నిఘా నీడన సీఎం పర్యటన..
సాక్షి, గుంటూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం నాటికే పూర్తి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం పర్యటన యావత్తూ పోలీస్ నిఘా నీడలో జరిగే విధంగా రూరల్, అర్బన్ జిల్లా ఎస్పీలు పీహెచ్‌డీ రామకృష్ణ, రాజేష్‌కుమార్ రెండు రోజులుగా కృషి చేస్తున్నారు. సీఎం పర్యటన ప్రధానంగా సత్తెనపల్లి నియోజకవర్గం, గుంటూరు నగరంలో జరగనుంది. ఈ రెండు చోట్లా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇద్దరు ఎస్పీలు, ఐదుగురు అడిషనల్ ఎస్పీలు, 30 మంది డీఎస్పీలు, 100 మంది సీఐలు, 200 మంది ఎస్‌ఐలు, మరో 200 మంది ఏఎస్‌ఐలు, 2,300 మంది కానిస్టేబుళ్లు, వెయ్యి మంది హోంగార్డులు, 50 ప్లాటూన్ల ఏఆర్ కానిస్టేబుళ్లు, 15 స్పెషల్ పార్టీలు, 200 మంది సాయుధ పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.
సీఎం పర్యటించే ప్రాంతాలను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు బాంబ్‌స్క్వాడ్‌ల ద్వారా తనిఖీలు పూర్తి చేశారు. గుంటూరులోని అన్ని లాడ్జిలు, వసతి గృహాలను ప్రత్యేక పోలీసు బలగాలు తనిఖీలు చేశాయి. అపరిచిత వ్యక్తులపై ఆరా తీశాయి.
గుంటూరులో బందోబస్తు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి నగరంలోని పోలీసు కవాతు మైదానంలో మంగళవారం మధ్యాహ్నం విధులు కేటాయించి వారికి అవసరమైన వాహనాలను సమకూర్చారు. సత్తెనపల్లిలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి బందోబస్తు విధులు కేటాయించారు.
సత్తెనపల్లి, గుంటూరులో హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేసిన ప్రాంతాల వద్ద హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. ముఖ్యమంత్రి విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు.
గుంటూరు నగరంతోపాటు, సత్తెనపల్లిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అవసరమైతే ట్రాఫిక్ మళ్లించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు.
సత్తెనపల్లి, గుంటూరులో సీఎం మీటింగ్ జరిగే రెండు చోట్లా ప్రత్యేక వైద్య బృందాలను ఉంచినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి తెలిపారు.
ఇంటెలిజన్స్, స్పెషల్ బ్రాంచ్
అధికారుల నిఘా..
గుంటూరు నగరంతోపాటు సత్తెనపల్లిలో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఇంటెలిజన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
పర్యటన జరిగే ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. సీఎం పర్యటనను పురస్కరించుకుని ఎవరైనా ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారా అనే విషయాలపై ఆరా తీశారు.
గుంటూరులో రెండు రోజులుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఆందోళన నిర్వహిస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకుల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. అలాగే యానిమేటర్లు, రాజధాని ప్రాంత రైతు సంఘాల నాయకులపై కూడా నిఘా ఉంచారు. వీరందరినీ బుధవారం ఉదయం అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.