రాష్ట్ర విభజనకు ముందే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసి.. తన పేరును ‘శిలాక్షరాల్లో’ చిరస్థాయిగా నిలుపుకోవాలనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశలకు ఆటంకాలు ఎదురయ్యేలా ఉన్నాయి.
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు ముందే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసి.. తన పేరును ‘శిలాక్షరాల్లో’ చిరస్థాయిగా నిలుపుకోవాలనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశలకు ఆటంకాలు ఎదురయ్యేలా ఉన్నాయి. సీఎం సమైక్యాంధ్ర జపం చేస్తూ తెలంగాణను అడ్డుకుంటున్నారని పార్టీలకతీతంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. మరికొద్ది రోజుల్లో రాష్ట్ర విభజన ఖాయం కానున్న నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి కాకుండానే కిరణ్‌కుమార్‌రెడ్డి హడావుడిగా జనవరి 5న ప్రారంభోత్సవం చేసేందుకు సిద్ధమయ్యారు. సొంతపార్టీ నేతలకు, చివరకు మంత్రి శ్రీధర్‌బాబుకు సైతం చెప్పకుండానే.. ఇంజినీరింగ్ అధికారుల ద్వారా సమాచారం అందించినట్లు తెలిసింది.
దీంతో మంత్రితోపాటు కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన విషయమై తనకు సమాచారం లేదని మంత్రి శ్రీధర్‌బాబు శనివారం కరీంనగర్‌లో విలేకరులతో వెల్లడించారు. తెలంగాణ విషయంలో ప్రజల పాలిట నరరూప రాక్షసుడిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జిల్లాకు వస్తే హెలిక్యాప్టర్ దిగకుండా తరిమికొడతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని ఇప్పటికే సీపీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు సన్నద్ధమవుతున్నారు.