
గుంతకల్లు: ఖాకీ యూనిఫాం ధరిస్తాడు. బుల్లెట్ బండిపై సవారీ చేస్తాడు. శ్రీసత్యసాయి జిల్లాలో ఓ ఉన్నతాధికారి వద్ద ఏఆర్ కానిస్టేబుల్‌నంటూ అందరినీ నమ్మించాడు. ఉన్నతాధికారులతో తనకు పరిచయాలు ఉన్నాయంటూ మభ్యపెట్టాడు. పోలీస్, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా వసూలు చేశాడు. చివరకు మోసం బట్టబయలై పోలీసులకు దొరికిపోయాడు.
ఇదీ అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని కథలవీధిలో నివాసముంటున్న పృథ్వి బాగోతం. ఇతను పృథ్వి, చింటూ, హర్షారెడ్డి తదితర పేర్లతో నిరుద్యోగ యువతతో పరిచయం పెంచుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ ఉన్నతాధికారి వద్ద కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానంటూ బిల్డప్ ఇచ్చాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఇతని మాటలు నమ్మి గుంతకల్లు పట్టణంలో హెర్బల్ ప్రొడక్ట్స్ అమ్ముకునే ఓ మహిళ ఏకంగా రూ.17 లక్షల దాకా ఇచ్చినట్లు తెలిసింది.
అలాగే ఎస్‌ఎల్‌వీ థియేటర్ సమీపంలోని ఓ కూల్ డ్రింక్ షాపు యజమాని రూ.8 లక్షలు, తిమ్మాపురం గ్రామానికి చెందిన సంగమేష్ రూ.4.5 లక్షలు, ఓ మహిళా పోలీస్ కూడా తన చెల్లెలి ఉద్యోగం కోసం రూ.లక్ష సమరి్పంచుకున్నారు. ఇంకా ఇతని గాలానికి చిక్కి ఎందరో నిరుద్యోగులు రూ.లక్షల్లో మోసపోయినట్లు సమాచారం.
ఆఫీసులకు తీసుకెళ్లి..అందరినీ నమ్మించి..
నిరుద్యోగులను పృథ్వి నమ్మించి మోసగించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం కావాలని అడిగారో ఏకంగా ఆ శాఖ కార్యాలయానికి నిరుద్యోగులను తీసుకెళ్లేవాడు. వారిని కార్యాలయం వద్ద కూర్చోబెట్టి ఒక్కడే లోపలికి వెళ్లేవాడు. కాసేపటికి బయటకు వచ్చి పై అధికారితో అంతా మాట్లాడానంటూ నమ్మబలికేవాడు. ఇలా ఒక నిరుద్యోగిని గుంతకల్లు సెబ్ కార్యాలయంలో ఉద్యోగం ఉందని పిలుచుకెళ్లి అక్కడే అడ్వాన్స్‌గా రూ.లక్ష తీసుకున్నాడు. వాస్తవంగా ఇతనికి ఎక్సైజ్ శాఖలో ఎవరూ తెలీదు. ప్రస్తుతం ఇతను గుంతకల్లు టూటౌన్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
(చదవండి: కాల్వకు 'జేసీబీ'తో బ్రేక్.. ఈసారి టికెట్ ఆయనకేనా?)
Comments
Please login to add a commentAdd a comment