చాటింగ్ పేరుతో చీటింగ్ | Cheating in the name of chatting with two young boys | Sakshi
Sakshi News home page

చాటింగ్ పేరుతో చీటింగ్

Published Fri, Aug 23 2013 4:33 AM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM

Cheating in the name of chatting with two young  boys

ఒంగోలు, న్యూస్‌లైన్ :చాటింగ్ పేరుతో చీటింగ్ చేస్తున్న ఇద్దరు యువకుల 
గుట్టురట్టయింది. నాలుగు రోజుల క్రితం ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఒంగోలు టూటౌన్ పోలీసులు బీటెక్ పూర్తిచేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి సైబర్ నేరం కింద కూడా కేసు నమోదు చేశారు. స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో టూటౌన్ సీఐ సూర్యనారాయణ ఆ వివరాలు వెల్లడించారు. 
 
అసలు ఏం జరిగిందంటే...
కాకినాడకు చెందిన వికలాంగురాలైన ఓ యువతి బతుకుదెరువు కోసం ఒంగోలు చేరుకుంది. స్థానిక భాగ్యనగర్‌లో చైతన్య టెక్నికల్ సపోర్టు పేరుతో వ్యాపారం చేస్తున్న రావిపాటి చైతన్య(బీటెక్)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. రావిపాటి చైతన్య ఒంగోలులోని మామిడిపాలెం నివాసి. రామ్‌నగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని తనకు పరిచయమైన వికలాంగురాలైన యువతితో అతను సహజీవనం చేస్తున్నాడు. 
అతని స్నేహితుడు అరుణ్‌కుమార్ కూడా వారితోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో చైతన్యతో సహజీవనం చేస్తున్న యువతి పట్ల అరుణ్‌కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఒంగోలు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. స్పందించిన సీఐ.. వెంటనే ఒక కానిస్టేబుల్‌ను పంపించి అరుణ్‌కుమార్‌ను తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు. కాగా, ఇక్కడ కథ కొత్త మలుపు తిరిగింది.
 
సైబర్ నేరం వెలుగులోకి ఇలా...
సీఐ పంపిన కానిస్టేబుల్ అరుణ్‌కుమార్ కోసం చైతన్య టెక్నికల్ సపోర్టు సంస్థ వద్దకు వెళ్లాడు. అక్కడ చైతన్య, అరుణ్‌కుమార్‌లిద్దరూ చాటింగ్ చేస్తున్నారు. అక్కడకు వెళ్లిన కానిస్టేబుల్‌కి కూడా ఇంటర్నెట్ నాలెడ్జి ఉండటంతో వారు సైబర్ నేరానికి పాల్పడుతున్నట్లు వెంటనే గ్రహించాడు. వారిద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. తాము ఏం చేస్తున్నది...ఎందుకు చేస్తున్నది యువకులిద్దరూ బహిరంగం చేయడంతో వారిని అరె స్ట్ చేశారు. వారు ఉపయోగించిన కంప్యూటర్‌ను కూడా సీజ్ చేశారు. 
 
నేరం చేసింది ఇలా...
చైతన్యకు ఒక క్లాస్‌మేట్ ఉండేవాడు. ఆ క్లాస్‌మేట్ అన్నే కోణాల అరుణ్‌కుమార్. అలా చైతన్యకు, అరుణ్‌కుమార్‌కు మధ్య స్నేహం ఏర్పడింది. అరుణ్‌కుమార్ విజయవాడవాసి. కొద్దినెలల క్రితం చైతన్యకు అరుణ్‌కుమార్ ఫోన్‌చేసి తనకు అప్పులు పెరిగిపోయాయని, ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోయాడు. దీంతో ఒంగోలుకు రమ్మని చెప్పిన చైతన్య అప్పులు తీరేందుకు, అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ప్లాన్ చేశాడు. ఇద్దరూ ఆ ప్లాన్‌తో రంగంలోకి దిగారు. దొంగపేరుతో ఒక ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్‌చేశారు. దాంతోపాటు చాట్.డ్యూడ్.కాం పేరుతో చాటింగ్ మొదలుపెట్టారు. అయితే, ఫేస్‌బుక్ అకౌంట్‌లో యువతిగా రిజిస్టర్ చేసుకున్నారు. ఈ క్రమంలో వారికి పలువురు ఫేస్‌బుక్ యూజర్లు స్నేహితులుగా మారారు. 
 
వారితో లేడీవాయిస్‌లో హస్కీగా మాట్లాడుతూ బుట్టలో వేసుకున్నారు. తర్వాత చైతన్యతో సన్నిహితంగా ఉంటున్న యువతితో మాట్లాడించేవారు. దాంతోపాటు ఆమె ఫొటోలు అటాచ్‌చేసి ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని, తమకు డబ్బు కావాలని కోరేవారు. డబ్బులు ఇస్తే మీరు ఏం చేయమన్నా చేయడానికి సిద్ధమంటూ పరోక్షంగా అవతలి యువకులను చాటింగ్ ద్వారానే రెచ్చగొట్టేవారు. అయితే, అవతలి వ్యక్తులు కూడా వీరి మాటలకు పడిపోయి వారు కూడా కొంతమంది అమ్మాయిల ఫొటోలను వీరికి పంపారు. దీంతో ఆ ఫొటోలను తమకు పంపినందుకు తాము పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసి అరెస్ట్ చేయిస్తామంటూ అవతలి వారిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టేవారు.
 
 అప్పటివరకు  గుట్టుగా ఉన్న తమ విషయం ఎక్కడ రట్టవుతుందోనన్న భయంతో వీరికి ఫొటోలు పంపి బుక్ అయిన చాలామంది డబ్బు పంపడానికి సిద్ధపడేవారు. ఈ క్రమంలో నిందితులిద్దరూ కంకిపాడులోని ఒక బ్యాంకులో నకిలీ పత్రాలతో ఆర్యన్ అనే పేరుతో అకౌంట్ ఓపెన్‌చేశారు. బ్లాక్‌మెయిలింగ్ ద్వారా వచ్చేడబ్బును ఆ అకౌంట్‌లో వేయించుకునేవారు. ఇలా గత మూడు నెలల కాలంలో 3 లక్షల రూపాయలకుపైగా డబ్బు డ్రా చేశారు. ఇలా సైబర్ నేరం కొనసాగిస్తున్న సమయంలో చైతన్యతో సహజీవనం చేస్తున్న యువతి తాను ఇతరులతో మాట్లాడనంటూ మొండికేసింది. ఈ క్రమంలో చైతన్య, అరుణ్‌కుమార్‌లు ఒంగోలులోని ఇద్దరు యువతులతో పరిచయం ఏర్పరచుకుని మాట్లాడించారు. చివరకు ఒక యువతి చేసిన ఫిర్యాదుతో పాటు కానిస్టేబుల్ ఇంటర్నెట్ పరిజ్ఞానం నిందితులను పట్టించింది. నిందితులను పూర్తిగా విచారించి వారికి డబ్బు పంపిన వారిని, నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లతో మోసం చేస్తున్న వారిని కూడా అరెస్ట్ చేయనున్నట్లు సీఐ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement