నిజంగా.. కలిసిపోనారా?
Published Mon, Jan 13 2014 1:43 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
నిన్నటివరకు ఎడమొహం,పెడమొహంగా ఉన్న చీపురుపల్లి నియోజకవర్గంలోని టీడీపీ నేతలు కలిసిపోయారా? భేషజాలు పక్కన పెట్టి చెట్టపట్టాలేసుకుని పార్టీ కోసం పని చేస్తున్నారా? అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతవరకు ఎడబాటుగా మాజీ ఎంఎల్‌ఏ గద్దె బాబూరావు పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జ్ కె.త్రిమూర్తులు రాజు తాజాగా కలిసిపోయామంటూనే పరస్పరం గోతులు తీసుకునే తెరచాటు యత్నాలు ప్రారంభించారు. శత్రుత్వాన్ని బయటకు కనిపించనీయకుండా పొత్తి కడుపులో కత్తులు పెట్టుకుంటూ హత్తుకుంటున్నారు. ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు కలిసే తిరుగుతున్నా లోలోన ఎవరికి వారే ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం డ్రామా లాడుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
చీపురుపల్లి, న్యూస్‌లైన్: చీపురుపల్లి నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీలో కొత్త యుద్ధం ఆరంభమయ్యింది. దీంతో నియోజకవర్గం తెలుగుదే శం క్యాడర్‌లో అయోమయం మరింత ఎక్కువైనట్లు ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఇంతవరకు పార్టీకి దిక్కు ఒక్కరే ఉండేవారని, ఇప్పుడు ఇద్దరు నాయకులు మేం కలిసే ఉన్నామని బయటకు చెబుతూ లోలోపల ఆ పరిస్థితి లేదని..ఎవరితో పనిచేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతోందంటూ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు అంటీముట్టనట్లు ఉన్న మాజీ ఎంఎల్‌ఏ గద్దె బాబూరావు, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్‌చార్జి కె.త్రిమూర్తులురాజు కలిసిపోయామంటూ తాజాగా ప్రకటించా రు. అంతేకాకుండా అప్పటి నుంచి కలిసే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే నిజంగా వీరిద్దరూ కలిశారా...? లేదంటే నటిస్తున్నారా...? అన్న సందేహాలు నియో జకవర్గ వ్యాప్తంగా విపరీతం గా వినిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీలో చేరే ముందు వరకు గద్దె బాబూరావు..ఎట్టి పరిస్థితుల్లోనూ 2014 ఎంఎల్‌ఏ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ఎన్నోసార్లు పత్రికా సమావేశాల్లో స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ టికెట్టు ఇవ్వకపోతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని ఆయన అనుయాయులతో చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి పరి స్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరి, ఎవరికి టికెట్టు ఇచ్చి నా తెలుగుదేశం విజయానికి కృషి చేస్తామని గద్దే చెప్పడం, త్రిమూర్తులు రాజు ఇంటికి వెళ్లి ఆయన కారులోనే గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం సాగిస్తుండడం వెనుక రాజకీయ కుట్ర ఉందని త్రిమూర్తులురాజు వర్గీయులు భావిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా రాజకీయంగా ఎంతో దర్పాన్ని చూపించే బాబూరావు ఇలా త్రిమూర్తులు రాజు ఇంటికి వెళ్లి మరీ కార్యక్రమాలకు హాజరవుతుండడంపై ఆయన నిజంగానే మారారా? లేదంటే టికెట్టు దక్కించుకునేందుకు కొత్త డ్రామా మొదలు పెట్టారా? అన్న కోణంలో త్రిమూర్తులురాజు వర్గీయులు ఆరా తీస్తున్నట్లు తెలియవచ్చింది.
అయితే నాలుగేళ్లుగా ఆర్థికంగా, మానసికంగా వేదన చెందుతూ ఎంఎల్‌ఏ టికెట్టు కోసం పార్టీని నియోజకవర్గంలో నిలబెట్టిన ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జి కె.త్రిమూర్తులురాజు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్టు ను వదులుకోరాదని గట్టిగా నిర్ణయించుకుం టున్నట్లు తెలుస్తోంది. గద్దెతో పాటు తాను కూడా డ్రామాలో మునిగిపోయి తన పని తాను చేసుకుంటే మంచిదని భావిస్తున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నా యి. దీంతో ఇద్దరూ కలిసి ఉంటూనే ఎవరి పని వారు చక్కబెట్టుకుంటున్నారు. అంతేకాకుండా గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు గాని, పార్టీలో చేరికల విషయంలో గాని ఆధిపత్య పోరు కూడా ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో గద్దె బాబూరావు పార్టీలో చేరిన వారం రోజుల్లోనే అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలియవచ్చింది. ఇద్దరం కలిసి పోయామంటూ చేతులు కలుపుతున్నా ఎవరి దారి వారిదే అన్న చందంగా వ్యవహరి స్తున్నారని ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది.
Advertisement
Advertisement