ప్రజా సంక్షేమం కోసం పని చేస్తామంటూ ప్రతిన చేసిన మన ప్రజాప్రతినిధులు.. ఆ ప్రజలనే మరచిపోయిన కాలం దాపురించింది. అధికారానికి దూరంగా ఉన్న నేతలు ప్రజల తరఫున నిలబడి పోరాడడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. అధికార అందలాలను అధిరోహించి.. అమాత్యులై కూడా పాలనను గాలికొదిలి.. ప్రజలను పట్టించుకోవడం లేదంటే ఏమనుకోవాలి?! జిల్లా సమస్యల పరిష్కారానికి ప్రధాన వేదిక అయిన డీఆర్సీ గురించి కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ.. వారితో కుమ్మక్కు రాజకీయాలు నెరపుతున్న తెలుగుదేశీయులకు కానీ ఏమీ పట్టడంలేదు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా తూర్పు గోదావరి. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మన జిల్లా నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అధికార పార్టీ వారి సంఖ్యే అధికం. కాకినాడ, అరకు ఎంపీలు ఎంఎం పళ్లంరాజు, కిశోర్‌చంద్రదేవ్‌లు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఇంతమంది ఉన్నా ఇక్కడి ప్రజల గురించి కానీ, ఈ జిల్లా అభివృద్ధి గురించి కానీ.. ఇందులో కీలక భూమిక పోషించే జిల్లా అభివృద్ధి కమిటీ (డీఆర్సీ) సమావేశం గురించి కానీ వీరిలో పట్టించుకున్నవారే లేరు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉండే డీఆర్సీ సమావేశాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన మూడు నెలలకోసారి జరపాలి. అలా జరిగితే ఆ సమయంలో వచ్చే ప్రధాన సమస్యలపై చర్చించి, పరిష్కరించే వీలుంటుంది.
గత మార్చి తొమ్మిదో తేదీన అప్పటి హోం, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన డీఆర్సీ సమావేశం నిర్వహించారు. తరువాత తొమ్మిది నెలలుగా దీని ఊసే లేదు. చిత్రమేమిటంటే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరించిన తరువాత ఇంతవరకూ ఇన్‌చార్జి మంత్రి నియామకమే జరగలేదు. ఇటువంటి సర్కార్ తమ సమస్యలను ఏం పరిష్కరిస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డీఆర్సీ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, జాతీయ ఉపాధి హామీ, పంచాయతీరాజ్, గృహనిర్మాణం, నీటిపారుదల తదితర పలు శాఖల పని తీరును సమీక్షించి, అవసరమైన చర్యలు చేపట్టాలి. ఈ సమావేశం జరగకపోవడంతో ఆయా శాఖల పనితీరును పట్టించుకుంటున్నవారే లేరు.
మాట్లాడని మంత్రులు
తన అధ్యక్షతన జరిగే విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశానికి వచ్చి వెళ్లడమే తప్ప కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు డీఆర్సీ గురించి పట్టించుకోవడం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నప్పుడు జిల్లాలో అడుగుపెట్టే ధైర్యం చేయని ఆయన.. ఉద్యమం చల్లబడ్డ తరువాత జిల్లాకు వచ్చారు. రాష్ట్ర మంత్రి తోట నరసింహం కూడా డీఆర్సీ ఊసెత్తిన దాఖలాలే లేవు. తరచూ వివిధ కార్యక్రమాల పేరుతో హడావుడే తప్ప జిల్లా అభివృద్ధి గురించి కానీ, అసలు జిల్లాలో ఏం జరుగుతోందన్న అంశాన్ని కానీ ఆయన పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డీఆర్సీపై మంత్రులిద్దరూ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా డీఆర్సీలో జాప్యం జరిగిందని నేతలు సమర్థించుకునే యత్నం చేస్తున్నారని, అయితే ఈ ఉద్యమం వచ్చి మూడు నెలలే అయిందని, దానికి ముందు ఏం చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సమస్యలున్నా.. స్పందనే లేదు
పై-లీన్ తుపాను, ఆ తరువాత వచ్చిపడ్డ భారీ వర్షాలతో జిల్లాలో రైతులు, మత్స్యకార, చేనేత కుటుంబాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం ఇటువంటి సమయంలోనైనా బాధితులకు చేయూతనిచ్చే దిశగా డీఆర్సీ ఏర్పాటు చేసి ఉండాల్సిందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే, జిల్లాలో లక్షలాది మంది రైతుల ప్రయోజనాన్ని ఆశించి డెల్టా ఆధునికీకరణ, డ్రెయిన్లలో ముంపు సమస్య పరిష్కారంవంటి వాటి కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సుమారు రూ.1600 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులపై డీఆర్సీలో చర్చించే అవకాశం ఉన్నా స్పందించేవారే లేరు.
ఏం మంత్రులో..ఏంటో!
Published Wed, Nov 6 2013 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement