ఖమ్మం: సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలు, వాటాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న అంకిరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డిని బుధవారం సత్తుపల్లి కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు సత్తుపల్లి రూరల్ సీఐ టి.కరుణాకర్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన అంకిరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి గత ఏడాది ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విసన్నపేటలో టిమాటిక్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రారంభించి, అందులో నిరుద్యోగ యువతీ యువకులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా చేర్చుకున్నాడు.
ఈ క్రమంలో ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు పలువురు వద్ద కంపెనీలో వాటాలు ఇస్తానంటూ నమ్మబలికి పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేశాడు. విసన్నపేటకు చెందిన తిరుమల జయరాం అనే బాధితుడు రూ.15 లక్షలు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టి, మోసపోవడంతో వీఎం బంజర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు కల్లూరుకు చెందిన బీటెక్ విద్యార్థి వద్ద రూ.3.5లక్షలు మోసం చేయడంతో అక్కడ కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి నరేష్‌కుమార్‌రెడ్డి వీరితోపాటు పలువురిని మోసగించి మలేషియాకు పారిపోయాడు.
ఇటీవల ఇండియాకు తిరిగొచ్చి, తిరిగి మలేషియా వెళ్తుండగా పోలీసులు లుక్ అవుట్ జారీ చేసి ఉండటంతో తమిళనాడులోని తిరుచురాపల్లి ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు గుర్తించి వీఎం బంజర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై తోట నాగరాజు, కానిస్టేబుళ్లు కనకారావు, శ్రీనివాస్, వెంకటేశ్వరరావులతో కలిసి తిరుచురాపల్లి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం ప్రాంషీట్ వారెంట్‌తో ఇక్కడికి తరలించి సత్తుపల్లి కోర్టులో బుధవారం హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, కొన్ని బ్యాంక్ అకౌంట్‌్లను సీజ్ చేసి, పోలీస్ కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు రాబడతామని సీఐ తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment