైన్ విధానంలో అమ్మకాలు చేపట్టేలా సాంకేతిక పరిజ్ఞానం అమలుకు సర్కారు నాలుగేళ్లుగా ప్రైవేటు సేవలు వినియోగించుకుంటోంది. సీ–టెల్ అనే సంస్థకు ఐదేళ్ల పాటు కాంట్రాక్టు అప్పగించారు. హెడోనిక్ పాత్ ఫైండ్ సిస్టం కింద ట్రాక్ అండ్ ట్రేస్ విధానం ద్వారా మద్యం అమ్మకాలను షాపుల్లో పరిశీలించాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రూ.59కోట్లు చెల్లించాలని సీ–టెల్ తన సాంకేతిక సేవలు నిలిపేసింది. మద్యం బాటిల్‌పై హాలోగ్రామ్‌ను స్కాన్‌చేస్తే ఎక్కడ్నుంచి సరఫరా అయ్యిందో అన్ని వివరాలు తెలుస్తాయి. కానీ, ఈ విధానాన్ని ఇటీవలి కాలంలో నిలిపేయడం, తరచూ ఆటంకాలు కల్పించడంతో ఎమ్మార్పీ ఉల్లంఘనలు మొదలు నకిలీ మద్యం అమ్మకాలతో మద్యం సిండికేట్లు చెలరేగిపోతున్నారు.
ట్రాన్సిట్ పర్మిట్లు అంటే..
ఒక రాష్ట్రానికి అవసరమైన మద్యాన్ని వేరే రాష్ట్రం దిగుమతి చేసుకుంటుంది. ఉదాహరణకు.. తమిళనాడు నుంచి ఒరిస్సాకు మద్యం సరఫరా చేయాలంటే మన రాష్ట్రం మీదుగా ఆ లోడు వెళ్లాలి. ఇందుకు ఎక్సైజ్ కమిషనర్ నుంచి ట్రూ ట్రాన్సిట్ పర్మిట్లు పొందాలి. ఈ ట్రాన్సిట్ పర్మిట్లు పొందిన లారీలకు మన రాష్ట్రం సరిహద్దు వరకు ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ బందోబస్తు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఈ ట్రాన్సిట్ పర్మిట్లు పొందిన వేరే రాష్ట్రాల వ్యాపారుల నుంచి రాష్ట్రంలోని మద్యం మాఫియా రాష్ట్రంలోనే సరుకును దించుకుని షాపుల్లో అమ్మకాలు చేస్తున్నారు. ఎక్సైజ్‌లో సిబ్బంది కొరతతో ట్రాన్సిట్ పర్మిట్ల వాహనాలకు బందోబస్తును ఇవ్వడంలేదు. దీంతో మద్యం సిండికేట్లు ఆడింది ఆటగా మారింది. ఈ వాహనాలకు జియో ట్యాగింగ్ చేసి మద్యం మాఫియా దందాను అడ్డుకుంటామన్నా ఇంతవరకు అమలుచేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment