ధర కొక్కొరొకో | Chicken Prices Rising | Sakshi
Sakshi News home page

ధర కొక్కొరొకో

Published Sun, Jun 7 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

Chicken Prices Rising

షాకిస్తున్న చికెన్ ధరలు
 కిలో రూ. 200 నుంచి రూ. 220
 ఉత్పత్తి తగ్గడమే కారణం
 
 తణుకు, తణుకు అర్బన్: మార్కెట్‌లో బ్రాయిలర్ కోడి చరిత్ర సృష్టిస్తోంది. ధర చుక్కలను తాకుతోంది. నాలుగు రోజుల క్రితం వరకు చికెన్ స్కిన్‌తో రూ. 140, స్కిన్‌లెస్ రూ. 160 సాగిన అమ్మకాలు ప్రస్తుతం స్కిన్‌లెస్ రూ.  200 లకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఎప్పుడూ వేసవిలో ధర తగ్గే చికెన్ ఈసారి కూడా వేసవి మొదట్లో స్కిన్‌తో రూ. 80, స్కిన్‌లెస్ రూ. 98 అమ్మకాలు జరిగాయి. వేసవి వడగాడ్పులు తీవ్రంగా ఉండడంతో కోళ్లు చనిపోయి సరుకు తగ్గిపోయింది. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో వచ్చిన బర్డ్‌ఫ్లూ కారణంగా కూడా తక్కువ ధర పలికింది. అనూహ్యంగా సరుకు ఉత్పత్తిలేక వేసవి మధ్యలోనే ఈ సంవత్సరం ధర పెరిగింది. కానీ ముగింపు దశలో మాత్రం కొనుగోలుకు తగ్గ సరుకు లేకపోవడంతో అధిక ధరలకు కొనుగోలు చేసి అమ్మాల్సిన పరిస్థితులు వచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కోడి లైవ్ ధర రూ. 110 నుంచి రూ. 120 వరకు పలుకుతుంది. కొన్ని దుకాణాల్లో స్కిన్‌లెస్ రూ. 200లకు అమ్ముతుండగా మరికొన్ని దుకాణాల్లో రూ.220 లకు అమ్ముతున్నారు.
 
 రెండు కేజీల్లోపే
 ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న కోళ్లు 1800 గ్రాముల నుంచి రెండు కేజీల్లోపు మాత్రమే ఉంటున్నాయి. వేసవిలో వడగాడ్పుల తాకిడికి కోళ్లు చనిపోవడం, ఇతర రాష్ట్రాల్లో వచ్చిన బర్డ్‌ఫ్లూ వ్యాధి కారణంగా సేల్స్ తగ్గడం సరుకు ఉత్పత్తి పడిపోవడం వంటి కారణాలతో ఇటీవలే కొత్తగా వేసిన కోళ్లు కావడంతో బరువు తక్కువగానే ఉంటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం స్థానికంగా కోళ్లు దొరక్కపోవడంతో ఏలూరులోని కొన్ని కంపెనీల నుంచి సరుకు దిగుమతి చేసుకుంటున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.
 
 దిగాలు పడ్డ చికెన్ ప్రియులు
 రెండు రోజులుగా చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో మాంసాహార ప్రియులు దిగాలు పడ్డారు. నాణ్యమైన మటన్ రూ. కేజీ రూ. 600 పలుకుతుండడంతో వేసవి మొదటి నుంచి ఎక్కువ మంది చికెన్ కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. కానీ చికెన్ ధర లు సైతం ప్రస్తుతం కొండెక్కడంతో దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చికెన్ ధరలు రెండు రోజులుగా పెరగడంతో హోటల్స్‌లో  సైతం మోతాదు తగ్గించి వడ్డిస్తున్నారని మాంసాహారులు అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement