
హత్యకు గురికావడానికి గంట ముందు వెల్దుర్తి లీమ్రా ఫంక్షన్ హాల్లో పెళ్లికి హాజరైన నారాయణరెడ్డి
కర్నూలు: పత్తికొండ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపింది. వెల్దుర్తిలో పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న ఆయనను ప్రత్యర్థులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. పథకం ప్రకారం ఆయనపై దాడి చేసి, హతమార్చారు. ఈ సంఘటన జరగడానికి గంట ముందు నారాయణరెడ్డి.. వెల్దుర్తిలోని లీమ్రా ఫంక్షన్ హాల్లో పెళ్లికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి వారితో ఫొటోలు దిగారు. తన మద్దతుదారులతో పిచ్చాపాటి మాట్లాడారు.
అక్కడి నుంచి తిరిగివెళుతున్న ఆయనపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. కృష్ణగిరి వద్ద కాపుకాసి ఆయనను దారుణంగా చంపేశారు. కొద్దిసేపటి క్రితమే తమతో ఆనందంగా గడిపిన నారాయణరెడ్డి అంతలోనే హత్యకు గురయ్యారన్న విషయం తెలుసుకుని ఆయన మద్దతుదారుల హతాశులయ్యారు. తమ నాయకుడిని పొట్టనపెట్టుకున్న వారిని అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.