రోడ్డు ప్రమాదంలో చెన్నైవాసి దుర్మరణం | Chennai people died in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో చెన్నైవాసి దుర్మరణం

Published Thu, Oct 9 2014 12:33 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

రోడ్డు ప్రమాదంలో చెన్నైవాసి దుర్మరణం - Sakshi

రోడ్డు ప్రమాదంలో చెన్నైవాసి దుర్మరణం

 దువ్వ (తణుకు క్రైం) : తణుకు మండలం దువ్వ వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నైకు చెందిన మోనిషా ఆయిల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ అధినేత దేవరాజ్ సౌందర్‌రాజ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భార్యతో సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చెన్నై ఎంఆర్ నగర్‌కు చెందిన మోనిషా ఆయిల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ అధినేత దేవరాజ్ సౌందర్‌రాజ్ (42) తన భార్య కష్ము, కుమార్తె మోనిషా, కుమారుడు యశ్వంత్‌రాజ్‌లతో కలిసి వ్యాపార లావాదేవీలతో పాటు రాజమండ్రిలో బంధువులను కలిసేందుకు వచ్చారు. బుధవారం కుటుంబంతో కలిసి చెన్నైకు కారులో తిరుగుప్రయాణమయ్యారు. కారును సౌందర్‌రాజ్ నడుపుతున్నారు. తణుకు మండలం దువ్వలో జెడ్పీ హైస్కూల్ ప్రాంతానికి వచ్చేసరికి ఎదురుగా సైకిల్‌పై వస్తున్న బాలుడిని ఢీకొంది.
 
 దీంతో అదుపుతప్పిన కారు మూడు పల్టీలు కొట్టి రోడ్డు మార్జిన్‌లో ఉన్న ఐరన్ స్తంభం, మైలురాయిని ఢీకొట్టి పది అడుగుల దూరంలో పడింది. వెంటనే అందుబాటులో ఉన్న హైవే పెట్రోల్ పోలీసులు స్థానికుడైన సూరిబాబు సహాయంతో బాలుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవ్ చేస్తున్న సౌందర్‌రాజ్‌ను కారులోంచి బయటకు తీస్తుండగా మృతి చెందగా, అతని భార్య కష్ము రెండు కాళ్లు తుంటి భాగంలో ఎముకలు విరిగి లేవలేనిస్థితిలో ఉన్నారు. కాగా చిన్నారులు మోనిషా, యశ్వంత్‌రాజ్‌లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు కారులోంచి క్షతగాత్రులను బయటకు తీసి 108 వాహనంలో తణుకులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కష్ము పరిస్థితి విషమంగా ఉందని రెండు కాళ్ల తుంటి ఎముకలు విరిగినట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఉదయప్రకాష్‌రెడ్డి చెప్పారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లేక విజయవాడకు తీసుకువెళ్లాలని సూచించారు. రూరల్ పోలీసులు సంఘటనా ప్రాంతానికి పరిశీలించి వివరాలు సేకరించారు.
 
 అన్నదానం చేసి బయలుదేరారు..
 సౌందర్‌రాజ్ వ్యాపార లావాదేవీల నిమిత్తం వస్తూ బంధువులను కలిసి వెళ్లవచ్చనే ఉద్దేశంతో చెన్నై నుంచి కుటుంబసమేతంగా రాజమండ్రి వచ్చారు. తిరుగుప్రయాణం అయ్యేందుకు సిద్ధం కాగా, రాజమండ్రిలో తన వ్యాపార లావాదేవీలు చూస్తున్న గుమస్తా వెంకటేశ్వరరావు కోరిక మేరకు ఆ ప్రాంతంలో శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా సొంత ఖర్చులతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం చెన్నైకి బయలుదేరారు. తన యజమాని సౌందర్‌రాజ్ ఎంతో మంచివారని, రాజమండ్రిలో ఆయన వ్యాపార లావాదేవీలన్నీ తానే చూస్తుంటానని వెంకటేశ్వరరావు విలపిస్తూ చెప్పాడు. రాజమండ్రిలో గంట క్రితమే తన యజమానిని సాగనంపానని, అంతలోనే ఆయన అందనంత దూరానికి వెళ్లిపోయారని కన్నీరుమున్నీరయ్యాడు.
 
 నా భర్త ఎలా ఉన్నారు?
 ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన సౌందర్‌రాజ్ భార్య కష్ము చికిత్స పొందుతూనే తన భర్త పరిస్థితిపై ఆందోళనకు గురైంది. తన భర్త ఏమయ్యారని, ఎక్కడ ఉన్నారంటూ కంటతడిపెట్టింది. తన భర్తను చూడాలంటూ పట్టుబట్టడంతో సౌందర్‌రాజ్‌కు బాగానే ఉందని ఆసుపత్రి సిబ్బంది ఆమెను సముదాయించారు.
 
 అయోమయంలో చిన్నారులు
 ప్రమాదంలో తండ్రి చనిపోయి, తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఏమైందో తెలియక చిన్నారులు మోనిషా, యశ్వంత్‌రాజ్ బిత్తరచూపులు చూస్తుండటం స్థానికులను కలచివేసింది. గాయాలతో చికిత్స పొందుతూ ఏడుస్తూనే చిన్నారి మోనిషా తన కుటుంబ వివరాలు చెబుతున్న తీరు స్థానికులను కంటతడిపెట్టించింది.
 
 ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళుతూ..
 దువ్వ గ్రామానికి చెందిన బెల్లపుకొండ సుబ్బారావు కుమారుడు వరప్రసాదరాజు దువ్వ హైస్కూల్‌లో చేరే నిమిత్తం ప్రవేశ పరీక్ష రాసేందుకు సైకిల్‌పై స్కూల్‌కు వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం అమ్మమ్మ ఊరైన తూర్పు విప్పర్రులో చదువుతున్న కొడుకును దువ్వ హైస్కూల్‌లో చేర్పించేందుకు తండ్రి సుబ్బారావు తన కుమారుడిని బుధవారం ఉదయం హైస్కూల్‌కు తీసుకువచ్చాడు. అయితే మధ్యాహ్నం జరిగే పరీక్షకు హాజరుకావాలని ఉపాధ్యాయులు చెప్పడంతో ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం పరీక్షకు కుమారుడిని పంపి, తరువాత తాను వెళ్లవచ్చని భావించాడు. అలాగే కుమారుడిని ముందుగా స్కూల్‌కు పంపాడు. అయితే అనుకోని విధంగా ప్రమాదం జరిగి కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో తండ్రి సుబ్బారావు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తండ్రి వచ్చేవరకు బాలుడి వివరాలు తెలియకపోవడంతో మాతరం సేవా సంఘం, ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకారంతో బాలుడికి వైద్యసేవలందించారు. దువ్వ గ్రామానికి చెందిన మాతరం సేవా సంఘం నాయకులు కొల్లూరి సూరిబాబు, సిర్రా ధనరాజు, గంటా మురళీ క్షతగాత్రులకు తక్షణ సహాయ చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement