ఆధార్ కార్డుతో బినామీ రుణాలకు చెక్
అమరావతి:
ఇకపై ఆధార్‌కార్డును ఆధారంగా చేసుకుని రైతులకు రుణాలు మంజూరు చేస్తామని రాష్ట్ర అటవీ, సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాల్లోని ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, బ్యాంకుల్లోని బినామీ రుణాలను అరికట్టేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కొంత మంది వ్యాపారులు రైతుల పేరుపై వ్యవసాయ రుణాలను తక్కువ వడ్డీకి తీసుకుంటున్నారని, మరి కొందరు రైతులు వేర్వేరు ప్రాంతాల్లో రుణాలు తీసుకుంటూ లబ్దిపొందుతున్నారని, దీని వలన మిగిలిన అర్హులకు రుణాలు అందుబాటులోకి రావడం లేదని వివరించారు.
ఆధార్‌కార్డు వినియోగంతో వీటిని పూర్తిగా నియంత్రించే అవకాశం ఉండటంతో బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. బుధవారం సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో సహకార శాఖపై సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 2500 సహకార సంఘాలను దశల వారీగా కంప్యూటరీకరణ చేయనున్నామని, తొలిదశలో లాభాల్లో కొనసాగుతున్న 600 సంఘాలను పూర్తి చేస్తామని చెప్పారు. తమిళనాడులోని దాదాపు అన్ని సహకార సంఘాలు, బ్యాంకుల్లో కంప్యూటరీకరణ పూర్తయిందని, అక్కడి ఉన్నతాధికారులు వచ్చే నెల రాష్ట్రంలోని సహకార సంఘాలకు శిక్షణ ఇచ్చేందుకు విజయవాడ రానున్నారని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి సహకార శాఖలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాల్లో ప్రత్యేకంగా ఏర్పాటైన సెల్స్‌తో సహకార శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు.
వడ్డీ రాయితీ కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.431 కోట్లు రావాల్సి ఉందని, ఆప్కాబ్ ఈ వడ్డీ రాయితీని సహకార బ్యాంకులు, సంఘాలకు చెల్లించిందని, అయితే ఆ మొత్తాన్ని రాష్ట్ర ఫ్రభుత్వం ఆప్కాబ్‌కు చెల్లించాల్సి ఉందన్నారు. ఇటీవలనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వడ్డీ రాయితీ విడుదలపై విజ్ఞప్తి చేశామని చెప్పారు. మిగిలిన జిల్లాలతో పోల్చితే ఉభయ గోదావరి జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయని, లాభాల బాటలో ఉన్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు.