సాక్షి, నెల్లూరు : అక్రమంగా స్కూలు అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన ట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న జిల్లాకు చెందిన 87 మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్‌జీటీ)పై చీటింగ్, ఫోర్జరీలకు సంబంధించి 420, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో గతనెల 30న సీఐడీ విభాగం రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు చేసింది. ఈ పదోన్నతుల వ్యవహారం ఇప్పటిది కాకపోయినా కేసులు మాత్రం తాజాగా నమోదయ్యాయి. జిల్లాకు చెందిన 272 మంది ఇంగ్లిష్ సబ్జెక్టులో పదోన్నతులు పొందగా వారిలో 87 మందిపై కేసులు నమోదయ్యాయి.
ఎస్‌జీటీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 2000 సంవత్సరం తరువాత పదోన్నతులు లేకపోవడంతో 2009లో ప్రభుత్వం భారీ సంఖ్యలో ప్రమోషన్లు కల్పించింది. అన్ని సబ్జెక్టులకు సంబంధించి పదోన్నతులు ఇచ్చినప్పటికీ ఇంగ్లిషు సబ్జెక్టులో పదోన్నతుల సంఖ్య ఎక్కువగా ఉంది. అప్పట్లో పదోన్నతి పొందేందుకు అర్హులైన (ఎంఏ, ఇంగ్లిషు) వారు లేకపోవడమే ఇందుకు కారణం.
అయితే కొంత మంది ఉపాధ్యాయులు చెల్లుబాటు కాని ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల సర్టిఫికెట్లను పొందుపరిచి పదోన్నతులు పొందారు. తదుపరి పదోన్నతులు పొందాల్సిన తమకు తీవ్రంగా అన్యాయం జరగడంతో ఈ అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద దూమారమే లేపింది. పదోన్నతుల కోసం ఎస్‌జీటీలు ఇంగ్లిషు సబ్జెక్టుకు సంబంధించి తమిళనాడులోని అన్నామలై, అళగప్ప, మధురై కామరాజ్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, ఎంఎస్ యూనివర్సిటీ, వినాయక మిషన్ నుంచి, జెఎన్‌ఆర్‌వీ (రాజస్థాన్), కువెంఫు (కర్ణాటక), భోజ్ (మధ్యప్రదేశ్), మగధ (బీహార్) యూనివర్సిటీల నుంచి ఎంఏ (ఇంగ్లిషు) పట్టాలు పొంది వాటిని తమ పదోన్నతులకు జతపరిచారు.
పదోన్నతులు కల్పించేప్పుడు ప్రభుత్వం నుంచి ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల నుంచి పొందిన పట్టాలు చెల్లుబాటు కావనే అంశం ఎక్కడా పేర్కొనకపోవడంతో సదరు పట్టాలు పొందారు. అప్పట్లో ఈ వ్యవహారంపై ప్రభుత్వం శాఖాపరంగా చేపట్టిన విచారణ నత్తనడకన సాగడంతో పలువురు ఉప లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో ఉప లోకాయుక్త సీఐడీతో విచారణకు ఆదేశించింది. దీంతో విచారణ చేసిన సీఐడీ అక్రమ పదోన్నతులపై ఒక నివేదిక రూపొందించింది. ఈమేరకు జిల్లాలోని కావలి, నాయుడుపేట, ఏఎస్‌పేట, దొరవారిసత్రం, తోటపల్లిగూడూరు, సీతారామపురం, కోట, మనుబోలు, చేజర్ల, నెల్లూరు రూరల్, అనంతసాగరం, ఓజిలి, సుళ్లూరుపేట, వెంకటాచలం, చిల్లకూరు, బాలాయపల్లి, బోగోలు, రాపూరు, బుచ్చిరెడ్డిపాలెం, వాకాడు, డక్కిలి, సైదాపురం, ఆత్మకూరు, జలదంకి, గూడూరు, కొండాపురం, చిట్టమూరు, ఇందుకూరుపేట, సంగం, కొడవలూరు, వరికుంట పాడు, ఉదయగిరి, ముత్తుకూరు, కలువాయి, పొదలకూరు, తడ మండలాల్లో ఎస్‌జీటీలుగా పనిచేసి స్కూలు అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన 87 మందిపై కేసులు నమోదయ్యాయి.
చీటింగ్ ఉపాధ్యాయులపై కేసు నమోదు
Published Sat, Nov 9 2013 3:59 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement