సాక్షి, కర్నూలు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ ఇన్‌ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి షాక్ తగిలింది. ఈ కేసులో డిప్యూటీ సీఎం కుమారుడు శ్యామ్ బాబుతో సహా మరో ఇద్దరిని నిందితులుగా చేర్చి, అరెస్ట్ చేయాలని డోన్ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. కాగా తన భర్త హత్య కేసు విచారణలో అన్యాయం జరిగిందంటూ చెరుకులపాడు నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. (చెరుకులపాడు నారాయణరెడ్డి గత ఏడాది మే 22న దారుణ హత్యకు గురైన విషయం విదితమే)
తన భర్త నారాయణరెడ్డితో పాటు మరో వ్యక్తిని అతి కిరాతకంగా హత్యచేసిన శ్యాంబాబు అనుచరులు అటు తరువాత పోలీసులపై ఒత్తిడి తెచ్చి చార్జీషీట్‌లో పేర్లు తొలగించుకోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం చేస్తూ... నిందితులుగా కేఈ శ్యాంబాబుతో పాటు ఆస్పరి జెడ్పీటీసీ కప్పెట్రాల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్‌ఐ నాగతులసీ ప్రసాద్‌లను తన భర్త హత్యకేసులో ముద్దాయిలుగా చేర్చాలని పేర్కొంటూ కర్నూలు జిల్లా డోన్ కోర్టులో శ్రీదేవి ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబు, బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్‌ఐ నాగప్రసాద్‌లను నిందితులుగా చేర్చాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment