నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్ : సమైక్య ఉద్యమం చెక్‌పోస్టులోని ఆయా శాఖల్లోని కొంతమందికి వరంగా మారింది. ఓ వైపు సమైక్యాంధ్ర కోసం ఉద్యమ బాట పట్టి రెండు నెలలుగా జీతాలకు నోచుకోక అధిక శాతం మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే.. మరో వైపు జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉమ్మడి తనిఖీ కేంద్రంలో అత్యవసర సేవల పేరుతో వాణిజ్య, రవాణా శాఖల సిబ్బంది అనధికార వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. రెండు శాఖల సిబ్బంది రోజుకు లక్షల రూపాయల అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రవాణాశాఖ సిబ్బంది అక్రమ వసూళ్లపై చెక్‌పోస్టు పరిపాలనాధికారి 10 రోజుల క్రితం రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉమ్మడి తనిఖీ కేంద్రంలో వాణిజ్య పన్నులు, రవాణా, అటవీ, పశువర్థకశాఖ, ఎక్సైజ్, మార్కెటింగ్, మైన్స్ అండ్ జియాలజీ తదితర శాఖల అధికారులు పనిచేస్తున్నారు. జూలై 30న సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడంతో మరుసటి రోజు నుంచే జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏపీఎన్‌జీఓలు నిరవధిక సమ్మెకు పిలుపు నివ్వడంతో జిల్లా వ్యాప్తంగా ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. అయితే ఉమ్మడి తనఖీ కేంద్రంలో వాణిజ్యపన్నుల శాఖలోని కొందరు ఉద్యోగులు అత్యవసర సేవలు పేరుతో విధులు నిర్వహిస్తున్నారు.
అయితే మిగతా ఆయా శాఖల్లోని కొంత మంది సిబ్బంది అనధికార విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలు ఉమ్మడి తనిఖీ కేంద్రంలో ఆయా శాఖల అధికార అనుమతులను పొందాల్సి ఉంది. ప్రధానంగా పప్పులు, నూనె, ఇసుక, గ్రానైట్, సిలికా, బియ్యం, పార్శిల్, ఎలక్ట్రానిక్స్ తదితర వస్తువులతో కూడిన వాహనాలు రవాణా అవుతుంటాయి. సమైక్యాంధ్ర ఉద్యమంతో ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బంది కొందరు అక్రమ రవాణాకు పచ్చజెండా ఊపుతున్నారు. సరుకులకు సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోయినా చెక్‌పోస్టు దాటిస్తున్నారు.
రవాణా శాఖలో కొంత మంది సిబ్బందిని షిప్ట్ డ్యూటీలు వేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ శాఖలో అనధికారికంగా రోజుకు రూ.1.5 లక్షలు వసూళ్లు అవుతాయన్న ప్రచారం సాగుతోంది. వాణి జ్య పన్నుల శాఖలో కేవలం డీసీటీఓ, సీటీఓలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. సమ్మె నేపథ్యంలో కేవలం ఐదారుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ శాఖ ద్వారా ఎక్కువ మొత్తం వస్తుండటంతో కొంత మంది సిబ్బంది సమ్మెలో పాల్గొనకుండా అనధికార వసూళ్లకు ప్రాధాన్యమిస్తున్నారు.
చెక్‌పోస్టులోని వాణిజ్యపన్నుల శాఖలో పనిచేస్తున్న ఉన్నతస్థాయి అధికారికి నెలకు రూ. 6 లక్షలు, ఇన్‌స్పెక్టర్లకు రూ. 2.5 లక్షలు పైగా అనధికార వసూళ్లు అవుతాయని ఆ శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది చెబుతున్నారు. ఎక్సైజ్‌శాఖలో సీఐ, ఎస్‌ఐలు లేకపోయినా అక్కడ పనిచేస్తున్న కానిస్టేబుళ్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫారెస్ట్, మార్కెటింగ్, మైన్స్ అధికారులు, సిబ్బంది సమ్మెలో ఉన్నా చెక్‌పోస్టులో ఉన్న సిబ్బంది మాత్రం విధులు నిర్వహిస్తూ అందినంత అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆయా శాఖల్లోని కొంతమంది ఉద్యోగులు ఏపీఎన్‌జీఓల దృష్టికి కూడా తీసుకెళ్లారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, రేణిగుంట, నరహరిపేట, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం చెక్‌పోస్టులు పూర్తిగా మూతపడ్డా తడ చెక్‌పోస్టులో మాత్రం యథేచ్ఛగా అక్రమ దందాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే :
మల్లికార్జున, చెక్‌పోస్టు పరిపాలనాధికారి
రవాణా సిబ్బంది అక్రమ వసూళ్ల పై ఆ శాఖ ఉప కమిషనర్‌కు ఫిర్యాదు చేశా. చెక్‌పోస్టులో పనిచేస్తున్న ఎంవీఐకి కూడా తెలియజేశా. కాని వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రెండురోజుల్లో మళ్లీ ఫిర్యాదు చేస్తా.
చెక్‌పోస్టు దందా
Published Sun, Sep 29 2013 3:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement