డొంక కదిలింది! | Cheating With Backlog Posts In Employment Fiction Department | Sakshi
Sakshi News home page

డొంక కదిలింది!

Published Wed, Apr 11 2018 7:48 AM | Last Updated on Wed, Apr 11 2018 7:48 AM

Cheating With Backlog Posts In Employment Fiction Department - Sakshi

బ్యాక్‌లాగ్‌ పోస్టుల బురిడీ వెనుక ఉపాధి రాష్ట్ర శాఖ కార్యాలయానికి చెందిన అధికారి ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. ఈ కేసులో మొత్తం ముగ్గురు సూత్రధారులు కాగా ఒకరు పాత్రధారిగా తేలారు. ఉపాధి కల్పన శాఖలో ఓ చిరుద్యోగి పేరు తెరమీద కనిపిస్తున్నా... ఆ కార్యాలయంలో మరో ఉద్యోగి... రాష్ట్ర స్థాయి అధికారే కీలక వ్యక్తులనే విషయం తేటతెల్లమవుతోంది. బురిడీ రాకెట్‌ తీగ లాగితే మొత్తం డొంకంతా కదులుతోంది. ఈ అవినీతి దందా అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ విస్తరించడం విస్మయపరుస్తోంది.

సాక్షి, అమరావతిబ్యూరో : బ్యాక్‌లాగ్‌ పోస్టుల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి రూ. 2 కోట్లు స్వాహా చేసిన కేసులో విజయవాడ ఉపాధి కల్పనా శాఖ కార్యాలయంలోని చిరుద్యోగి అయిన మహిళ కేవలం పాత్రధారి మాత్రమే. ఈ బురిడీ వ్యవహారం వెనుక చిత్రం స్పష్టంగా తెలిసిపోయింది.

అదే కార్యాలయంలో ఉద్యోగ సంఘ నేతగా ఉన్న మరో ఉద్యోగి, మరో మధ్యస్థాయి అధికారి, కార్మిక శాఖ కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి దీనివెనుక సూత్రధారులుగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో భారీగా ముట్టజెప్పుకుని నిండా మునిగిన కొందరు బాధితులు ఆ మహిళా ఉద్యోగితో సంభాషణలను రికార్డు చేశారు. ఆ ఆడియో రికార్డుల్లో మొత్తం వ్యవహారం బట్టబయలైంది.  అదే కార్యాలయంలో పనిచేస్తున్న జిల్లా ఉద్యోగ సంఘ నేత చెబితేనే తాను ఆ డబ్బులు వసూలు చేశాను అని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు.

మరో వివాదాస్పద అధికారితోపాటు కార్మిక శాఖ కమిషరేట్‌ కార్యాలయంలో అధికారికి ఈ వ్యవహారం అంతా తెలుసుకదా అని ఆమె ధీమాగా చెప్పడం గమనార్హం. డబ్బంతా వారు తీసుకుని తనను మాత్రమే ఎందుకు నిలదీస్తారని ఆమె ప్రశ్నించడం విశేషం. డబ్బులు తీసుకున్నవారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు రంగం సిద్ధమవుతోందని కూడా ఆమె చెప్పారు. ఇక అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించిన తాము వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. వారికి ఆమె ధైర్యం చెబుతూ ఉద్యోగాలు వస్తాయి... గాబరా పడొద్దని అసలు సూత్రధారుల తరపున హామీ సైతం ఇచ్చారు. ఒక్క బందరులోనే పదిమంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి కూడా నిరుద్యోగులను నమ్మించి భారీగా వసూలు చేశారని స్పష్టమైంది.

శాఖోపశాఖలుగా ...
బ్యాక్‌లాగ్‌ పోస్టుల బురిడీ ఒక్క ఉపాధి కల్పనా శాఖకే పరిమితం కాలేదు. నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కట్టబెట్టేందుకు పక్కాగా రంగం సిద్ధం చేశారని స్పష్టమవుతోంది. దేవాదాయ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు ఫైళ్లు సిద్ధమయ్యాయి. పంచాయతీరాజ్, ఇతర శాఖల్లో కూడా అందరికీ ఉద్యోగాలు సర్దుబాటు చేయడానికి పన్నాగం పన్నారు. ఈ నెలాఖరునాటికి అన్ని సంతకాలు పూర్తయి ఆర్డర్లు వస్తాయని కూడా పాత్రధారి అయిన ఆ చిరుద్యోగి బాధితులకు చెప్పడం గమనార్హం. కేవలం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్యాక్‌లాగ్‌ పోస్టులను అడ్డగోలుగా కట్టబెట్టనున్నారన్న సమాచారం విస్మయం కలిగిస్తోంది. అంటే విజయవాడ కేంద్రంగా ఏర్పడ్డ ఈ రాకెట్‌ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందనే విషయం స్పష్టమైంది. అందుకు కార్మిక శాఖ ప్రధాన కార్యాలయంలోని కొందరు అధికారుల సహకారంతోనే ఈ దందా దర్జాగా సాగిపోతోంది.

విచారణ ఎలా సాగుతుందో...!
బ్యాక్‌లాగ్‌ పోస్టుల దందా విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో జిల్లా అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. ఈ వ్యవహారంపై విచారణకు జాయింట్‌ కలెక్టర్, జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి, విజిలెన్స్, పోలీసు అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఇప్పటికే బాధితులు ఫిర్యాదు చేయడంతోపాటు  ఆడియో ఆధారాలు లభించాయి. మరి విచారణలో అసలు దోషులు బండారం బయటపడుతుందా ? రాజకీయ ఒత్తిడికి తలొగ్గి కేసును నీరుగారుస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement